సినిమా వార్తలు

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్ రిలీజ్.. దుల్కర్‌పై ప్రశంసల వర్షం!

Published by
Srinivas

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించిన ఆయన, దుల్కర్ సల్మాన్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్టీఆర్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో, “#IAmGame ట్రైలర్‌లోని ఫైరీ వైబ్ నాకు చాలా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది. నా సోదరుడు దుల్కర్ మరో స్పెషల్ మూవీతో వస్తున్నాడనే నమ్మకం కలిగింది. ఈ సినిమా అతనికి భారీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అతనితో పాటు మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు దుల్కర్ అభిమానులు కూడా ఈ ట్వీట్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఐ యామ్ గేమ్’ చిత్రం 2026 ఆగస్టు 20న ఓణం కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా రూపొందుతోంది. ‘ఆర్డీఎక్స్’ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ ఛేజ్ సీక్వెన్స్‌లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ఇంతకు ముందెన్నడూ కనిపించని అల్ట్రా-స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో భారీ స్పందనను అందుకోగా, ఇప్పుడు ట్రైలర్ కూడా అదే స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసింది. పరిశ్రమలోనే అత్యంత భారీ విడుదలల్లో ఒకటిగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి సాజిర్ బాబా, ఇస్మాయిల్ అబూబక్కర్, బిలాల్ మొయిదు స్క్రీన్‌ప్లే అందించగా, సాజిర్ బాబా, ఆదర్శ్ సుకుమారన్, షబాస్ రషీద్ సంభాషణలు రాశారు. సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చగా, జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రఫీ విజువల్‌గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలను అన్బరివ్ మాస్టర్స్ రూపొందించారు. ఈ చిత్ర సంగీత హక్కులను జీ మ్యూజిక్ సొంతం చేసుకుంది.

దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’లో ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కాయడు లోహర్, కథిర్, పార్థ్ తివారీ, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts