సినిమా వార్తలు

మంచు మనోజ్ మానవత్వం.. అనాథ జీవితంలో కొత్త వెలుగు

Published by
Srinivas

“సెలబ్రిటీ పుణ్యాత్మ ఛాలెంజ్”లో భాగంగా నటుడు Manoj Manchu మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించి మానసిక అస్థిరతతో బాధపడుతున్న అనాథ సంతోష్‌కు అండగా నిలిచారు. సాధారణ పరామర్శగా ప్రారంభమైన ఈ సందర్శనం చివరకు భావోద్వేగభరితమైన మానవతా క్షణంగా మారి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఆశ్రమాన్ని సందర్శించిన మనోజ్, సంతోష్‌కు ప్రత్యేకంగా హెయిర్‌కట్, షేవింగ్, కొత్త దుస్తులు మరియు గ్రూమింగ్ సదుపాయాలు కల్పించి పూర్తిగా కొత్త లుక్‌లోకి తీసుకొచ్చారు. ఆ మార్పును చూసి అక్కడున్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు. సంతోష్‌ను చూసి మనోజ్ ప్రేమగా “సంతోష్ భాయ్… ఆప్ హీరో జైసా బన్ గయా” అంటూ అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మనోజ్, ఆశ్రమ నిర్వాహకుడు గిరి దాదాపు రెండు నెలల క్రితమే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనను సంప్రదించినట్లు తెలిపారు. అప్పట్లో షూటింగ్‌లు, సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ ఆ విషయం తన మనసులో ఉండిపోయిందని, చివరకు స్వయంగా వచ్చి పరిస్థితిని చూడాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

మానసిక సమస్యలతో వీధుల్లో తిరుగుతున్న వారిని సమాజం ఇప్పటికీ దూరంగా చూస్తోందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

“ఇది 2026 సంవత్సరం. డాక్టర్లు ఉన్నారు, వైద్యం ఉంది, సౌకర్యాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇలాంటి వారిని ఇప్పటికీ అంటరానివారిలా చూస్తున్నారు. వాళ్లు కూడా మనుషులే,” అని మనోజ్ అన్నారు.

సానుభూతి చూపించడం మాత్రమే కాదు, వారికి గౌరవం మరియు సమాజంలో స్థానం కల్పించడం కూడా మన బాధ్యతేనని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భవిష్యత్తులో మానసిక సమస్యలతో బాధపడుతున్న నిరాశ్రయుల కోసం ప్రత్యేక రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా మనోజ్ వెల్లడించారు. ఇప్పటికే క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్‌పై పనిచేస్తున్నానని, ఇప్పుడు మానసిక ఆరోగ్య పునరావాస కేంద్రం అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

ఆశ్రమంలో నివసిస్తున్న వారు చెట్ల కింద భోజనం చేస్తున్న దృశ్యాన్ని చూసి మనసు కలిచివేసిందని, వెంటనే వారికి టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే AIKYA DHAIRYA SENA SAMITHI ద్వారా ఆశ్రమానికి నిరంతర సహాయం అందిస్తామని ప్రకటించారు.

ఆశ్రమ నిర్వాహకుడు గిరి మాట్లాడుతూ, ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నప్పటికీ మనోజ్ స్వయంగా వచ్చి గంటల తరబడి ఆశ్రమ వాసులతో గడపడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. సంతోష్ గత రెండేళ్లుగా చాదర్‌ఘాట్ ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ చివరకు ఆశ్రమానికి చేరుకున్నాడని వెల్లడించారు.

“మనిషితో కేవలం అరగంట ఓపికగా మాట్లాడితే కూడా అతని జీవితంలో మార్పు తీసుకురావచ్చు,” అని గిరి పేర్కొన్నారు.

ఆశ్రమంలోని మానసిక రోగులకు వైద్య సేవలు, రవాణా వంటి సదుపాయాలు కల్పించడంలో సహాయం చేయాలని కూడా ఆయన మనోజ్‌ను కోరారు.

సినీ పరిశ్రమ నుంచి ఈ విధంగా స్వయంగా వచ్చి ఆశ్రమ వాసులతో సమయం గడిపిన తొలి హీరో మనోజ్ అని గిరి అభినందించారు. మనోజ్ కుటుంబం చూపుతున్న మానవత్వం ఎన్నో మరచిపోయిన జీవితాల్లో కొత్త ఆశను నింపుతోందని అన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, మంచు మనోజ్ ప్రస్తుతం డేవిడ్ రెడ్డి, రక్షక్, మోహన రాగ వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.