చెన్నై లవ్‌స్టోరీ

Published by
Srinivas

‘కలర్‌ ఫోటో’, ‘బేబీ’ సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్‌, ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ బీభత్సంగా నిర్వహించారు. సినిమాలోని తొలి ప్రేమ గురించి కిరణ్‌ అబ్బవరం చెప్పే డైలాగ్, పాటలు విపరీతంగా జనాల్లోకి వెళ్లిపోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే కిరణ్ అబ్బవరం సైతం మునుపెన్నడూ చూడని ప్రేమకథ అంటూ సినిమాను బాగా లేపేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? మునుపెన్నడూ చూడని ప్రేమకథేనా? తెలుసుకుందాం.

కథేంటంటే..

నివేదిత (శ్రీ గౌరీ ప్రియ) తను ప్రేమించిన అబ్బాయి అజయ్‌ (త్రిగుణ్‌)తో కలిసి పెళ్లికి సిద్ధమవుతుంది. పెళ్లి సమయానికి తాను మరో అమ్మాయిని ప్రేమించానని.. నివికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతాడు. మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకొచ్చి బ్రేకప్ చెప్పడంతో నివి తట్టుకోలేకపోతుంది. ఆమెని ఆ బాధ నుంచి బయట పడేసేందుకు ఫ్రెండ్స్ ఆమెను చెన్నైకి తీసుకెళ్లినా ఏ మార్పూ రాదు. పైగా ప్రేమ విఫలమైన బాధలో లేడీ దేవదాసుగా మారిపోతుంది. మందు తాగుతూ తన ప్రపంచంలో తానుంటుంది. అలాంటి సమయంలో ఆమె ఉంటున్న ఇంట్లోకి స్టీవెన్‌ శంకర్‌ (కిరణ్‌ అబ్బవరం) అడుగు పెడతాడు. నెల్లూరుకు చెందిన స్టీవెన్ ఒక అనాథ. దర్శకుడవ్వాలన్న ఆశతో చెన్నైకి వస్తాడు. అతనికి నివి స్నేహితులే తమ ఇంట్లో ఆశ్రయమిస్తారు. మొదట్లో స్టీవెన్‌ చేసే పనులు నివికి చిరాకు తెప్పిస్తాయి. ఒక సందర్భంలో అతనిపై బాగా కోప్పడుతుంది. ఆ తరువాత ఫీలై.. ఓ నిర్మాత (పీ వాసు)ను కలిసి ఆయనకు స్టీవెన్‌తో అపాయింట్‌మెంట్ సెట్ చేస్తుంది. స్టీవెన్ కథను నిర్మాత రిజెక్ట్ చేసినా కూడా తనకు ఆ అవకాశం కల్పించిన నివిపై ఆరాధన భావం ప్రారంభమవుతుంది. ఆమెను తన దేవతగా చూస్తుంటాడు. ఆమెకు సంబంధించిన పనులన్నీ తనే స్వయంగా చేస్తుంటాడు. స్టీవెన్ మంచితనానికి ఫిదా అయిపోయిన నివికి క్రమంగా అతనిపై ప్రేమ పుడుతుంది. అంతా కలిసి గుడికి వెళ్లినప్పుడు తనను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతుంది. అతను ఆనందంగా ఒప్పుడుకుంటాడు. ఆ తరువాత వారిద్దరి జీవితంలో ఏం జరిగింది? ఇద్దరి పెళ్లి అయ్యిందా? తిరిగి ఆమె జీవితంలో అజయ్ వచ్చాక కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? వంటి విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా సాగిందంటే…

దర్శకుడు సాయి రాజేష్‌కి లవ్ స్టోరీలు బాగా కలిసొచ్చాయి. ఆయన తెరకెక్కించిన గత రెండు చిత్రాలు లవ్ స్టోరీలే. ఇది కూడా ప్రేమకథే. ప్రేమలో ఒక డిఫరెంట్ పాయింట్‌ను పట్టుకుంటారు. అలా తెరకెక్కించిన చిత్రాలే.. ‘కలర్‌ ఫోటో’, ‘బేబీ’. అవి రెండూ మంచి సక్సెస్ సాధించాయి. ‘చెన్నై లవ్‌స్టోరీ’ సైతం డిఫరెంట్ పాయింటే అనుకున్నట్టున్నారు. కానీ మనసుని బలంగా టచ్ చేసే ఎమోషన్ అనేది చిత్రంలో మిస్ అయ్యిందేమో అనిపించింది. హీరోయిన్‌న్‌ని దేవదాసుని చేయడం డిఫరెంటేమో కానీ అది కూడా అంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమే. తొలి ప్రేమ ఎప్పుడూ తోపుగానే భావిస్తుంటారు యూత్. కానీ అదేమీ తోపు కాదు.. తొలిప్రేమ విఫలమైందంటే.. మరో ప్రేమ ఎక్కడో ఎదురు చూస్తోందని అర్థమంటూ ప్రేమను డిఫరెంట్ కోణంలో చూపించేందుకు ట్రై చేశారు. హీరోకి బీభత్సమైన ఎలివేషన్స్ వంటివేం లేకుండా సింపుల్‌గా పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటుంది. స్టీవెన్.. నివి ఇంట్లోకి చేరినప్పటి నుంచి కథలో వేగం అయితే పెరుగుతుంది. బ్రేకప్‌ బాధలో నుంచి బయటపడలేక నివి పడే వేదనను దూరం చేయాలనుకుని స్టీవెన్ చేసే పనులు ఆకట్టుకుంటాయి. కథపై ఒకరకంగా ఆసక్తిని పెంచుతాయి. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినప్పటి నుంచి కథలో మరింత వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ గుండెను బరువెక్కిస్తుంది. ఆ తరువాత మాత్రం కథ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గతంలో ‘సర్వం మాయ’ అనే చిత్రం వచ్చింది. దానిని సెకండాఫ్ గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే రామ్-తమన్నా నటించిన ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం సైతం గుర్తొస్తుంది. సెకండాఫ్‌కు ప్రేరణను ఫస్ట్ హాఫ్‌లోనే ఓ కుర్రాడి సాయంతో చెప్పేస్తాడు దర్శకుడు. సెకండాఫ్ బలంగా తీర్చిదిద్ది ఉన్నా బాగుండేదేమో.. కేవలం జెలసీతో నడిపించినట్టుగా మాత్రమే ఉంటుంది. బలమైన ఎమోషన్ అనేది చిత్రంలో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎండింగ్ మన ఊహలకు అనుగుణంగానే ఉంటుంది.

ఎవరెలా చేశారంటే..

స్టీవెన్‌ పాత్రలో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) పరరకాయ ప్రవేశం చేశారు. చాలా సింపుల్‌గా.. సహజ నటనతో ఆకట్టుకున్నారు. శ్రీగౌరీ ప్రియ విషయానికి వస్తే సినిమాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. ఆమె అద్భుతంగా నటించింది. ప్రతి సన్నివేశంలోనూ తన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన త్రిగుణ్‌ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయారు. సిరి హనుమంతు, పూజ, నవీన్‌ నేని, కార్తీక్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. దర్శకులు పీ వాసు, కరుణ కుమార్‌ అతిథి పాత్రల్లో మెరిశారు.

టెక్నికల్ పరంగా..

సాయి రాజేశ్‌ కథని దర్శకుడు రవి నంబూరి అదే ఫీల్‌తో తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు కానీ కథలోనే అంత డెప్త్ లేదేమో అనిపించింది. ముఖ్యంగా సినిమా మొత్తం సెకండాఫ్ పైనే ఆధారపడి ఉంది. మునుపెన్నడూ చూడని కథైతే కాదు. అంతలా కొత్తదనం కూడా ఏమీ లేదు. మణిశర్మ తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి. బీజీఎం కూడా బాగుంది. విజువల్స్‌ చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు సైతం చిత్రానికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా: ‘చెన్నై లవ్‌స్టోరీ’ వన్ టైమ్ వాచ్ మూవీ

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026