
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్ మార్క్‌ను దాటేసిన ఈ సినిమా.. ప్రస్తుతం ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటరైంది. మొదటి నుంచి సినిమాపై మేకర్స్ పెట్టుకున్న నమ్మకానికి.. థియేటర్లలో వస్తున్న ప్రేక్షకుల స్పందన మరింత బలాన్ని ఇస్తోంది.
‘కొరియన్ కనకరాజు’కు పాజిటివ్ బజ్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే మొదలైంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ సినిమాకు మంచి ప్రమోషన్‌గా మారింది. దీంతో విడుదలైన తర్వాత ప్రతి రోజూ సినిమాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ మూవీ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది. అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌కు సినిమా చేరువైంది.
సినిమా సక్సెస్‌లో కామెడీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరుణ్ తేజ్, సత్య కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. హారర్, కామెడీ, సూపర్‌నేచురల్ అంశాలను కలిపి మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను కూడా ఆకట్టుకుంటోంది.

బాక్సాఫీస్ పరంగా చూస్తే.. ‘కొరియన్ కనకరాజు’ తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మూడు రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్ దాటడంతో ఇప్పుడు సినిమా కలెక్షన్స్‌పై ప్రాఫిట్ పరంగా అంచనాలు పెరిగాయి.
ఇక సోమవారం తెలంగాణలో బోనాలు సెలవు ఉండటం సినిమాకు మరో అడ్వాంటేజ్‌గా మారింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా ఉండటంతో హాలిడే రోజు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వీకెండ్‌లో వచ్చిన మౌత్ టాక్‌ను సినిమా ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ రికవరీ దశను దాటేసి లాభాల బాటలోకి వెళ్లింది. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎంతటి ప్రాఫిట్‌ను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్, ముఖ్యంగా కామెడీకి లభిస్తున్న ఆదరణ ఇదే విధంగా కొనసాగితే.. వరుణ్ తేజ్ సినిమాకు మంచి లాంగ్ రన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
