మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల తన సినిమాల్లో విభిన్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఖలీఫా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు వైశాఖ్ ఈ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా అప్‌డేట్స్ చూస్తే ప్రతిదీ చాలా హైప్ ఇచ్చేది గానే ఉంది. ముఖ్యంగా సెట్స్ మైండ్ బ్లోయింగ్. దీంతో సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
కేరళలోని ఓ చిన్న పట్టణం నేపథ్యంలో కథ సాగుతుంది. ఆమిర్ అలీ (పృథ్వీరాజ్ సుకుమారన్) మెన్స్ వేర్ షోరూంను నడుపుతూ సంతోషంగా జీవిస్తుంటాడు. అతని తండ్రి యూనుస్ అలీ (రంజీ పణికర్) ప్రభుత్వ కాంట్రాక్టర్. తాను చేసిన పనికి రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఆమిర్ తాత అహ్మద్ అలీ ఒకప్పుడు పెద్ద డాన్. అయితే ఆమిర్ తండ్రి యూనుస్ మాత్రం నేర ప్రపంచానికి దూరంగా వెళ్లి నిజాయితీగా జీవించాలని నిర్ణయించుకుంటాడు. అందువల్ల ఆమిర్ కూడా కుటుంబం గతంలో ఉన్న నేర ప్రపంచానికి పూర్తిగా దూరంగా పెరుగుతాడు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. యూనుస్‌పై కేరళలోకి బంగారం అక్రమంగా తరలించాడనే ఆరోపణలు వస్తాయి. దీంతో అతన్ని జైలులో పెడతారు. తన తండ్రిని ఎలా బయటకు తీసుకురావాలో ఆమిర్‌కు అర్థం కాదు. కుటుంబంపై అతనికి ఉన్న వల్లమాలిన ప్రేమ, తన కళ్ల ముందే తండ్రికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకపోవడం అతన్ని చివరకు నేర ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేస్తాయి. ఆ తరువాత ఆమిర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అక్కడ హారిస్ (నీల్ నితిన్ ముఖేష్), రాజకీయ నాయకుడు రాఘవన్ (షమ్మీ తిలకన్)తో అతనికి ఎందుకు వైరం ఏర్పడింది? మోహన్‌లాల్ కామియో సినిమాకు ప్లస్ అయ్యిందా? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
దర్శకుడు వైశాఖ్ ఫస్ట్ హాఫ్‌లో పాత్రలను, విలన్లను పరిచయం చేస్తూ ఆమిర్ నేర ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాడో చూపించారు. అయితే ఇదంతా బీభత్సమైన సాగదీత. చూసేవారికి విసుగు అనిపిస్తుంది. అవసరానికి మించి యాక్షన్ సన్నివేశాలు, కార్ చేజ్‌లు పెట్టి ఫస్ట్ హాఫ్‌ను బోరింగ్‌గా తీర్చిదిద్దారు. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. ఆమిర్ గ్యాంగ్‌స్టర్‌గా మారడం, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించారు. ఈ సమయంలో మోహన్‌లాల్ కామియో సినిమాకు ఒక్కసారిగా మంచి ఊపునిస్తుంది కానీ చాలా ఆలస్యం కావడంతో అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. లండన్ వీధుల్లో ఆమీర్ పరిచయ సన్నివేశంలో వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. యాక్షన్ కొరియోగ్రఫీ, పృథ్వీరాజ్ స్టంట్స్, కెమెరా వర్క్ కలిసి మంచి మాస్ ఎలివేషన్ ఇస్తాయి. అయితే ఈ సన్నివేశాలు మినహా సినిమా అంతా పేలవమే. కుటుంబ బంధాలు, ప్రేమ, పెళ్లి, స్మగ్లింగ్ వంటి అంశాలన్నీ గతంలో మనం చూసినవే. ముఖ్యంగా 1980లు, 90ల్లో వచ్చిన ఎన్నో సినిమాలను మనకు గుర్తుకు తెప్పిస్తాయి. ముఖ్యంగా పాత్రల రూపకల్పన అత్యంత బలహీనం. చాలా బలంగా ఉండాల్సిన విలన్ల పాత్రలు కూడా బలహీనంగా రాయడంతో ఏమాత్రం ఉత్కంఠగా అనిపించదు. అమీర్ తల్లిగా మోహిని, భార్యగా మాళవిక శర్మ నటించారు. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మహిళా పాత్రలు ఇవి రెండే. ఆ ఇద్దరికీ కూడా స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఇవ్వడంతో సినిమాపై ఈ రెండు పాత్రలు పెద్దగా ప్రభావం చూపవు. మాళవిక శర్మ అయితే ఆమీర్‌కు ప్రియురాలిగానూ.. ఓ వారసుడిని ఇవ్వడానికే పరిమితమైంది.
ఎవరెలా నటించారంటే..
పృధ్వీరాజ్ సుకుమారన్ చాలా స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. తన పాత్రలో జీవించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు. మోహన్‌లాల్ కేమియో సినిమాకే హైలైట్. మంబరక్కల్ అహ్మద్ అలీగా కనిపించింది కొన్ని నిమిషాలే అయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మాళవిక శర్మ, మోహినిల నటనకు స్కోప్ లేని పాత్రలు కావడంతోవారి గురించి చెప్పడానికే లేదు. నీల్ నితిన్ ముఖేష్, షమ్మీ తిలకన్ పాత్రలు సైతం బలంగా తీర్చిదిద్దలేదు. షమ్మీ తిలకన్ నటన కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు.
టెక్నికల్ పరంగా..
కథ, కథనం, స్క్రీన్‌ప్లే అన్నీ ఈ సినిమాకు మైనస్‌లే. రచనలో కానీ, సన్నివేశాల తెరకెక్కింపులో కానీ ఈ తరహా సినిమాకు అవసరమైన గుర్తుండిపోయే క్షణాలు కనిపించవు. పదేపదే వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విసుగు తెప్పిస్తుంది. మోహన్‌దాస్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రధాన బలం. జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ కూడా కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. జేక్స్ బిజోయ్ పాటలు బాగున్నప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోలేకపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో చమన్ చాకో ఎడిటింగ్ బాగుంది.
ఫైనల్‌గా.. ‘ఖలీఫా’ ఒక వ్యర్థ ప్రయత్నం