సినిమా వార్తలు

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్.. ఇక ZEE5లో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్

Published by
Srinivas

థియేటర్లలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తమిళంలో ‘నూరు సామి’ పేరుతో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ZEE5 వేదికగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రముఖ దర్శకుడు శశి తెరకెక్కించిన ఈ చిత్రం, ‘బిచ్చగాడు’ (పిచ్చైకారన్) తర్వాత దాదాపు పదేళ్లకు విజయ్ ఆంటోనీ-శశి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడం విశేషం. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కుటుంబ బంధాలు, తల్లి-కొడుకుల అనుబంధం, మహిళల వ్యక్తిగత జీవితంపై సమాజం చూపించే దృక్పథాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించింది.

కథ విషయానికి వస్తే.. భర్తను కోల్పోయిన సెల్వి తన పిల్లల కోసం జీవితాన్నే అంకితం చేస్తుంది. పిల్లలు పెద్దయ్యాక తన జీవితంలో మరోసారి తోడు కావాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమె నిర్ణయానికి సమాజం, కుటుంబ పరిస్థితులు అడ్డంకిగా మారతాయి. ఈ నేపథ్యంలో మాతృత్వం, ఆత్మగౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ విలువలను దర్శకుడు భావోద్వేగంగా చూపించారు.

సాధారణంగా తల్లి త్యాగాలను మాత్రమే చూపించే కథలకు భిన్నంగా, తల్లి సంతోషం కోసం అండగా నిలిచే కొడుకు పాత్రను ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు. అందుకే థియేటర్లలో ఈ చిత్రానికి కుటుంబ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ, స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోనీ సంయుక్తంగా విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఓటీటీ విడుదల సందర్భంగా దర్శకుడు శశి మాట్లాడుతూ, “‘వంద దేవుళ్లు’ నిజ జీవిత భావోద్వేగాల నుంచి పుట్టిన కథ. ప్రేమ, అంగీకారం, సంతోషాన్ని ఎంచుకునే ప్రతి మహిళ హక్కు గురించి చెప్పాలనుకున్నాను. థియేటర్లలో ప్రేక్షకులు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. ఇప్పుడు ZEE5 ద్వారా మరింత మంది కుటుంబ ప్రేక్షకులను చేరుకోవడం ఆనందంగా ఉంది” అని అన్నారు.

హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ, “ఈ సినిమాలోని తల్లి-కొడుకుల అనుబంధమే కథకు ప్రాణం. ప్రతి కుటుంబం ఈ కథతో భావోద్వేగంగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇప్పుడు నాలుగు భాషల్లో ZEE5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

కుటుంబ కథలు, భావోద్వేగ చిత్రాలను ఇష్టపడే వారికి ‘వంద దేవుళ్లు’ మంచి ఎంపికగా నిలవనుంది. ప్రస్తుతం ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts