
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు ఈ చిత్రంలోని తొలి పాట ‘ఆయా షేర్’ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఈ సాంగ్ ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దాటేసి ఈ ఏడాది అత్యంత విజయవంతమైన పాటల్లో ఒకటిగా నిలిచింది.
విడుదలైన తొలి రోజు నుంచే ఆయా షేర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోలు, డ్యాన్స్ కవర్లతో ఈ పాట నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాలేజీ ఈవెంట్స్, పబ్లిక్ సెలబ్రేషన్స్, గ్రామీణ ఉత్సవాలు.. ఇలా ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ పాట విజయానికి ప్రధాన బలం అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్‌ఫుల్ మ్యూజిక్. కసర్ల శ్యామ్ రాసిన మాస్ లిరిక్స్ పాటకు మరింత బలం చేకూర్చగా, అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు.
ఇక ఈ పాటలో నానిని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించారు. రగ్గడ్ లుక్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, హై ఎనర్జీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో నాని మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. పాట విడుదలైన తర్వాత ఆయన లుక్, స్టైల్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆయా షేర్ 200 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక తదుపరి పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
