
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ చిత్రాలతో పాటు విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఈ బ్యానర్‌పై తెరకెక్కుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘దొంగ నా కొడుకు’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుష్మితా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సుష్మితా శెట్టి మీడియాతో ముచ్చటిస్తూ తన సినీ నేపథ్యం, పాత్ర, సినిమా విశేషాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా కలిగింది?
నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. మా తాతయ్య, నానమ్మలు దాదాపు 40 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారు నాకు స్ఫూర్తి. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అన్ని రకాల డ్యాన్స్‌లు నేర్చుకున్నాను. డ్యాన్స్‌లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ద్వారా నటనపై ఆసక్తి పెరిగింది. విదేశాల్లో చదువుకునే సమయంలో థియేటర్ కూడా చేశాను. ‘దొంగ నా కొడుకు’ హీరోయిన్గా నాకు మొదటి సినిమా. ఇంతకుముందు ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్‌లో నటించాను. ఇప్పుడు తొలిసారి వెండితెరపై నన్ను నేను చూసుకోబోతుండటం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది.
‘దొంగ నా కొడుకు’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో నాది చాలా క్యూట్, బబ్లీ క్యారెక్టర్. కొంచెం తింగరిగా కూడా ఉంటుంది (నవ్వుతూ). ఈశ్వర్ (మౌళి)ని చాలా ప్రేమిస్తుంది. అతడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. తాను చాలా స్మార్ట్ అని అనుకుంటుంది. కానీ తెలియకుండానే అమాయకంగా క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. నా పాత్రలో ఇన్నోసెంట్ కామెడీ చాలా ఉంటుంది. ఏదైనా తెలివిగా చేయాలని ప్రయత్నిస్తే అది చివరకు కామెడీగా మారుతుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌లో పనిచేయడం ఎలా అనిపించింది?
మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. పెద్ద స్టార్ హీరోల సినిమాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న కథలను కూడా వారు ప్రోత్సహించడం గొప్ప విషయం. ఇలాంటి సంస్థలో నా మొదటి సినిమా చేయడం సంతోషంగా ఉంది.
మౌళితో కలిసి నటించడం ఎలా అనిపించింది?
మౌళి చాలా టాలెంటెడ్. అంతేకాకుండా చాలా హంబుల్‌గా ఉంటారు. ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. భవిష్యత్తులో ఆయనకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
కథ వినగానే మీకు ఏమనిపించింది?
ముందుగా సినిమా టైటిల్ వినగానే చాలా నచ్చింది. చాలా క్యాచీగా ఉంది. అందరూ రిలేట్ చేసుకునే ఫన్ టైటిల్ ఇది. కథ విన్నప్పుడు కూడా చాలా నచ్చింది. ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది.
సినిమాలో డ్యాన్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉంది?
ఇందులో ఒక మంచి డ్యాన్స్ నంబర్ ఉంది. అది ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. మౌళికి కూడా ఒక సోలో సాంగ్ ఉంది. భవిష్యత్తులో మంచి డ్యాన్స్ నంబర్స్‌తో నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది.
టాలీవుడ్లో మీకు ఇష్టమైన డ్యాన్సింగ్ హీరోలు ఎవరు?
రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు నాకు చాలా ఇష్టం. వీరి డ్యాన్స్ అంటే ప్రత్యేకమైన అభిమానం.

సినిమా సంగీతం గురించి ఏమంటారు?
సింజిత్ చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్. ఇది క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి కథకు, జానర్‌కు తగ్గట్టుగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
మీ డ్రీమ్ రోల్ ఏంటి?
‘మహానటి’ సినిమా నాకు చాలా ఇష్టం. అందులో అన్ని రకాల భావోద్వేగాలు చూపించే అవకాశం ఉంటుంది. అలాంటి అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక మంచి సినిమా చేయాలనుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో కూడా నటించాలని ఉంది. రొమాంటిక్ కామెడీలు అంటే చాలా ఇష్టం. అలాగే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ కూడా చేయాలని ఉంది.
దర్శకుడు శ్రీను కంబాల గురించి?
దర్శకుడు శ్రీను గారు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. ఇది ఆయనకు మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా టెన్షన్ పడినట్లు కనిపించలేదు. చాలా కూల్‌గా ఉంటూ సినిమాను తెరకెక్కించారు.
‘దొంగ నా కొడుకు’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ల నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తారు. ఇందులో చాలా ఎంటర్టైనింగ్గా ఉండే కామెడీ ఉంది. ముఖ్యంగా చాలా ఫ్రెష్ కామెడీని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి?
ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాను.
క్రైమ్ కామెడీ నేపథ్యంలో సరికొత్త వినోదాన్ని అందించేందుకు వస్తున్న ‘దొంగ నా కొడుకు’తో హీరోయిన్గా సుష్మితా శెట్టి టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నవంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
