హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో గతంలో సాధించిన విజయాలను గుర్తు చేస్తూ, అదే తరహాలో తాగునీటి సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో తీవ్ర కరెంటు కోతలు ఉన్న పరిస్థితిని అధిగమించి తెలంగాణకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి నిరంతర తాగునీటి సరఫరా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రత్యేక కృషి చేయలేదని విమర్శించిన కేటీఆర్, నగర ప్రజలకు కాంగ్రెస్ పాలనపై పూర్తి అవగాహన ఉండటంతోనే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఫ్లైఓవర్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రిబ్బన్లు కట్ చేస్తూ తమ విజయాలుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
గతంలో పూర్తిగా అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అయితే వచ్చే రోజుల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తగిన గౌరవం, అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీకి మద్దతుగా ఉన్న ఒక్క ఓటు కూడా కోల్పోకుండా శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.