సినిమా వార్తలు

నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్ వాయిదా

Published by
Srinivas

తాజాగా వినిపించిన ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, స్వయంభు సినిమా విడుదల వాయిదా పడినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ముందుగా ఫిబ్రవరి 13, 2026న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఏప్రిల్ 10, 2026కి వాయిదా వేసినట్లు వెల్లడించారు.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం విఎఫ్ఎక్స్ పనులేనని చిత్రబృందం తెలిపింది. ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో, విఎఫ్ఎక్స్‌కు మరింత సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా కావడంతో, టెక్నికల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్‌లో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంగీతాన్ని కేజీఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో తన పాత్ర కోసం నిఖిల్ ప్రత్యేకంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

కొత్త విడుదల తేదీ ఖరారు కావడంతో, త్వరలోనే స్వయంభు ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రారంభించనున్నారని సమాచారం. రాబోయే రోజుల్లో తాజా పోస్టర్లు, వీడియో కంటెంట్ విడుదలయ్యే అవకాశం ఉంది. పాన్-ఇండియా స్థాయిలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా, ఏప్రిల్ 10, 2026న సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.