
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి శ్రీమతి వి.వి. సుమలతా దేవి హైదరాబాద్‌లో జరిగిన ఘనమైన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. యూనియన్ చరిత్రలో తొలిసారి మహిళ అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికవడం సినీ నృత్య కళాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ, యూనియన్‌కు మహిళ నాయకత్వం రావడం ఎంతో సంతోషకరమని, సుమలతా దేవి నాయకత్వంలో TFTDDA మరింత బలంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సినీ కార్మికులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తానని, యూనియన్‌కు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.

అధ్యక్షురాలు సుమలతా దేవి తనను నమ్మి ఓట్లు వేసిన సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్‌లోని ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తానని, సభ్యుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా డ్యాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులకు మరింత భద్రత, గౌరవం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ, యూనియన్‌లో ఉన్న సమస్యలను కోర్టుల దాకా తీసుకెళ్లకుండా, ఐక్యతతో పరిష్కరించుకోవాలని సూచించారు. నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ, జానీ మాస్టర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని, ఇప్పుడు సుమలతా దేవి విజయం యూనియన్‌కు మంచి భవిష్యత్తును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ తరఫున కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ, తమపై నమ్మకంతో గెలిపించిన ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు. యూనియన్‌లోని ప్రతి సభ్యుడికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడమే తమ ముఖ్య లక్ష్యమని, ఈ విషయాన్ని రామ్ చరణ్‌కు తెలియజేయగానే ఆయన ఆర్థిక సహాయం అందించారని వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో రిటైర్ అయ్యే సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని తన ఆకాంక్షగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు, సినీ రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకతో TFTDDAలో మహిళా నాయకత్వంతో కూడిన కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టు అయింది.
