కిష్కింధపురి మూవీ రివ్యూ
Published సెప్టెంబర్ 11, 2025 by Srinivas
కిష్కింధపురి రివ్యూ: తథాస్తు భయం
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా షైన్ స్క్రీన్స్ మీద సాహు గారపాటి నిర్మించిన సినిమా ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకుడు. సమీక్షలో సినిమా గురించి తెలుసుకోండి.
‘భైరవం’ విజయం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ళపాటి దర్శకుడు. హారర్ థ్రిల్లర్ జానర్ చిత్రమిది. సమీక్షలో సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.

కథ:
రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలీ (అనుపమ పరమేశ్వరన్) ఘోస్ట్ వాకింగ్ టూర్ గైడ్స్. కిష్కింధపురిలో ప్రజలను పాడుబడ్డ భవంతిలోకి తీసుకు వెళ్లి దెయ్యం కథలు చెప్పడం వాళ్ళ పని. ఘోస్ట్ వాకింగ్ టూరుకు వచ్చే వాళ్ళను తమకు నచ్చిన పాడుబడ్డ భవంతిని ఎంపిక చేసుకోమని చెబుతారు. సువర్ణమాయ రేడియో స్టేషన్ ఎంపిక చేసుకుంటారు. అక్కడకు వెళ్ళిన తర్వాత నిజమైన దెయ్యం తారసపడుతుంది. సువర్ణ మాయలో అడుగుపెట్టిన ఒక్కొక్కరినీ చంపడం మొదలు పెడుతుంది. వాళ్ళను రాఘవ్ ఎలా కాపాడాడు? దెయ్యం కథ ఏమిటి? ఆత్మగా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ:
తెలుగు ప్రేక్షకులకు హారర్ థ్రిల్లర్స్ చూడటం అలవాటు. లెక్కకు మిక్కిలిగా వచ్చాయి. దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి రొటీన్ దెయ్యం కథ రాసుకున్నా స్క్రీన్ మీద కొత్తగా ప్రజెంట్ చేశాడు. రేడియోలో దెయ్యం వాయిస్ వినిపించడం, వార్నింగ్ ఇవ్వడం వంటివి కొత్తగా ఉంటాయి. టెక్నికల్ టీమ్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ తీసుకోవడంతో విజువల్ పరంగా రిచ్‌గా ఉంటుందీ సినిమా.

మెయిన్ ప్లాట్‌లోకి వెళ్ళడానికి ‘కిష్కింధపురి’ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి కొంత సమయం తీసుకున్నాడు. మొదటి పది పదిహేను నిమిషాలు, ఆ సమయంలో వచ్చే పాట రొటీన్‌గా ఉంటాయి. సువర్ణమాయలో అడుగు పెట్టిన తర్వాత కథలో వేగం పెరిగింది. ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలు రాక మొదలైంది. రైల్వే ట్రాక్ దగ్గర, కన్స్ట్రక్షన్ బిల్డింగ్, చిన్నపాపను హీరో కాపాడే సన్నివేశం ఇంటర్వెల్ ముందు ఎక్సట్రాడినరీ సీన్స్ పడ్డాయి. దాంతో మొదటి పదిహేను నిమిషాలు ప్రేక్షకులు మర్చిపోయేలా చేశారు. ఇంటర్వెల్ అయ్యాక ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్ మొదలు కావడం, మధ్యలో మదర్ ఎమోషన్ వంటివి రావడంతో కథలో వేగం నెమ్మదిస్తుంది. కానీ ఆసక్తి మాత్రం తగ్గదు. ఎక్కువ సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. అనుపమ దెయ్యంగా మారే సన్నివేశం సెకండాఫ్ మెయిన్ హైలైట్. క్లైమాక్స్ రొటీన్ అనిపించినా సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన లీడ్ బావుంది.
ప్రేక్షకులను ‘కిష్కింధపురి’ భయపెట్టడంలో చైతన్ భరద్వాజ్ ఆర్ఆర్ కీ రోల్ ప్లే చేసింది. భయపెట్టే సన్నివేశాల్లో రొటీన్ ఆర్ఆర్ కాకుండా కొత్తగా ఇచ్చారు. కెమెరా వర్క్ కూడా చాలా బావుంది. వీఎఫ్ఎక్స్ విషయంలో తీసుకున్న కేర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వానరాలు, దెయ్యం గ్రాఫిక్స్ బాగా చేశారు. నిర్మాత సాహు గారపాటి ఖర్చుకు వెనుకాడలేదని స్క్రీన్ మీద విజువల్స్ బట్టి తెలుస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా బావుంది. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లడంలో సాయపడింది.

బెల్లంకొండ శ్రీనివాస్ చక్కటి నటన కనబరిచారు. తన భుజాలపై సినిమా అంతా నడిపించారు. ఆయన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్ కుదిరింది. నటుడిగా వన్ మ్యాన్ షో చేశారు. దెయ్యంగా అనుపమ నటన అద్భుతం. కళ్ళతో భయపెట్టింది. హైపర్ ఆది, సుదర్శన్ మధ్య మధ్యలో కాస్త నవ్వించారు. తనికెళ్ల భరణి కీలమైన పాత్రలో హుందాగా నటించారు. సీనియర్ హీరోయిన్ ప్రేమ అమ్మగా కనిపించారు. ‘లియో’, ‘కొత్త లోక’ సినిమాల ఫేమ్ శాండీ నటన సర్‌ప్రైజ్ ఇస్తుంది.
తీర్పు:
ప్రారంభంలో పది పదిహేను నిమిషాలు, రొటీన్ క్లైమాక్స్ తప్పిస్తే ‘కిష్కింధపురి’ బావుంది. అనుపమతో కలిసి బెల్లంకొండ శ్రీనివాస్ భయపెట్టారు. హారర్ థ్రిల్లర్ ప్రేమికులకు ‘కిష్కింధపురి’ నచ్చుతుంది. గో అండ్ వాచ్.
Rating: 



(3/5)
