మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన ఈ చిత్రం, రామ్ చరణ్ కెరీర్‌లో కొత్త చరిత్రను సృష్టించింది.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా వీకెండ్స్‌తో పాటు వర్కింగ్ డేస్‌లో కూడా బలమైన హోల్డ్‌ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
ఈ విజయంతో రామ్ చరణ్ సోలో హీరోగా రూ.400 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. రెండో వారంలోనూ సినిమా అదే జోరు కొనసాగించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రేక్షకులు ‘పెద్ది’ పాత్రతో ఏర్పరచుకున్న భావోద్వేగ అనుబంధమే ఈ భారీ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణ భారత చిత్రంగా రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, విదేశీ మార్కెట్లలోనూ ‘పెద్ది’ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.
పల్లెటూరి నేపథ్యం, ఎమోషనల్ కథనం, స్పోర్ట్స్ డ్రామా, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకదాన్ని అందించగా, బుచ్చిబాబు సానా ఎమోషన్స్‌ను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారనే ప్రశంసలు దక్కుతున్నాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ‘పెద్ది’ విజయయాత్ర ఇంకా కొనసాగనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వసూళ్లతో ఈ చిత్రం కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.