సినిమా వార్తలు

కారు ప్రమాదం నుంచి బయటపడ్డ విజయ్ దేవరకొండ

Published by
Rahul N

ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీ సత్యసాయి ఆశ్రమం, పుట్టపర్తిని సందర్శించి తిరిగి వస్తుండగా, వారు వస్తున్న వాహనానికి ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉందవల్లి సమీపంలో జరిగింది. పుట్టపర్తి నుండి హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుండి విజయ్ దేవరకొండ క్షేమంగా బయటపడ్డారు.

మంగళవారం సాయంత్రం జాతీయ రహదారి 44లోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్స్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నందికొట్కూరు నుండి పెబ్బైర్ వైపు వెళ్తున్న గొర్రెల లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ క్రమంలో విజయ్ కారు ఎదురుగా వస్తున్న బోలెరో వాహనంతో స్వల్పంగా ఢీ కొంది. ఫలితంగా కారు కొంత డామేజ్ అయినట్లు సమాచారం.

అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాలేదు. విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ శ్రీకాంత్ ఈ ఘటనపై ఉందవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. అనంతరం విజయ్ ఒక స్నేహితుడి కారులో హైదరాబాద్‌ బయలుదేరినట్లు తెలిసింది.

రేసెంట్ గా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిశ్చితార్థం… పుట్టపర్తి దర్శనం కూడా ఆ సందర్భానికే సంబంధించినదని కొంతమంది చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.

ఈ ఘటనపై విజయ్ దేవరకొండ స్వయంగా స్పందిస్తూ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘X’ (ట్విట్టర్) ద్వారా అభిమానులతో తన క్షేమ సమాచారాన్ని పంచుకున్నారు.

Rahul N