“అతి సర్వత్రా వర్జయేత్” ఇది చిన్నప్పటి నుండి మనకు తెలిసినదే, మనవరకు వచ్చేటప్పటికి మనకు తెలుసులే అంతా అనే భావన కు లోనై, ఆ భావాలను అన్నిటిని తొక్కేస్తాము. అలాగే కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా సభా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.
నీవు ఒక ముఖ్యమైన భూమిక పోషించే స్థాయిలో ఉన్నప్పుడు, ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. నీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. దానిని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగానీ మైక్ చేతిలో ఉంది అని ఇష్టారాజ్యం గా మాట్లాడకూడదు. సినిమా పుట్టినప్పటి నుండి, హేమా హేమీలైన నిర్మాతలు, యోధానుయోధులుగా కీర్తింపబడ్డవారు, కాలగర్భంలో కలిసిపోయారు. కొంతమంది కి కాస్త కీర్తి మిగిలితే, కొంతమందికి ఆస్తులు మిగిలాయి, మరికొంత మంది కి కన్నీళ్లు మిగిలాయి. మనం ముదుసలి వాళ్ళం అవుతాము. సినిమా ఇండస్ట్రీ మాత్రం నిత్య యవ్వనవతి…. ఎందరో వస్తుంటారు. అందుచేత కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి.
ఒక దర్శకుడు మంచి ఫామ్ లో ఉండగా, తన కుటుంబ సభ్యుడిని హీరో గా లాంచ్ చేస్తూ, నేను అనేకమందితో సూపర్ హిట్స్ ఇచ్చాను. ఇప్పుడు మా వాడిని హీరో గా లాంచ్ చేస్తున్న, మా వాడిని ఏ నిర్మాత కు ఇవ్వను…. మా బ్యానర్ లో మాత్రమే నటిస్తాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఆ హీరో ను ఎవ్వరికీ ఇవ్వవలసిన అవసరం రాలేదు. ఏ నిర్మాత కూడా అడగలేదు. ఆ హీరో వాళ్ళ ఇంటిలోనే పచార్లు చేసుకుంటూ కూర్చున్నాడు.
అలాగే కొంతమంది నిర్మాతలు ఎంత అహంకారం తో మాట్లాడుతున్నారు అంటే… ఒక సినిమా కి పదిహేను వందలు ఖర్చు పెట్టలేరా…. అంత తక్కువకు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అన్నారు… అవును నిజమే…. మీ మీద నమ్మకం తో అంత ఖర్చు పెడితే అంత ఎంటర్టైన్మెంట్ ఫీల్ కాకపోతే ఎవర్ని అడగాలి… గాలికి ఎగిరిన పేలా పిండి కృష్ణార్పణమేనా….
ఇంకో ప్రొడ్యూసర్ వేదిక మీద వెంట్రుక చూపించి…. సంస్కారం గురించి ఎంత బాగా చెప్పారంటే…. ఇక్కడ బాగోదు కాబట్టి వూరుకుంటున్న, లేకపోతే వేరే చోట పీకి చూపించేవాడ్ని అన్నాడు. ఇదా సభా సంస్కారం…. పైగా ఈయన ఒక రాజకీయ పార్టీ లో కీలకమైన స్థానం లో ఉన్నారు. రేపు ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లో…. ఆయనకు అటువంటి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఆలోచించుకోవాలి.
తెలుగు సినిమా ఆర్థికంగా ఎదిగి ఉండొచ్చు… నైతికంగా పడిపోతుంది. వేదికమీద ఎలా మాట్లాడాలి అని చెప్పే పెద్దవాళ్ళు… దాసరి నారాయణరావు లాంటివారు లేరు… ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళు మందలించరు అని ఒక సీనియర్ అగ్ర నిర్మాత వ్యాఖ్యానించడం గమనార్హం. నేటి పెద్దలు …. మాట వరుసకు కూడా చెప్పరు… ప్రజలు మాత్రం గమనిస్తూనే ఉంటారు అని వాపోయారు.
ఇక కులాల కురుక్షేత్రంలో మగ్గిపోతున్న…. NRI అభిమానులు…. కొందరి మాటలు నమ్మి ఇక్కడ వారికి పెట్టుబడులు పెడుతున్నారు…. నేను ఆ హీరో కి క్లోజ్… ఈ హీరో కి క్లోజ్ అని అన్న వాళ్ల మాటలు విని కొందరు… అక్కడ రాత్రి, పగలు సంపాదించి ఇక్కడ వారి చేతుల్లో సొమ్ములు పెట్టీ ఆర్థికంగా మోసపోతున్న NRI లు ఎంతోమంది ….ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నారు. ఇక్కడ చాలా మంది నిర్మాతలు ఏదో ఒక రాజకీయ పార్టీ తో అంటకాగడం వలన ఏమి చేయలేని దైన్య స్థితి లో ప్రవాస భారతీయులు నలిగిపోతున్నారు.
అలా డబ్బు ఏదో విధంగా పుట్టడంతో నోటికి అడ్డూ, అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. “పశువు కి తింటే బలం… మనిషి కి ఉంటే బలం” అన్నారు పెద్దలు. ఈ అతి మనిషిని ఎక్కడి వరకు తీసుకువెళుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఎంత మంది ని మేము చూడలేదు అంటున్నారు. సీనియర్ నిర్మాతలు, సినీ విశ్లేషకులు.