కరూర్ తొక్కిసలాటపై కాంతార హీరో రిషబ్ శెట్టి వ్యాఖ్యలు
October 8, 2025 Published by Srinivas

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన విజయ్ రాజకీయ ప్రచార ర్యాలీ సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ ఘటనపై కాంతార హీరో రిషబ్ శెట్టి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు.
“కరూర్ తొక్కిసలాట అనేది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. ఇది పూర్తిగా ఒక దురదృష్టకరమైన ఘటన. ఇలాంటి సంఘటలు జరిగినప్పుడు ప్రభుత్వం, పోలీసులపై నిందలు వేయడం చాలా ఈజీనే, కానీ అసలు సమస్యను అర్థం చేసుకోవాలి. ఎక్కువ జన సమూహాన్ని ఒకేచోట నియంత్రించడం చాలా కష్టం. ఇది ఒక్కరి తప్పు కాదు, సమిష్టి పొరపాటు. ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. కానీ ఇలాంటి ఘటన జరగడం అనేది నిజంగా దురదృష్టకరం. అభిమానులు కూడా ఇలాంటి సందర్భాల్లో క్రమశిక్షణగా ఉండాలి.” అని తెలిపారు.
రిషబ్ శెట్టి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయన హృదయపూర్వక స్పందనను అభినందిస్తున్నారు.
ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే — గత నెల 27న టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కరూర్‌లో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కేవలం 10 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, విజయ్‌ను చూడటానికి 50 వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. పరిమిత స్థలంలో అంతమంది ఒకేసారి గుమికూడడంతో తొక్కిసలాట జరిగింది.
