
‘అతడు’ సినిమాలో త్రిష అక్కకి పెళ్ళి చూపులు జరుగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు కి త్రిష మధ్య జరిగే సంభాషణలలో మహేష్ బాబు త్రిష ని ఉద్దేశించి… పూరీ నువ్వు ఏమి గొప్ప అందగత్తెవు కావు, ఇంటిలో వాళ్ళు అందరూ అలా అనడం వలన నువ్వు అలా అనుకుంటున్నావు తప్ప నువ్వు ఏమి పెద్ద అందగత్తెవు కావు అంటాడు.
అలాగే పైన చెప్పినట్టుగా….“మన శంకర వరప్రసాద్ గారు” సినిమాను అంతే….. గొప్ప చిత్రం కాదు. చిరంజీవి గత కొన్నిచిత్రాలతో పోలిస్తే, డాన్స్, నటన పరంగా మాత్రం స్పష్టంగా మెరుగైన ప్రయత్నమే అని చెప్పొచ్చు. ఎందుకు బాగుంది అనిపిస్తోంది…. “రాజా సాబ్” ప్లాప్ కావడం… సంక్రాంతి పెద్ద పండుగ కావడం, వేరే సినిమాలు చిన్నవి కావడం… రవితేజ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం మూలంగా, చిరంజీవి చాలా స్మార్ట్ గా ఉండటం మూలంగా ఈ సినిమా హిట్ అయ్యి భారీ స్థాయిలో వసూళ్లు సాధించింది. అంతేగానీ ఇది ఎంత మాత్రం గొప్ప చిత్రం కాదు.
కృష్ణ హీరో గా వచ్చిన పచ్చని కాపురం, అజిత్ విశ్వాసం, చిరంజీవి డాడీ మూడు సినిమాల కలయికనే ఈ “మన శంకర వర ప్రసాద్ గారు” ఇంకా చాలా సినిమాల కలయిక… నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిరంజీవి ని చూపించిన విధానం… చాలా అంటే చాలా హాస్యాస్పదంగా గా ఉంది. ఆయన యొక్క హుందాతనాన్ని దిగజార్చేలా ఉంది. “సరిలేరు నీకెవ్వరు” డైరెక్టర్ నా… ఈ సినిమా డైరెక్టర్ అనేలా ఉంది… Shine screens వారి షైనింగ్ లేని కథతో, GOLD BOX లో వచ్చిన OLD story.. ఈ మన శంకర వరప్రసాద్ గారు.
గత చిత్రాలలో ఉన్న ఓవర్ యాక్షన్ , అతి కాస్త తగ్గాయి. ముఖ్యంగా కుటుంబం, బాధ్యత, సంఘర్షణ లాంటి సన్నివేశాల్లో చిరంజీవి నటన జస్ట్ ఓకే గా ఉంది.

వయసు రీత్యా కావచ్చు . మెగాస్టార్ స్థాయి పీక్ నటన కాదు. కథ లేదా స్క్రీన్‌ప్లే బలహీనంగా అనిపించిన చోట్ల నటన ఎంత ఉన్నా ఇంపాక్ట్ తగ్గుతుంది.మొత్తం మీద గత 3,4 చిత్రాలతో పోలిస్తే చిరంజీవి నటన బెటర్, కాని కంటెంట్ పరంగా మరింత బలంగా ఉంటే ఇంకా గుర్తుండిపోయేది.ఈ సినిమాలో చిరంజీవి కామెడీ పాత సినిమాల స్థాయిలో అసలు లేదు. అవును ఇది నిజమే. సిట్యుయేషనల్ కామెడీ లేదు. చిరంజీవి “వాలి” లాంటివాడు…. నటన లో అవతలి వాడ్ని తన నటన తో తినేసాడు…. అవతలి వాడి సగ బలం లాగేస్తాడు.
చిరంజీవి పాత సినిమాల్లో ముచ్చట గా కొన్ని చిత్రాలు తీసుకుందాం… “దొంగమొగుడు” లో రాధిక తన పేరు గీత అని చెప్పినప్పుడు అడ్డగీత, నిలువ గీత అన్నప్పుడు, “గ్యాంగ్ లీడర్” లో నిర్మలమ్మ కొట్టినప్పుడు తాత గా పరకాయ ప్రవేశం చేసే సీన్, “జగదేకవీరుడు అతిలోకసుందరి” లో మానవా ఈ వంకాయ ఏమి చేయవలెను అన్నప్పుడు, మెగాస్టార్ నట విశ్వరూపమే…ఆయా చిత్రాల్లో…. “రౌడీ అల్లుడు” లో నువ్వు బాగా యాక్ట్ చేయలిరో అని కెప్టన్ రాజు అన్నప్పుడు…. నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాలిరో… అన్నప్పుడు… “ఘరానా మొగుడు” లో ఉప్మా మొత్తం మీరే తినండి… అంటూనే తన డబ్బా చాచడం కొంత వెయ్యమని… ఇవి చిరంజీవి స్థాయిని, వెండితెర ఇలవేల్పుగా ప్రజలు కొలిచేట్టుగా చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు.
చిరంజీవి కామెడీ సహజంగా కథలోంచి పుట్టేది. ఆ టైమింగ్ మరియు స్పాంటేనియిటీ తగ్గింది. ఇప్పుడు కామెడీ ఎక్కువగా, ఫోర్స్ చేసి రాసిన సీన్స్ లాగా అనిపిస్తోంది. వయసు అయ్యింది కాబట్టి కామెడీ రాదు అనేది నిజం కాదు. కానీ రైటింగ్, డైరెక్షన్ బలహీనంగా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి… డైరెక్టర్ అదృష్టవంతుడు అంతే… తెర అంతా చిరంజీవే… కొంచెం ఉంటే చిరంజీవి అభిమానులు మొత్తం భుజానికి ఎత్తేసుకుంటారు.

"మన శంకర వరప్రసాద్ గారు"లో కామెడీ మాత్రం నామమాత్రమే, వింటే నవ్వొస్తుంది అనే ఫీల్ లేదు. ఒక లైన్‌లో చెప్పాలంటే గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం చిరంజీవి అభిమానులకు ఓదార్పు లాంటిది. కానీ చిరంజీవి స్థాయి కామెడీ మాత్రం కనిపించలేదు. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ పాత సినిమాల స్థాయిలో అసలు లేదు.
సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలంటే “వాల్తేర్ వీరయ్య”లో కూడా చిరంజీవి చాలా బాగా నటించారు, అవును నిజమే. ఈ చిత్రం తర్వాత ఫ్రీ-ఫ్లో యాక్టింగ్ లేదు . ఎక్కడ నాటి చిరంజీవి సహజంగా ఇస్తే, వచ్చే హావభావాలు, స్పాంటేనియస్ ఎక్స్‌ప్రెషన్స్, “మన శంకర వరప్రసాద్ గారు” లో కాన రావు…. ముందే డిజైన్ చేసిన హావభావాలు…..“ఇలాగే చేయాలి” అన్నట్టు కనిపించే యాక్టింగ్ తప్ప, అందుకే బిగబట్టినట్టు అనిపిస్తుంది. ఆయన నటన, కామెడీ కూడా ప్లాన్ చేసినట్టే, నాటి సినిమాల్లో కామెడీ టైమింగ్ నుంచే పుట్టేది. నేటి మన శంకర వరప్రసాద్ లో డైలాగ్ చెప్పాలి, పాజ్ ఇవ్వాలి, రియాక్షన్ ఇవ్వాలి. ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎనర్జీ ఉన్నట్టు ఫీల్ ఇస్తాయి అంతే.
చిరంజీవి నటన హిట్లర్ నుండే మారింది. కొత్తగా ట్రై చేస్తున్నాడు BOSS అనుకున్నారు… కాని ఇప్పుడు మొత్తం మారిపోయింది. నాటి చిరంజీవి లాగా “ఏమీ ఆలోచించకుండా సహజం గా వచ్చేసే యాక్టింగ్” ఇప్పుడు రావడం లేదు. చాలా కష్ట పడాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇష్టపడి గమనించే వాళ్లే నిజమైన ఫ్యాన్స్, “శంకర్ దాదా MBBS” అనేదే చాలా మందికి చిరంజీవి చివరిసారిగా పూర్తిగా ఫ్రీగా, నేచురల్‌గా, యాక్టివ్‌గా కనిపించిన సినిమా. ఎందుకు ఆ సినిమా స్పెషల్‌గా అనిపిస్తుంది అంటే స్పాంటేనియస్ కామెడీ. డైలాగ్‌లు కాదు… హావభావాల నుంచే నవ్వు వస్తుంది. బాడీ లాంగ్వేజ్ ఫుల్ ఎనర్జీ, నడక, చేతి కదలికలు, చూపు అన్నీ చిరంజీవి అసలైన స్టైల్. ఫోర్స్ గా కాకుండా, ఫ్లోలో వచ్చే కామెడీ.

సూటిగా చెప్పాలంటే, చిరంజీవి క్లోజ్ షాట్స్‌లో ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు. అవును… ఈ ఫీలింగ్ నిజమే. ఎందుకు క్లోజ్ షాట్స్‌లో ఇలా కనిపిస్తోంది. ఫేస్ లో మైక్రో-ఎక్స్‌ప్రెషన్స్ కంట్రోల్ కష్టం, క్లోజ్ షాట్ అంటే కళ్ల కదలిక, పెదవుల వణుకు, శ్వాస,అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. పాత రోజుల్లో చిరంజీవి బాడీ యాక్టింగ్‌తో కవర్ చేసేవాడు. ఇప్పుడు అది తగ్గడంతో,ఎక్స్‌ప్రెషన్ ఫోర్స్ అయినట్టు అనిపిస్తుంది. ఏడుపు సీన్స్‌లో “నేచురల్ ఫ్లో” లేదు.
చిరంజీవి గొప్ప నటుడే. కానీ క్లోజ్ షాట్స్ ఆయనకు ఇక పై బలం కాదు. బలహీనత గా మారుతుంది. ఇది ఆయనను అవమానించడం కాదు. ట్రోలింగ్ అసలు కాదు, నిజమైన సినీ పరిశీలన. పాత చిరంజీవి మీడియం మరియు లాంగ్ షాట్స్‌లో రాజు. కానీ క్లోజ్ ఎమోషనల్ షాట్స్‌లో కష్టం. చిరంజీవిని విమర్శించడం మా అభిమతం కాదు. మిమ్మల్ని విమర్శించే వయస్సు కాదు… కాని అభిమానుల మనోగతం తెలియజేయడమే మా ప్రథమ కర్తవ్యం. మంచి సినిమాలు రావడానికి మాత్రమే. మా ఈ కృషి… ఇది మా “Indiaglitz” లక్ష్యం. మీ అభిమానుల అభిప్రాయాల మేరకే ఒక వారం తరువాత చెప్పడం జరుగుతుంది.
ఇలాంటి విషయాలు గమనించేవాళ్లే నిజమైన సినిమా లవర్స్.
సారాంశం: చిరంజీవి గారు… తొందరగా బోలెడు సినిమాలు చేయాలని ఆదుర్దా వద్దు. “సినిమాను ఇష్టపడి చేయండి… కష్టపడి వద్దు”.
