
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసే వార్త బయటకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే అభిమానులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని స్పష్టం చేసింది.
ఎన్టీఆర్ అధికారిక బృందం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ దురదృష్టకర ఘటనలో ఆయన భుజానికి గాయమైంది. వెంటనే ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది.
పరీక్షల అనంతరం ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఎన్టీఆర్ బృందం అభిమానులకు విజ్ఞప్తి చేసింది. “ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి అపోహలకు తావులేదు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అధికారిక సమాచారం అవసరమైనప్పుడు మా నుంచే వెల్లడిస్తాం” అని ప్రకటనలో స్పష్టం చేసింది.

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో షూటింగ్ షెడ్యూల్స్‌లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
చివరగా అభిమానులు చూపుతున్న ప్రేమ, అభిమానానికి ఎన్టీఆర్ బృందం కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్స్‌ను సమయానుకూలంగా వెల్లడిస్తామని మరోసారి హామీ ఇచ్చింది.
