ఆంధ్ర ప్రదేశ్

జీవ నదికి జీవం పోద్దాం… పర్యావరణ హితంగా పుష్కరాలను నిర్వహిద్దాం… పవన్ కళ్యాణ్

Published by
Suresh Thota

రాజమహేంద్రవరం లో పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” గోదావరి నది స్నానపు ఘాట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించి, నగరమంతా పర్యటించి అధికారులకు తగు సూచనలు చేశారు. గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి. రాబోయే గోదావరి పుష్కరాల కు పారిశ్రామికివేత్తలు సామాజిక బాధ్యతతో సహకరించి, ఈ బృహత్ కార్యాన్ని విజయవంతం చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పెట్టదు, కానీ అదే సమయంలో పరిశ్రమల యాజమాన్యం కూడా కాలుష్య కారకాలను నివారించి, శుద్ధి చేసే ప్లాంట్లను, పద్ధతులను పకడ్బందీగా అమలు చేయాలని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల పరిశ్రమల యాజమాన్యాలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. అంతేగాకుండా గోదావరి నది గురించి చెబుతూ…

మన దాహం తీర్చి, మనకు జీవితాన్ని ఇచ్చే పవిత్రమైన జీవ నదులను మనమే చేజేతులా చంపేస్తూ, వాటిని మృత నదులుగా మార్చడం అత్యంత విచారకరం. నదుల పట్ల మనకున్న నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు తాగునీరు దొరకడమే చాలా కష్టమవుతుంది. భగవంతుడు ప్రసాదించిన నీటిని ఇష్టారాజ్యంగా కలుషితం చేస్తూ, మళ్లీ అదే తాగునీటి కోసం జలజీవన్ మిషన్ అంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విచిత్ర పరిస్థితికి ఇకనైనా స్వస్తి చెప్పాలి. మన జీవ నదులను కాపాడుకోకపోతే రేపటి తరానికి మనుగడే ఉండదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అన్నారు.

మిషన్ ఫర్ క్లీన్ గోదావరి

గతంలో ప్రవేశపెట్టిన మిషన్ ఫర్ క్లీన్ గోదావరి వంటి పథకాలు కేవలం ఆర్బాటాలకే పరిమితమయ్యాయి తప్ప , క్షేత్రస్థాయిలో సరైన విధానం లేకపోవడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదు. ఇకపై ఈ మిషన్ కేవలం బోర్డులకే పరిమితం కాకూడదు. గోదావరి నదిలోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా పటిష్టమైన దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు కావాలి. మనం తాగే పవిత్రమైన గోదావరి నీటిలోకే మన ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని వదిలేస్తూ నదిని తీవ్రంగా అపవిత్రం చేస్తున్నాం. ​దీనికి అడ్డుకట్ట వేసేందుకు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరగాలి. నది ఎక్కడెక్కడ కలుషితమవుతోంది, ఏయే కాలువలు, ఉపనదులు వ్యర్థాలను మోసుకొచ్చి నదిలో కలుస్తున్నాయి అనే విషయాలపై స్పష్టత రావాలి. నది తీవ్రంగా కలుషితమవుతున్న ప్రధాన కేంద్రాలను గుర్తించి, అక్కడ తక్షణమే పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలి. నదిలోకి మురుగు నీరు, రసాయనాలు చేరుతున్న కీలక ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించి, ల్యాబొరేటరీ పరీక్షలు జరపాలి అన్నారు.

​రూ.100 కోట్ల తో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు…

గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అంతర్ జిల్లా (శాఖల) టాస్క్ ఫోర్స్ ఏర్పాటవుతోంది. కాలుష్య నియంత్రణ చర్యల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) ద్వారా రూ.100 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించడం జరిగింది. ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉంటూ కలిసి పనిచేస్తారు. కొన్ని పరిశ్రమలకు సంబంధించిన రసాయన వ్యర్థాలు నేరుగా గోదావరి నదీపాయల్లో కలుస్తున్న అంశంపై ఈ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలను సూచించే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ పని చేయాలి. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదికలు వేగంగా అమలు జరిగేలా ఒక పర్యవేక్షణ కమిటీ కూడా ఉంటుంది. నదుల రక్షణకు ఇవాళ్టి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు కావాలి, వచ్చే ఆరు నెలల్లో నదిలో స్పష్టమైన మార్పు కనిపించాలి అది పుష్కరాల లోపు జరుగుతుంది అన్నారు.

​హడావుడి పనులు వద్దు… భక్తుల ప్రాణాలతో చెలగాటమొద్దు…

గత పుష్కరాలకు 4.6 కోట్ల మంది భక్తులు వస్తే, ఈసారి ఆ రద్దీ రెట్టింపై దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనా. పుష్కరాలు దగ్గరకు వచ్చాక హడావుడిగా టెండర్లు పిలిచి, నాణ్యత లేకుండా తాత్కాలికంగా ఘాట్లు, కట్టడాలు కడితే… అవి కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో అలాంటి సంఘటనలు చూశాం. అలాంటి దారుణమైన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్‌కు అస్సలు వద్దు. ముహూర్తం దగ్గరపడ్డాక కంగారుపడటం కాదు… ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా, మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో పనులు చేయాలి.

భక్తులు ఎంతో పవిత్ర భావంతో పుష్కర స్నానానికి వస్తారు. ఘాట్లకు వచ్చి వెళ్లాక.. “మేము మురికి నీళ్లలో స్నానం చేసి వెళ్లాం” అనే మాట ఎవరి నోటి వెంబడైనా వస్తే అది ప్రభుత్వానికే అవమానం. పుష్కరాలు మొదలయ్యేవరకు ప్రతి రెండు వారాలకు ఒకసారి కాలుష్యంతోపాటు, అభివృద్ధి పనులపైనా నిరంతర సమీక్షలు జరుగుతాయి అన్నారు.

​6 జిల్లాల పంచాయతీల భాగస్వామ్యం…

గోదావరి పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రి అనే భావన నుంచి బయటకు రావాలి. గోదావరి ప్రవహిస్తున్న ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని పంచాయతీలను ఇందులో భాగస్వాములను చేయాలి. ఈ క్రమంలోనే గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల పరిధిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 285 గ్రామ పంచాయతీలను అధికారులు గుర్తించారు. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఈ గ్రామాల్లోని పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాము. ​దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వసతి కోసం గ్రామాల్లోని ఇళ్లలోనే ‘హోం స్టే’ సౌకర్యాలను కల్పిస్తాం. దీనివల్ల పుష్కరాల పనులు, పర్యాటకుల రాకతో స్థానిక ప్రజలకు ఉపాధి దొరికి, గ్రామాలు ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతాయన్నారు.

​దేశం గర్వపడేలా ప్లాస్టిక్ రహిత పుష్కరాలు

ఇంకా, ​జీవ నదులను కాపాడుకోవడానికి విప్లవాత్మక నిర్ణయాలు అవసరం. గోదావరి పుష్కరాలను దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవనదులను ఎంత పవిత్రంగా, పర్యావరణ హితంగా కాపాడుకుంటుందో దేశం మొత్తానికి తెలియాలి.

ఒక్క రాజమండ్రిలోనే కాకుండా గోదావరి ప్రవహించే ఆరు జిల్లాలలో ఏడాదిపాటు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తాము. ​పుష్కరాల నాటికి నదీ తీరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నదే కనిపించకూడదు. ​దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటైన “ఎన్విరాన్‌మెంటల్ టాస్క్‌ఫోర్స్” రాబోయే ఏడాది కాలంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించేలా, దానికి తగిన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెచ్చేలా కఠినమైన చర్యలు చేపడుతుందన్నారు.

ముగింపు: ప్లాస్టిక్ నివారణా చర్యల్లో భాగంగానే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి పేరిట అవగాహనా కార్యక్రమం ప్రారంభమవుతోంది. ​జీవ నది మన తల్లి లాంటిది. దాన్ని కలుషితం చేస్తే మన భవిష్యత్తును మనమే పాడుచేసుకున్న వారం అవుతాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదులను సంపూర్ణంగా శుభ్ర పరిచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సంకల్పానికి ప్రజల చిత్తశుద్ధి, సహకారం తోడైనప్పుడే మన జీవనదులు పవిత్రంగా, సురక్షితంగా నిలుస్తాయి. మన నదులను కాపాడుకుందాం మన భవిష్యత్తును రక్షించుకుందాం అని పారిశ్రామిక వేత్తలతో ఈ విషయాలను పాలుపంచుకున్నారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.