జాతీయం

తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. రేపు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం

Published by
Suresh Thota

విజయ్ సారథ్యంలో Tamilaga Vettri Kazhagam (టీవీకే) ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు.

శుక్రవారం సాయంత్రం చెన్నై రాజ్‌భవన్‌లో గవర్నర్ R. V. Arlekar ను విజయ్ కలిశారు. ఈ సందర్భంగా టీవీకేకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల లేఖలను గవర్నర్‌కు అందజేసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. సంఖ్యాబలం పట్ల సంతృప్తి చెందిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధికారికంగా అనుమతి ఇచ్చారు.

ఇదిలా ఉండగా, కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని Jawaharlal Nehru Stadium లో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయ్ గవర్నర్‌ను కలవడం ఇది మూడోసారి కావడం విశేషం. విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో టీవీకేకు మొత్తం 107 మంది ఎమ్మెల్యేల బలం లభించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 118 కావడంతో మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది.

ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించడంతో సంఖ్యాబలం 112కు చేరింది. అనంతరం ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న Viduthalai Chiruthaigal Katchi (వీసీకే), Communist Party of India (సీపీఐ), Communist Party of India (Marxist) (సీపీఎం) కూడా బేషరతుగా మద్దతు ప్రకటించాయి. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు సంపాదించగలిగింది.

ఇక ఇద్దరు ఎమ్మెల్యేలున్న Indian Union Muslim League (ఐయూఎంఎల్) కూడా టీవీకేకు మద్దతు తెలపడంతో విజయ్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 120కు చేరుకుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.