సరిగ్గా హరిహర వీరమల్లు సినిమాకు ముందు థియేటర్లు బంద్ చేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడంపై పవన్ కల్యాణ్ పరోక్షంగా సీరియస్ అయ్యారు. ఇండస్ట్రీ బాగు కోసం తను కష్టపడుతుంటే, పరిశ్రమ పెద్దలంతా కలిసి తనకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని, దాన్ని తను స్వీకరిస్తున్నానని అన్నారు.
ఇకపై ప్రభుత్వం వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందన్నారు పవన్. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని… సంబంధిత విభాగం ప్రతినిధులతోనే పవన్ చర్చిస్తారని అన్నారు.
టాలీవుడ్ కు పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటిస్తుంటే, మరోవైపు ఇండస్ట్రీ పెద్దలకు ప్రభుత్వం అంటే కనీస మర్యాద లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంటే, ఇప్పటిపరకు పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చి ఎందుకు ముఖ్యమంత్రిని కలవలేదని ప్రశ్నించారు పవన్.
ఇకపై థియేటర్లపై పూర్తిస్థాయిలో దృష్టిపెడతామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి.. లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అనే విషయాన్ని ఆరా తీయాలని పన్నుల విభాగానికి సూచించారు.
మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపైనా పవన్ దృష్టి పెట్టారు. టికెట్ సేల్ కీ, వచ్చే పన్నుకీ అంతరం ఏ మేరకు ఉందో చూడాలని అన్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో పారిశుధ్య వసతుల్ని పర్యవేక్షిస్తామని తెలిపిన పనవ్.. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం, మంచి నీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం లాంటి అంశాలపై ఇకపై అధికారులు దృష్టి పెడతారంటూ సున్నితంగా వార్నింగి ఇచ్చారు.
ఈ అంశాలపై పవన్ కల్యాణ్, పౌరసరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు హోమ్ శాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారు.
రాష్ట్రంలో మల్టీప్లెక్స్ స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియచేయాలని ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను నివేదిక అడిగింది. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా
2-3 స్క్రీన్స్ గా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. వాటిలో టికెట్ ధరలు, సింగిల్ థియేటర్ టికెట్ ధరలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? కౌంటర్ లో ఏ ధరకు అమ్ముతున్నారో ఆరా తీస్తున్నారు.
విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ ల నిర్వహణ వాటిలోని టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారిస్తారు.