Download App

విజయ్ దేవరకొండ ‘రణబాలి’కి మూలం అదేనా..? వామ్మో.. కత్తి మీద సాము..

జనవరి 27, 2026 By Suresh Thota
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న,జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో… మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబో క్రేజీ మూవీ "రణబాలి" టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రానున్న ఈ సినిమా…. ప్రసిద్ధ రచయిత బండి నారాయణ స్వామి...
విజయ్ దేవరకొండ 'రణబాలి'కి మూలం అదేనా..? వామ్మో.. కత్తి మీద సాము..

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న,జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో… మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబో క్రేజీ మూవీ “రణబాలి” టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రానున్న ఈ సినిమా…. ప్రసిద్ధ రచయిత బండి నారాయణ స్వామి “శప్తభూమి” నవల ఆధారంగా తెరకెక్కుతుంది.

“రణబాలి” అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, తన మాతృభూమి కోసం పోరాడే పాత్రలో నటిస్తుండగా… ప్రతినాయకుడు గా హాలీవుడ్ సినిమా ‘మమ్మీ’ ఫేమ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా, ఈ పాన్ ఇండియా మూవీ రూపొందుతుంది.

“శప్తభూమి” నవల రచయిత బండి నారాయణ స్వామి, 2019లో ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈయన అనంతపురం జిల్లాలోని, దిగువపల్లి గ్రామంలో (ప్రస్తుత సత్యసాయి జిల్లా) జన్మించారు. ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. దాదాపు 30 ఏళ్లకు పైగా విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, సమాజంలోని సమస్యలను తన కలం ద్వారా విశ్లేషించారు.

రాయలసీమ చరిత్రను, సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసిన అతికొద్ది మంది రచయితలలో ఈయన ఒకరు. అచ్చమైన రాయలసీమ వాసి, అందుకే ఆయన రచనల్లో ఆ ప్రాంతపు మట్టి వాసన, కరువు, కష్టాలు, మరియు అక్కడి ప్రజల తెగింపు స్పష్టంగా కనిపిస్తాయి. ​ఈయన రచనలు సహజత్వం కలిగి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ​చరిత్ర అంటే కేవలం రాజుల యుద్ధాలు, విజయాలు కాదు, సామాన్య జనం అనుభవించిన వేదన అని నమ్మే రచయిత ఈయన. అందుకే ఈయనను “ప్రజా రచయిత” అని పిలుస్తారు.

“శప్త భూమి” ఆయనకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టిన నవల. ఇంకా “రెక్కల పయనం”, “వీరగాథ” లాంటి వే కాకుండా , వందలాది కథలు రాశారు. ఆయన చేసిన సాహిత్య సేవకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారిచే ‘కళారత్న’ పురస్కారం తో పాటు పలు ప్రతిష్టాత్మక సాహిత్య సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు.

నవల పేరు “శప్త భూమి” అని ఎందుకు పెట్టీ ఉండొచ్చు అంటే…. రాయలు ఏలిన సీమ… రతనాల సీమ… తదనంతర కాలంలో శాపగ్రస్త మైంది… శాపగ్రస్త జీవితాల నేపథ్యంలో సాగే రచన ఇది… అని అలా పేరు పెట్టీ ఉండవచ్చు.

విజయ్ దేవరకొండ 'రణబాలి'కి మూలం అదేనా..? వామ్మో.. కత్తి మీద సాము..

ఇది ఒక చారిత్రక నవల. 18వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను, ముఖ్యంగా పాళెగాళ్ళ వ్యవస్థను ఈ పుస్తకంలో అద్భుతంగా చిత్రించారు. ​ చరిత్రను కేవలం రాజుల కోణంలోనే కాకుండా, సామాన్య ప్రజల జీవనశైలిని మరియు ఆచార వ్యవహారాలను కూడా జోడించి ఈ నవలను రాశారు.

అనంతపురం ప్రాంతపు అచ్చమైన, స్వచ్ఛమైన రాయలసీమ మాండలికాన్ని ఈ నవలలో అద్భుతంగా ఉపయోగించారు. ఆ భాషలో ఉండే సహజత్వం, పౌరుషం, ఆర్తి… ఈ కథకు ప్రాణం పోశాయి. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత పాళెగాళ్ల వ్యవస్థ ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

నవలలో వందలాది పాత్రలు ఉన్నప్పటికీ, ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మనుషుల స్వభావం అధికారం కోసం జరిగే కుట్రలు, మరియు మానవీయ సంబంధాలను రచయిత చాలా లోతుగా విశ్లేషించారు.

రాయలసీమ ప్రాంతంలోని కరువు పరిస్థితులు, ప్రజల వలసలు మరియు భూమి కోసం సాగే పోరాటాలను రచయిత మనసులు హత్తుకునే విధంగా వర్ణించారు. “శప్తభూమి” అనే పేరులోనే భూమితో మనిషికి ఉన్న విడదీయలేని అనుబంధం కనిపిస్తుంది. భూమి అనేది కేవలం మట్టి కాదు, అది ఒక సంస్కృతికి, పోరాటానికి మరియు మనుగడకు మూలం అనే తాత్విక కోణాన్ని చాటి చెబుతుంది.

నవలలో పాళెగాళ్ల వ్యవస్థ గురించి ఉంటుంది. భూమి ఎవరి చేతుల్లో ఉంటే అధికారం వారి చేతుల్లో ఉంటుంది. ఈ భూమిని దక్కించుకోవడం కోసం జరిగిన కుట్రలు, దాని కోసం చిందిన రక్తం, మరియు ఆ భూమిని నమ్ముకుని బతికే సామాన్యుల, అణగారిన వర్గాల వ్యధ… తరాలు మారినా, పాలకులు మారినా, భూమి మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆ భూమి సాక్షిగా జరిగిన మానవ పరిణామ క్రమమే ఈ “శప్తభూమి”.

ఈ నవల ను ఎంచుకోవడంలోనే “రణబాలి” దర్శకుని ప్రతిభ కనపడుతుంది. ఇది కత్తి మీద సాము లాంటిదే… ఎంతవరకు దర్శక, నిర్మాతలు కృతకృత్యులవుతారో… సెప్టెంబర్ 11 తేదీ వరకు… వేచి చూడవలసిందే.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading