
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి విశేష ఆదరణను పొందడమే కాకుండా, సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంటోంది.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, నాని, నాగవంశీ, సాయి రాజేశ్, టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషాన్ జీవింత్ వంటి సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ, “హార్ట్, హ్యూమర్, హానెస్ట్ పర్‌ఫార్మెన్సెస్… అన్నీ ది బెస్ట్ అనేలా ఉన్నాయి. మూవీ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు” అంటూ అభినందించారు.
లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించగా, ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదల చేశారు.
మౌత్ టాక్ తో బలమైన వేగాన్ని సొంతం చేసుకుని, విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.15.41 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ రన్‌ను చూస్తే, లిటిల్ హార్ట్స్ వచ్చే రోజుల్లో మరింత రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
