పోస్ట్ ప్రొడక్షన్‌లో ప్రేమకథా చిత్రం ‘సెకండ్ ఇన్నింగ్స్’
జనవరి 6, 2026 Published by Srinivas

ఉదయ్ భాస్కర్, నక్షత్ర జంటగా రూపొందుతున్న చిత్రం ‘సెకండ్ ఇన్నింగ్స్’ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఉదయ్ టాలీవుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్, లిటిల్ క్రూ పిక్చర్స్ పతాకాలపై జ్ఞానేశ్వరి వేదవ్యాస్ ఆకుల నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఉదయ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
పూర్తి స్థాయిలో ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను తాకేలా రూపొందిందని చిత్ర బృందం వెల్లడించింది. శీను, అఖిల్, సోమాలి, లిరిష, మొ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
‘రంగస్థలం’ నుంచి టెలివిజన్, సినిమాల వరకు తన సహజ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఉదయ్ భాస్కర్, ‘సెకండ్ ఇన్నింగ్స్’ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఉదయ్ కెరీర్‌లోనే ఇది ఒక బెస్ట్ ఫిలింగా నిలుస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రేమకథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ‘సెకండ్ ఇన్నింగ్స్’పై ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది.
