సినిమా వార్తలు

అదే ‘బైకర్’ సినిమాకూ బేస్ అయింది: శర్వానంద్

Published by
Srinivas

చార్మింగ్ స్టార్ Sharwanand నటించిన సంక్రాంతి ఎంటర్‌టైనర్ నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ రన్‌తో దూసుకుపోతుండగా, విజయోత్సాహంతో శర్వా మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు.

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. హిట్ గురించి మాట్లాడుతూ శర్వా, “ప్రతి సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా పనిచేస్తాం. అనుకున్న ఫలితం రావడం చాలా హ్యాపీగా ఉంది” అని అన్నారు.

సంక్రాంతి చివర్లో విడుదలైనప్పటికీ ఇంతటి రెస్పాన్స్ రావడంపై శర్వానంద్ మాట్లాడుతూ, “మేము కంటెంట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నాం. పెద్ద లాంగ్ వీకెండ్స్ కలిసి రావడం కలిసొచ్చింది. సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుందనే నమ్మకం మొదటి నుంచీ ఉంది” అని తెలిపారు. థియేటర్లు ఇంకా పెరుగుతున్నాయని, సినిమాకు లాంగ్ రన్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

తన లుక్‌పై కూడా శర్వా ఆసక్తికరంగా స్పందించారు. గత యాక్సిడెంట్ తర్వాత బరువు పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, “నాకు నచ్చేలా మారాలని నిర్ణయించుకుని వాకింగ్, రన్నింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా చేశాను. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది” అన్నారు. ఇది రాబోయే ‘బైకర్’ సినిమాకూ బేస్ అయిందని చెప్పారు.

కామెడీ అంశంపై మాట్లాడుతూ, “నరేష్ గారు ఈ సినిమాకు ఇంకొక హీరో. సత్య సుదర్శన్, వెన్నెల కిషోర్, సంపత్—అందరి పాత్రలు అద్భుతంగా వచ్చాయి. కామెడీ అంతా సిచ్యుయేషన్ బేస్డ్‌గా వర్క్ అయ్యింది” అని తెలిపారు. బాలకృష్ణ గారి క్లాసిక్ టైటిల్‌ను వాడడంపై ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆయన నుంచి అభినందనలు రావడం ఎంతో సంతోషమిచ్చిందని చెప్పారు.

డైరెక్టర్ రామ్ అబ్బరాజుపై ప్రశంసలు కురిపించిన శర్వా, “ఇండస్ట్రీకి రామ్ లాంటి డైరెక్టర్లు కావాలి. అతనికి చాలా క్లారిటీ ఉంది” అన్నారు. అలాగే శ్రీ విష్ణు క్యామియోపై స్పందిస్తూ, “చాలా చిన్న పాత్ర అయినా పెద్ద మనసుతో చేశారు. ఇది శ్రీ విష్ణు గొప్పతనం” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.

సంగీతంపై మాట్లాడుతూ, విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయని చెప్పారు. భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ‘బైకర్’ సినిమా భారతదేశం గర్వపడేలా ఉంటుందని, సంపత్ నందితో ‘భోగి’ షూటింగ్ కొనసాగుతోందని వెల్లడించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts