వార్తలు

ఇరాన్ ఉద్యమం ఆగేదెన్నడు….?

Published by
Srinivas

పిల్లి ని కూడా గదిలో బంధిస్తే పులి లా మారుతుంది అంటారు, మన పెద్దలు అది నిజమే అని ఇరాన్… చరిత్ర ని పరిశీలిస్తే అవగతమవుతుంది… స్వేచ్ఛ అనుభవించిన తరువాత మనిషి ని… కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే… కోపాగ్ని ఏ స్థాయిలో ఉంటుందో, దాని పర్యవసాన పలితం ఏ విధంగా ఉంటుందో, అనడానికి నిదర్శనం ఇరాన్.

స్వేచ్ఛ, ఆకలి, ఆత్మాభిమానం, ఈ మూడు ప్రపంచంలోని ప్రతి ఉద్యమానికి నాంది. నేటి ఇరాన్ లో ఆకలి, స్వేచ్ఛ కోసం ఉద్యమం డిసెంబర్ 28 నుండి ప్రారంభమైనది. రోజు , రోజుకు పతాక స్థాయిలో ఇరాన్ మొత్తాన్ని దావాగ్ని లా చుట్టుముడుతూ అగ్నిగుండం లా తయారు అయ్యింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు, మిగతా నగరాలైన ఇస్ఫహాన్, మషాద్, షిరాజ్, తబ్రీస్… మొదలగునవి, అగ్ని పర్వతంలా మండుతున్నాయి

దేశమంతా ఒకటే మాట “ముల్లాలు దిగిపోవాలి.” ఇది మతానికి వ్యతిరేక ఉద్యమం కాదు. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ మీద ప్రజల తిరుగుబాటు. డాలర్ విలువ 825% కూలిపోయింది. 2018లో 1$ డాలర్ కు 55,000 రియాల్స్, ఇప్పుడు 1$ డాలర్ కు 14 లక్షల రియాల్స్. డాలర్ నిల్వలు $300 బిలియన్ నుంచి $30 బిలియన్‌కు పడిపోయాయి.

ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. చాలా కుటుంబాలు రోజుకు ఒక పూట మాత్రమే రోటీ, బ్రెడ్ మాత్రమే తింటున్నాయి. ఇవి దొరకడం కూడా గగనం గా మారింది. కనీస అవసరం అయిన నీళ్లు కూడా అంతంత మాత్రమే…. ఈ ఉద్యమం లో రమారమి రెండు వేల మంది పైగా చనిపోయారని అనధికార అంచనా… కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు. ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఇవ్వడం తో కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రభుతం ఎంత ప్రయత్నించినా, ప్రజల తిరుగుబాటు ఆగడం లేదు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఇంటెలిజెన్స్, మొరాలిటీ పోలీస్, ప్రైవేట్ ఆర్మీలు అన్నీ కలిసి కూడా ఈ ఉద్యమాన్ని అణిచివేయలేకపోతున్నాయి.

అసలు ఇరాన్ చరిత్ర పరిశీలిస్తే…

1911లో ఇరాన్ రాజ్యాంగ విప్లవం తర్వాత నుండి దేశం రాజకీయ అస్థిరతలో ఉంది. ఖజార్ వంశ రాజు అహ్మద్ షా పాలనలో దేశం బలహీనంగా ఉండటం తో.. నిజమైన అధికారం…. బ్రిటన్, రష్యా చేతుల్లో ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత, 1925 లో ఖజార్ వంశాన్ని కూలదోసి… రేజా షా పహ్లవి రాజయ్యాడు. అక్కడ నుండి పహ్లావి వంశం చేతిలో ఉంది.

పహ్లవి రాజవంశం 1925-1979 వరకు ఇరాన్‌ను పాలించింది. 1925 నుంచి పహ్లవీ రాజవంశ పాలనలో ప్రధాన రాజులు…. రెజా షా పహ్లవి (1925-1941) మరియు అతని కుమారుడు మొహమ్మద్ రెజా పహ్లవి (1941-1979).

1979 ఇస్లామిక్ విప్లవం ద్వారా అయతుల్లా రుహోల్లా ఖొమైనీ నేతృత్వంలోని ప్రజలు, మత నాయకులు, సైన్యం “పహ్లావి” లను అధికారం నుండి దించేశారు. ఫిబ్రవరి 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించబడింది. ప్రస్తుతం ఆయూతుల్లా ఖమేని మత పెద్ద గా కొనసాగుతున్నారు. ఇరాన్ జనాభాలో 95% షియా ముస్లింలు, మిగిలినవారు సున్నీలు, ఇతర చిన్న మతాలవారు.

1979 వరకు స్వేచ్ఛ ను అనుభవించి, తరువాత కాలంలో స్త్రీలకు స్వేచ్ఛ ను హరించడం ద్వారా…. నెమ్మదిగా అసంతృప్తి మొదలైంది మహిళల లో , వాళ్ళకు విధించిన కట్టుబాట్లతో తిరుగుబాటు మొదలైంది. సైన్యం సహాయంతో అణగదొక్కేశారు. రెండు సంవత్సరాల క్రితం 22 ఏళ్ల మహసా అమీనీ అనే మహిళ ను హిజాబ్ సరిగా ధరించలేదని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసారు. మూడు రోజుల తర్వాత హాస్పిటల్ లో ఆమె మరణించింది అని ప్రభుత్వం ప్రకటించింది. ఇది పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది.

ఇరాన్ చట్టాల ప్రకారం ఇరాన్‌లో మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో హిజాబ్ తప్పనిసరిగా ధరించాలి. సిగిరెట్ లను తాగకూడదు. మత పెద్దలను, ముల్లా లను గౌరవించాలి. లేకపోతే కటిన శిక్షలు కి గురి అవుతారు . ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. అయతుల్లా ఖమేని ఫోటోకి నిప్పు అంటించి దానితో ఒక యువతి సిగరెట్ వెలిగించు కోవడం తో అక్కడ స్త్రీ లలో ఎంత అక్కసు, ఆక్రోశం ఉందో ప్రపంచానికి అర్ధం అవుతుంది. ఇప్పుడు మహిళలే అక్కడ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు.

అమెరికా , ఇజ్రాయెల్ తో శత్రుత్వం వలన, వాళ్ళు విధించిన ఆంక్షలు మూలంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ని అమ్ముకోలేని దుస్థితి లో ఉన్నారు. అణు అస్త్రాలు ఉన్నాయని అమెరికా, ఇశ్రాయేల్ అనుమానిస్తున్నాయి. ఇతర ముస్లిమ్ దేశాలు సహకరించడం లేదు. ఏ విధంగా చూసినా ప్రజలు, దేశం అన్ని విధాల నాశనం అయిపోతుంది. ప్రజలకు ఏమి హాని జరిగినా మేము ఎంటర్ అవుతాము అని అమెరికా హెచ్చరిస్తుంది. వచ్చేవారం నాటికి ఈ ఉద్యమం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

Srinivas