తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards – TGFA) నిర్వహించేందుకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో Telangana Film Development Corporation Limited (TGFDC) ప్రకటన విడుదల చేసింది.
2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు ఈ అవార్డులు వర్తించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా నిర్మాతలు, ప్రభుత్వ సంస్థల నుంచి వివిధ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీజీఎఫ్‌డీసీ తెలిపింది.
జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వం, చరిత్ర ఆధారిత చిత్రాలు, డెబ్యూ ఫీచర్ ఫిల్మ్స్, సంపూర్ణ కుటుంబ వినోదాత్మక చిత్రాలు వంటి విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. అలాగే సామాజిక సందేశాత్మక చిత్రాలు, యానిమేషన్ ఫిల్మ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఆధారిత చిత్రాలు, పిల్లల సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్‌కూ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇక వ్యక్తిగతంగా కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే అవార్డులు, తెలుగు సినిమాపై రాసిన పుస్తకాలు, విమర్శాత్మక వ్యాసాలు, అలాగే ఉర్దూ ఫీచర్ ఫిల్మ్స్ విభాగాల్లోనూ ఎంట్రీలకు అవకాశం కల్పించారు.
దరఖాస్తు ఫారాలు మరియు నిబంధనలు 2026 జనవరి 21 నుంచి టీజీఎఫ్‌డీసీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. ఒక్కో ఎంట్రీ ఫారానికి రూ.5,900 (18% జీఎస్టీతో సహా) ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ లేదా యూపీఐ ద్వారా “Managing Director, Telangana Film Development Corporation Limited” పేరిట, హైదరాబాద్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంట్రీ ఫారాల విక్రయానికి చివరి తేదీ జనవరి 31, మధ్యాహ్నం 3 గంటల వరకు కాగా, పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 3 గంటలలోపు టీజీఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
అవార్డుల విభాగాలు, అర్హతలు మరియు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీఎఫ్‌డీసీ సూచించింది.