
‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ ప్రేమకథలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా గౌరీ ప్రియ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సినిమాలో మొదట హీరోహీరోయిన్లుగా వీరిద్దరూ కాకుండా మరో హిట్ జంటను అనుకున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొదట ఎంపికైనది ‘బేబీ’ జంటే
‘బేబీ’ సినిమా ఘనవిజయం తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇద్దరూ నటిస్తున్నట్లు ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ‘బేబీ’ తర్వాత మళ్లీ ఈ జంట కలిసి నటించబోతోందనే వార్తతో అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
చివరి నిమిషంలో ఎందుకు తప్పుకున్నారు?
అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పట్లో రెమ్యూనరేషన్ అంశంలో విభేదాల కారణంగానే ఇద్దరూ సినిమా నుంచి వైదొలిగారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి.

సీన్‌లోకి కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ
కొంతకాలం తర్వాత నిర్మాత ఎస్‌కేఎన్ అదే కథను ‘చెన్నై లవ్ స్టోరీ’ పేరుతో మళ్లీ ప్రకటించి, హీరోగా కిరణ్ అబ్బవరం, హీరోయిన్‌గా శ్రీ గౌరీ ప్రియను తీసుకొచ్చారు. సినిమా విడుదలైన తర్వాత ఈ కొత్త జంటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కిరణ్ అబ్బవరం తన సహజ నటనతో ఆకట్టుకోగా, శ్రీ గౌరీ ప్రియ మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించుకుంది.
మిస్ అయిన కల్ట్ హిట్?
ప్రస్తుతం సినిమాకు వస్తున్న స్పందనను చూస్తే.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ ప్రాజెక్ట్‌ను వదులుకోకుండా ఉంటే ‘బేబీ’ తర్వాత మరో కల్ట్ లవ్ స్టోరీ వారి ఖాతాలో పడేదనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే అదృష్టం కిరణ్ అబ్బవరాన్ని వరించడంతో, ఈ సినిమా ఆయన కెరీర్‌లో కీలక విజయంగా నిలుస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక శ్రీ గౌరీ ప్రియకు కూడా ఈ చిత్రం మరో పెద్ద గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, ఒక హీరో-హీరోయిన్ మిస్ చేసుకున్న అవకాశాన్ని మరో జంట అందిపుచ్చుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
