సినిమా వార్తలు

త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా సిరివెన్నెల కాంస్య విగ్రహావిష్కరణ

Published by
Srinivas

ప్రముఖ సినీ గీత రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహాన్ని అనకాపల్లిలో ఘనంగా ఆవిష్కరించారు. గాంధీనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.

తానా సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

విగ్రహావిష్కరణ అనంతరం పెంటకోట కన్వెన్షన్ హాల్‌లో ‘సిరివెన్నెల మహోత్సవ సభ’ను నిర్వహించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ— రథసప్తమి రోజున అనకాపల్లిలో పుట్టి, అదే నేలపై పెరిగి జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యానికి ఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల గారి విగ్రహాన్ని ఆయన పుట్టిన ప్రాంతంలోనే ప్రతిష్టించడం దైవ సంకల్పమేనని అన్నారు. సిరివెన్నెల కళాపీఠం పేరిట ప్రతి ఏడాది సాహిత్యవేత్తలకు అవార్డు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ— “జీవించి ఉన్నా లేకపోయినా, కొందరు మనుషులు మనసుల్లో సజీవంగా నిలిచిపోతారు. అలాంటి మహనీయుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు” అని పేర్కొన్నారు. మహనీయుల చరిత్ర తర్వాతి తరాలకు స్పూర్తిగా నిలవాలంటే ఇలాంటి విగ్రహాల అవసరం ఉందని అన్నారు.

మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ— తెలుగు సినిమా చరిత్రలో సాహిత్యానికి గౌరవం తెచ్చిన వ్యక్తి సిరివెన్నెల అని ప్రశంసించారు. ఆయన పాటల్లో మానవీయ విలువలు, దేశభక్తి ప్రతిబింబించాయన్నారు.

ఈ కార్యక్రమంలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు, తానా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని, శాస్త్రి గారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.