
వేసవి సెలవులు అనగానే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతాయి. స్నేహితులతో ఆటలు, అమ్మమ్మ తాతయ్యలతో సరదాలు, సొంతూరిలో గడిపిన మధుర క్షణాలు.. ఇలా ప్రతి ఒక్కరి బాల్యంలో వేసవి సెలవులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి అందమైన జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 4 నుంచి సోనీ లివ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
దర్శకుడు శ్రీకర్ నయన్ తన తొలి ప్రయత్నంలోనే బాల్యంలోని మధురానుభూతులను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. గోదావరి ప్రాంతంలోని అందమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. హైదరాబాద్‌కు చెందిన ఆర్.వి (అరుణ్ దేవ్) అనే బాలుడు వేసవి సెలవుల కోసం తన అమ్మమ్మ (జయసుధ) ఊరికి వెళ్తాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులతో జీవించే కె.వి (రోహన్ రాయ్) అనే మరో బాలుడితో అతడికి పరిచయం ఏర్పడుతుంది.
విభిన్నమైన కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లల మధ్య క్రమంగా మంచి స్నేహం చిగురిస్తుంది. సరదాగా మొదలైన వారి పరిచయం ఎన్నో అనుభవాలు, సాహసాలు, నవ్వులు, జీవిత పాఠాలతో కూడిన అందమైన ప్రయాణంగా మారుతుంది. ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడే అనుబంధాలు, ఎదురయ్యే అనుభవాలు కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
బాల్యంలో ఉండే అమాయకత్వం, స్నేహంలోని స్వచ్ఛత, కుటుంబ సంబంధాల్లోని ఆత్మీయతను ఈ చిత్రం సహజంగా చూపిస్తుంది. జీవితంలో గొప్ప జ్ఞాపకాలు అనేవి పెద్ద పెద్ద సంఘటనల వల్లే కాకుండా, చిన్న చిన్న సంతోషాల నుంచి కూడా పుడతాయని గుర్తుచేస్తుంది.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకర్ నయన్ మాట్లాడుతూ.. ‘సమ్మర్ హాలిడేస్’ బాల్యం, స్నేహం గొప్పతనాన్ని గుర్తుచేసే సినిమా అని తెలిపారు. దర్శకుడిగా తన తొలి చిత్రం కావడంతో ఈ సినిమా తనకు ఎప్పటికీ ప్రత్యేకమని చెప్పారు. సోనీ లివ్ ద్వారా మరింత మంది ప్రేక్షకులకు ఈ కథ చేరువవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులంతా కలిసి సినిమా చూసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారని అన్నారు.
ఇక నటి జయసుధ మాట్లాడుతూ.. పిల్లలతో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా సాగిందని తెలిపారు. వారి అమాయకత్వం, సహజమైన నటన ఈ సినిమాను తనకు మరింత ప్రత్యేకంగా మార్చాయని చెప్పారు. తరాల మధ్య అనుబంధాలను, కుటుంబంలోని ఆనందాన్ని ఈ చిత్రం అందంగా ఆవిష్కరించిందని పేర్కొన్నారు. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కావడం ద్వారా మరిన్ని కుటుంబాలకు ఈ సినిమా చేరువవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, విజిబి ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రోహన్ రాయ్, అరుణ్ దేవ్, ఖుషీ, జయసుధ, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల, హర్ష వర్ధన్, రమణ భార్గవ్, హర్షిణి కోడూరి, మహేష్ చింతల తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం వచ్చింది. బాల్యపు మధుర జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకోవాలనుకునే వారికి ‘సమ్మర్ హాలిడేస్’ మంచి ఎంపిక కానుంది. ఈ సినిమా డిసెంబర్ 4 నుంచి సోనీ లివ్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
