విజయవాడలో నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పారిశ్రామిక అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని వనరులను సమర్థంగా వినియోగించుకునేలా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూల విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి కోసం ప్రత్యేక విధానంతో పాటు ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల పాలసీలను కూడా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా స్టార్టప్‌లు, పారిశ్రామిక సంస్థలు, నిపుణులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశనిస్తుందని పేర్కొన్నారు.
“ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే వంద పార్కులకు శంకుస్థాపనలు చేయగా, తాజాగా మరో 38 పార్కులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఎలాంటి వివాదాలు లేకుండా భూములు అందించిన రైతులకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధిలో రైతుల సహకారం ఎంతో కీలకమని కొనియాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరిట నిర్మించిన ఆధునిక కళావేదికను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 4.4 ఎకరాల విస్తీర్ణంలో 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన ఈ కన్వెన్షన్ సెంటర్‌లో 1,500 మంది కూర్చునే సామర్థ్యం ఉందన్నారు. ఇకపై ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, సదస్సులు ఇక్కడే నిర్వహించనున్నట్లు తెలిపారు.
భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని యువతకు అనుగుణమైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జెన్ జీ, జెన్ ఆల్ఫా, యువతకు అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలపై సూచనలు ఇస్తే వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.