
ప్రముఖ నటి హన్సికా మోత్వాని తన భర్త సోహెల్ ఖతూరియాతో అధికారికంగా విడిపోయారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్న హన్సికా కోర్టును ఆశ్రయించగా, ఈ ప్రక్రియలో ఆమె ఎలాంటి అలిమనీ కోరలేదని సమాచారం.
హన్సికా మరియు సోహెల్ ఖతూరియా 2022 డిసెంబర్ 4న జైపూర్‌లో సంప్రదాయ హిందూ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి వేడుకలు ఆ సమయంలో సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
అయితే పెళ్లి తర్వాత కొంతకాలానికి వారి మధ్య అభిప్రాయ భేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. జీవన విధానం, ఆలోచనల్లో ఉన్న తేడాలు కారణంగా తరచూ విభేదాలు చోటుచేసుకున్నాయని సమాచారం. పరిస్థితులు మరింత కఠినంగా మారడంతో ఇద్దరూ కలిసి జీవించడం కష్టమైందని చెబుతున్నారు.

కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు వారిని మళ్లీ కలిపేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు పరస్పర అంగీకారంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ఈ నేపథ్యంలో 2024 జూలై నుంచి ఇద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు. అనంతరం కోర్టును ఆశ్రయించగా, తాజాగా బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.
