Download App

ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో ప్రకాష్ రాజ్…

ఏప్రిల్ 17, 2026 • By Suresh Thota
'అతడు' సినిమాలో ఒక డైలాగ్ చెబుతాడు ప్రకాష్ రాజ్ , కోట శ్రీనివాసరావు తో… "బాజిరెడ్డి గారు… శివారెడ్డి చస్తే మీరు సీఎం అవుతారు. కాని శివారెడ్డిని చంపితే నేరస్థుడు అవుతారు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు"… అని బహుశా ఈ డైలాగ్ మరచిపోయి ఉండొచ్చు...
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో ప్రకాష్ రాజ్…

‘అతడు’ సినిమాలో ఒక డైలాగ్ చెబుతాడు ప్రకాష్ రాజ్ , కోట శ్రీనివాసరావు తో… “బాజిరెడ్డి గారు… శివారెడ్డి చస్తే మీరు సీఎం అవుతారు. కాని శివారెడ్డిని చంపితే నేరస్థుడు అవుతారు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు”… అని బహుశా ఈ డైలాగ్ మరచిపోయి ఉండొచ్చు …. ప్రకాష్ రాజ్.

ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో “రామాయణం”పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన “రామ లక్ష్మణులను”…. “ఉత్తరాది నుండి వచ్చిన వలస కార్మికులు”గా అభివర్ణిస్తూ, రావణాసురుడుని దక్షిణాది గిరిజనుడుగా, ఆయన తోటలో రామ లక్ష్మణులు పండ్లు దొంగిలించారని, ఆ వివాదమే రామాయణ యుద్ధానికి దారితీసిందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల పై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది.

ముఖ్యంగా భారతీయ సంస్కృతి, కోట్లాది మంది హిందువుల ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రతీకగా, నిలిచిన రామాయణంలోని శ్రీరాముడు, లక్ష్మణులపై వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు అనేకమంది భక్తులను తీవ్రంగా బాధించాయి. ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తి మాటల భావ వ్యక్తీకరణ, బాధ్యత, సమాజంలో పరస్పర గౌరవం అనే అంశాల పై మళ్లీ చర్చ, ఆలోచన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

మొదటిగా భావ వ్యక్తీకరణ హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనది. ఒక వ్యక్తికి తన అభిప్రాయాలను వ్యక్తపరచే స్వేచ్ఛ ఉండాలి. అయితే, ఆ స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రత్యేకించి కోట్లాది మంది పూజించే దేవి,దేవతలు, పురాణ పురుషులు, పవిత్ర గ్రంథాల విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం.

ఉదాహరణకు, రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం ఒకటి అది ప్రజాస్వామ్యానికి అవసరం. కానీ అదే విమర్శను మతపరమైన అంశాలను, చిహ్నాలను ఉపయోగించి చేయడం అనేది చర్చ కంటే వివాదాన్ని ఎక్కువగా సృష్టిస్తుంది.

ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం ఏమిటి అన్నది కూడా పరిశీలించాలి. కొంతమంది దీన్ని రాజకీయ వ్యంగ్యంగా భావించవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే, వ్యంగ్యానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఒక మెసేజ్ ఇవ్వాలంటే దానికి అనుకూలమైన మార్గం ఎంచు కోవాలి.

ఉదా:- ఉత్తర , దక్షిణ రాజకీయాలు, భాషా వివాదాల పై మాట్లాడాలంటే వాటిని నేరుగా చర్చించవచ్చు. కానీ రామాయణం వంటి పవిత్ర ఇతిహాసాన్ని మార్చి చెప్పడం ద్వారా సందేశం ఇవ్వాలనుకోవడం ఇది ఆలోచనాత్మక విమర్శ కంటే, నలుగురి దృష్టి ఆకర్షించాలి అనే తత్వానికి దగ్గరగా ఉంటుంది.

ఈ సంఘటనలో స్పష్టంగా కనిపించిన విషయం సమాజంలో ఉన్న భావోద్వేగాల తీవ్రత. కోట్లాది మంది భగవంతుడి గా కొలుస్తారు శ్రీరాముడిని, కేవలం ఒక పాత్రగా కాకుండా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావిస్తారు. అలాంటి సందర్భంలో ఇలాంటి వ్యంగ్య వ్యాఖ్యలు సహజంగానే ప్రతికూల పరిస్థితులకు, ప్రతిస్పందనకు దారి తీస్తాయి. ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది హిందూ సంస్కృతి పట్ల ఉన్న అనుబంధం.

ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎలా స్పందించాలి అన్నది కూడా ముఖ్యం. కోపంతో స్పందించడం తాత్కాలిక ఉపశమనం అవ్వొచ్చు, కానీ దీర్ఘకాలంలో ఉపయోగం ఉండదు. బదులుగా, వాస్తవాలను, విలువలను స్పష్టంగా తెలియజేస్తూ, స్పందించడం సమాజానికి ఉపయోగకరం. అంటే చట్టపరం గా, న్యాయపరంగా భవిష్యత్తు లో మరొకరు ఈ విధంగా మాట్లాడటానికి భయపడెట్టుగా ఉండాలి.

సారాంశం: భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ అవసరం కానీ అది బాధ్యతతో కూడి ఉండాలి. ముఖ్యంగా కోట్లాది మంది విశ్వసించే ఆధ్యాత్మిక విషయంలో మాటలు మరింత జాగ్రత్తగా ఉండాలి. విమర్శ, చర్చ అవసరమే కానీ అవి గౌరవం కోల్పోకుండా, విచక్షణతో ఉండాలి.

“విశ్వాసాలను దెబ్బతీసే మాటలు మాట్లాడటం వ్యంగ్యం కాదు, అవగాహన పెంచే మాటలే సమాజాన్ని, మిమ్మల్ని ముందుకు తీసుకెళతాయి. లేకపోతే ముందు ముందు కోర్టు మెట్లు ఎక్కి ప్రజల ముందు అభాసుపాలు అవుతారు”… ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో ప్రకాష్ రాజ్…. బహుశా అతడు సినిమా మరచిపోయి ఉండొచ్చు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading