ఆంధ్ర ప్రదేశ్

పంచాయతీ వనంతో గ్రామాలకు ఆర్థిక జవసత్వాలు…. పవన్ కళ్యాణ్

Published by
Suresh Thota

పర్యావరణ పరిరక్షణ కేవలం ఉపన్యాసాలకో, మొక్కలు నాటే ఫోటోలకో పరిమితం కాకూడదని.. అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఒక “వనయజ్ఞం” గా మార్చాలని, ఏపీ ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. “రాజానగరం”లోని అటవీ శాఖ ప్రాంతీయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయనకు ఒక గొప్ప ఆలోచన చేశారు. వెంటనే ఆలోచన ను ఆచరణలోకి తెచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అది కేవలం పచ్చదనాన్ని పెంచడమే కాదు.. గ్రామ పంచాయతీలను స్వయంసమృద్ధి వైపు నడిపించే ఒక బృహత్తర ప్రణాళికను ఆవిష్కరింపేజేసింది.

సాధారణంగా “హరితహారం” లేదా సామాజిక “వనరక్షణ” అనగానే కేవలం నీడను ఇచ్చే మొక్కలు, లేదా రోడ్డు ఇరుపక్కలా నాటే సంప్రదాయ పద్ధతులే గుర్తుకొస్తాయి. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సరళి ఇందుకు భిన్నంగా, అత్యంత ఆచరణాత్మకంగా ఉంది. ​”మొక్కల పెంపకాన్ని పంచాయతీలు ఒక వ్యాపార నమూనాగా (Business Model), స్థిరమైన ఆదాయ మార్గంగా మార్చుకోవాలి.” అని ఆయన ఉద్దేశ్యం. ​ఈ వ్యూహం వెనుక ఉన్న కీలక ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి.

వుడ్ బ్యాంక్ (Wood Bank) ఏర్పాటు….

అంతర్జాతీయంగా, జాతీయంగా నాణ్యమైన కలపకు భారీ డిమాండ్ ఉంది. చాలా దేశాలు కలప కొరతను ఎదుర్కొంటున్నాయి. దీన్ని ఒక అవకాశంగా మార్చుకుని, తక్కువ కాలంలోనే (కమర్షియల్ వాల్యూ) వాణిజ్య విలువ కలిగిన దేశీయ వృక్ష జాతులను ఎంపిక చేసి ప్రతి పంచాయతీలోనూ “ప్రత్యేక వనాలు”గా పెంచాలి. ఈ వనాల ద్వారా లభించే కలపను, ఇతర అటవీ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీలకు (Own Source of Revenue) ఆర్థిక స్వయంసమృద్ధి సమకూరుతుంది. ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, గ్రామాభివృద్ధి పనులకు ఈ ఆదాయాన్ని వాడుకోవచ్చు. విదేశీ రకాల కంటే మన మట్టికి, మన వాతావరణం నకు అలవాటైన, పండ్లు-ఫలాలు ఇచ్చే ఔషధ, వాణిజ్య విలువలున్న దేశవాళీ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. అని ఆలోచించి ​కార్యాచరణ వైపు అడుగులు వేశారు.

ఎంతటి గొప్ప ఆలోచనకైనా సరైన కార్యాచరణ లేకపోతే ఫలితం శూన్యం. ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” కేవలం సలహా ఇచ్చి వదిలేయకుండా, అప్పటికప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి గ్రౌండ్ లెవెల్ యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేయించారు. ​”రాజానగరం” కేంద్రంలో ఉన్న సుమారు 400 రకాల విభిన్న జాతులు, 2 లక్షలకు పైగా ఉన్న మొక్కలను సద్వినియోగం చేసుకునేందుకు, “పంచాయతీరాజ్ శాఖ”, “అటవీ శాఖ”లు సంయుక్తంగా ప్రత్యేక MoU (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) కుదుర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. “అటవీ శాఖ” సాంకేతిక నైపుణ్యాన్ని, “పంచాయతీరాజ్” శాఖ పరిధిలోని మానవ వనరులను, భూములను కలిపి ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ముందుకు తీసుకెళ్లడమే ఈ MoU ముఖ్య ఉద్దేశం.

​ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి డిప్యూటీ సీఎం రెండు ప్రధాన సూత్రాలను ముందుకు తెచ్చారు. ప్రభుత్వ అధికారులు మొక్కలు నాటి చేతులు దులుపుకుంటే లాభం లేదు. ఏ గ్రామంలోనైతే వనాన్ని పెంచుతున్నారో, ఆ గ్రామ ప్రజలను ఇందులో భాగస్వాములను చేయాలి. అప్పుడే ఆ మొక్కల సంరక్షణ బాధ్యతాయుతంగా సాగుతుంది. మొక్కలను నాటడం, వాటిని కాపాడటాన్ని కేవలం ఒక పనిగా కాకుండా పిల్లలకు ఒక బాధ్యతగా, జీవన విధానంగా నేర్పించాలి. మన సంస్కృతి, నాగరికత ఈ దేశీయ వృక్షాలతో ముడిపడి ఉన్నాయని వారికి తెలియజెప్పాలి.

ముగింపు: పర్యావరణ సంక్షోభం ముంచుకొస్తున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారి “పంచాయతీ వనం” ఆలోచన ఒక విప్లవాత్మక అడుగు. ఒకవైపు ప్రకృతి సమతుల్యతను కాపాడుతూనే, మరోవైపు గ్రామాలకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చే ఈ సమగ్ర విధానం.. రేపటి ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలను “పచ్చని, సంపన్న” గ్రామాలుగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఒకే తాటిపైకి వచ్చి ఈ “వనయజ్ఞాన్ని” విజయవంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

Recent Posts