Download App

తెలంగాణ నాయకులకు… ఏపీలో కాపుకుల నాయకులకు… పవన్ కళ్యాణ్ తో ‘తకరారు’ ఎందుకు…

జూన్ 5, 2026 By Suresh Thota
ప్రజాస్వామ్యంలో అధికారం మారవచ్చు, నాయకులు మారవచ్చు. కానీ మారకూడనిది రాజ్యాంగం పట్ల నిబద్ధత, మానవతా విలువలు. ఇటీవల తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తే, ప్రాంతీయ, కుల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం "పవన్ కల్యాణ్" ను తెలంగాణ లోకి...
తెలంగాణ నాయకులకు... ఏపీలో కాపుకుల నాయకులకు... పవన్ కళ్యాణ్ తో 'తకరారు' ఎందుకు...

ప్రజాస్వామ్యంలో అధికారం మారవచ్చు, నాయకులు మారవచ్చు. కానీ మారకూడనిది రాజ్యాంగం పట్ల నిబద్ధత, మానవతా విలువలు. ఇటీవల తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తే, ప్రాంతీయ, కుల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం “పవన్ కల్యాణ్” ను తెలంగాణ లోకి రానివ్వం అని కొందరు అంటే, సచివాలయంలోకి “పవన్ కళ్యాణ్‌” పెత్తనం చేయనివ్వబోమంటూ కొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.ఆంధ్రా కాంట్రాక్టర్లను అడుగుపెట్టనివ్వమని, వారికి కాంట్రాక్టు పనులు ఇవ్వబోమని కొందరు నేతలు హెచ్చరికలు, దానికి ప్రతిగా వచ్చిన కౌంటర్లు ఒకెత్తయితే… ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ను సొంత కులం పేరిట కొందరు టార్గెట్ చేయడం మరొకెత్తు. ఈ నేపథ్యంలో, సమాజాన్ని ముక్కలు చేసే విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వినిపిస్తున్న “సమగ్రత” గళంపై ఒక ప్రత్యేక విశ్లేషణ.

పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు

​గతంలో తెలంగాణ ఉద్యమ సెగలు, ఆ తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) నాయకత్వం “పవన్ కళ్యాణ్‌”ను తీవ్రంగా లక్ష్యం చేసుకుంది. విభజన జరిగి పుష్కర కాలం దాటింది. ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు దరిమిలా నెమ్మదిగా, ఆంధ్ర, తెలంగాణ వాదనలు , విమర్శలు, ప్రతి విమర్శలతో రెండు తెలుగు రాష్ట్రాలు హోరెత్తిపోయాయి. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వని స్థాయిలో ఇవి సాగాయి. తరువాత ఆయన ప్రెస్ మీట్ పెట్టడం….. దానికి కౌంటర్ గా తెలంగాణ మంత్రి “పొన్నం ప్రభాకర్” ప్రెస్ మీట్ లతో హోరెత్తిపోయింది. కాని కేటీఆర్ ఒక అడుగు ముందుకువేసి “పవన్ కళ్యాణ్‌ ఇంటికి వస్తె బిర్యానీ పెడతాం కానీ సచివాలయంలోకి రానివ్వం,” అనే ధోరణి లో BRS నేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక ప్రజా నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని నిలువరించాలని చూడడం ఎంతవరకు సబబు అని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కొందరు నెటిజన్లు సచివాలయంలోకి ఆచంట గోపీనాథ్, అరెకపూడి గాంధీ వంటి వారే కాక, ఇంకా ఆంధ్ర మూలాలున్న ప్రజాప్రతినిధులు లేదా నాయకులు యథేచ్ఛగా మీ హయంలోనే వచ్చారుగా అని అడుగుతూ, “పవన్ కళ్యాణ్” విషయానికి వచ్చేసరికి మాత్రం “ప్రాంతీయ కార్డ్”ను బయటకు ఎందుకు తీశారు. దీనికి కారణం “పవన్ కళ్యాణ్” పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషం కాదు, ఆయన ప్రశ్నించే తత్వానికి, ఆయనకు ఉన్న ప్రజాదరణకు భయపడడమేనని ఒక నెటిజన్ ప్రశ్నించడం గమనార్హం.

ఈ రకమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్న ప్రతిసారీ “పవన్ కళ్యాణ్” స్పందించిన తీరు బాధ్యతాయుతంగానే ఉంటుంది. “రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు తీసుకురాకండి” అని ఆయన గట్టిగానే హెచ్చరిస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఒక్కటేనని, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినా, ప్రజల మనసులు విడిపోకూడదని బలంగా ఆయన తన వాణిని వినిపిస్తున్నారు.

కోమటిరెడ్డి వర్సెస్ తలసాని…

​తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ విభేదాలు ఏ స్థాయికి చేరాయో చెప్పడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలే ఉదాహరణ. తెలంగాణలో “ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులివ్వబోమని, కావాలంటే ప్రత్యేక చట్టం తెస్తామని” మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే “తలసాని శ్రీనివాస్ యాదవ్” స్పందిస్తూ… కోమటిరెడ్డి దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వకుండా అసెంబ్లీలో చట్టం తీసుకురావాలని, అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ చేశారు. ఈ విధంగా నాటి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వ్యాపారానికి, పెట్టుబడులకు ప్రాంతీయ సరిహద్దులు పెట్టడం మూర్ఖత్వమని, ఇలాంటి వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడవు అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఇక్కడ కొంతమంది ఒక ప్రాథమికంగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు “నేను ఫలానా కులానికి, ఫలానా మతానికి లేదా ఫలానా ప్రాంతానికి మాత్రమే కట్టుబడి ఉంటాను” అని ప్రమాణం చేస్తారా…? అలా చేయరు కదా…. “భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తానని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తారు”. అలాంటప్పుడు ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో వివక్ష చూపించడం రాజ్యాంగ ధిక్కారమే అవుతుందిగా అని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.

భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరుడైన ప్రతి ఒక్కరికీ భారతదేశంలో ఎక్కడైనా నివసించే, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉంది. దేశ సమగ్రతను, ఐక్యతను దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలే తప్ప, “మా ప్రాంతం, మీ ప్రాంతం” అనే సంకుచిత మనస్తత్వం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది అని “పవన్ కళ్యాణ్” బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మీ “అయ్య జాగీరా” అనే పదం నీ నన్ను అడ్డుకోబోతున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా, కొంతమంది ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని ఆలోచిస్తుంటే…. కొంతమంది నాయకులు, జర్నలిస్టులు ఇది ఆరనివ్వకుండా రావణకాష్టం లా, రగిలిస్తూ ఉండేలా తమ వంతు కృషి చేస్తున్నారు.

తెలంగాణ నాయకులకు... ఏపీలో కాపుకుల నాయకులకు... పవన్ కళ్యాణ్ తో 'తకరారు' ఎందుకు...

ఏపీ లో పవన్ కళ్యాణ్ పై సొంత కుల నేతల దాడి…

తెలంగాణలో ప్రాంతీయ వివక్ష ఎదురైతే, ఆంధ్రప్రదేశ్‌లో “పవన్ కళ్యాణ్‌”కు కుల వివక్ష, సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు, మేధావులమని చెప్పుకునే వారు “పవన్ కళ్యాణ్‌”ను ఇష్టం వచ్చినట్టు విమర్శించడం, ఆయనను కేవలం ఒక కులానికి పరిమితం చేయాలని చూడడం నిత్యకృత్యమైపోయింది. ​”పవన్ కళ్యాణ్‌”ను సొంత కుల నేతలు విమర్శించడానికి ప్రధాన కారణం… ఆయన కుల రాజకీయాలను నమ్మకపోవడమే. ఆయన ఎప్పుడూ “నేను కాపుల నాయకుడిని” అని చెప్పుకోలేదు. పైగా ఆయన జాతీయ సమగ్రత దృష్టిలో మాట్లాడుతుంటే…. ఆయనను కొందరికే పరిమితం చేసే ఆలోచనలో, ఆయన సామాజిక వర్గ నాయకులు కృషి చేస్తున్నారు. ఈ కాపు నాయకులు నిజంగా నిలబడితే ఎంతవరకు రాజకీయాలలో నిలబడతారు అంటే చెప్పడం కష్టమే….. “వీళ్ళ మాటలు వింటుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజూ వీళ్లకి పోన్ చేసి ఈ రోజు నన్నుఏమిచేయమంటారు” అని అడగాలి అనే దృష్టి కోణంలో మాట్లాడుతున్నారు. ఆయన అన్ని కులాల్లోని పేదలకు న్యాయం జరగాలని ఆశిస్తుంటే, కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే కొందరు నేతలకు “పవన్ కళ్యాణ్” తీసుకునే “సమసమాజ నిర్ణయాలు” మింగుడుపడడం లేదు. అందుకే ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ​నిజానికి, “పవన్ కళ్యాణ్” తెలుగు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ప్రాంతీయవాదాన్ని తట్టుకుని, ఆంధ్రాలో కులవాదాన్ని ఎదుర్కొని ఆయన నిలబడటం చాలా ఓర్పు, సహనం తో కూడుకున్న విషయాలే, నాయకుడనే వాడు ఒక ప్రాంతానికో, ఒక కులానికో బందీ కాకూడదని ఆయన తన నడవడిక ద్వారా నిరూపిస్తున్నారు. రాజకీయ విమర్శలు విధానాల పరంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత లేదా సామాజిక దూషణలుగా మారకూడదు అనే ఆలోచన అందరిలోనూ ఆశక్తిని రేకెత్తిస్తుంది.

“ఆయనకు అభిమానులు అన్ని కులాలలోనూ, మతాలలోనూ ఉన్నారు. ఆయన నేను తెలంగాణలో నా అభిమానుల కోసం వచ్చాను, తప్ప ఇక్కడ రాజ్యాధికారం కోసంకాదు, అని చెప్పినా తెలంగాణ లో రాజకీయ నాయకుల లో ఎక్కడో పవన్ కళ్యాణ్ అంటే ఏదో శంక వేధిస్తుంది. అది ప్రాంతీయ రూపంలో ఈ విధంగా బయటకు వస్తుంది”. కొందరికి ప్రాంతీయ తత్వం రగిలిస్తుంటేనే రాజకీయ జీవితం లేకపోతే వాళ్ళు మనుగడ సాగించలేరు. మొన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో అందరూ తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతనే ఆయన చుట్టూ ఉన్నారు. ఇదే కొందరికి మింగుడుపడటం లేదు. కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది.

​ముగింపు: జాతి నిర్మాణం అనేది ద్వేషంతో సాధ్యం కాదు, కేవలం ప్రేమ మరియు సమగ్రతతోనే సాధ్యం. “పవన్ కళ్యాణ్” ఆశించే రాజకీయ మార్పు ఇదే. కులాలకు అతీతంగా, ప్రాంతీయ భేదాలకు దూరంగా, కేవలం ప్రజా సంక్షేమం మరియు దేశ సమగ్రతను మాత్రమే శ్వాసగా తీసుకునే నాయకత్వం నేటి అవసరం. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు విద్వేషాలను పక్కనబెట్టి, రాజ్యాంగ నైతికతను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల ఆశయాల వైపు అడుగులు వేయడమే తెలుగు రాష్ట్రాల భవితకు శ్రేయస్కరం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading