భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో నిలిచిన ది రాజా సాబ్, బాక్సాఫీస్ వద్ద మాత్రం అభిమానులు ఊహించిన స్థాయి స్పందనను రాబట్టలేకపోయింది. పాన్ ఇండియా హీరోగా పేరున్న ప్రభాస్ నటించిన సినిమా కావడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ, కంటెంట్‌పై మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఆశించిన రేంజ్‌కు చేరలేదు.
ప్రత్యేకంగా కథనం, ట్రీట్మెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభాస్ అభిమానులు, సోషల్ మీడియాలో దర్శకుడు మారుతిని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. హిప్నాటిక్ థ్రిల్లర్‌గా ప్రచారం చేసినప్పటికీ, ఆ ఎలిమెంట్ పూర్తిగా కనెక్ట్ కాలేదన్న అభిప్రాయం థియేటర్ల వద్ద వినిపించింది.
ఇప్పుడు అదే సినిమా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక JioHotstarలో ఫిబ్రవరి 6 నుంచి ‘ది రాజా సాబ్’ ఎక్స్‌టెండెడ్ కట్‌తో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ప్రీమియర్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదలైన కొత్త ట్రైలర్ సినిమాపై మళ్లీ చర్చలకు తెరలేపింది.
థియేటర్లలో అందుకోలేకపోయిన స్పందన, ఓటీటీ ప్రేక్షకుల నుంచి దక్కుతుందా? ఎక్స్‌టెండెడ్ కట్ సినిమాకు ప్లస్ అవుతుందా? అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ అంశంపై డిస్కషన్స్ ఊపందుకున్నాయి.
నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, డిజిటల్ వేదికపై కొత్త జీవితాన్ని మొదలుపెడుతుందా లేదా అన్నది ఫిబ్రవరి 6 తర్వాతే తేలాల్సి ఉంది.