ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయిగా ఐశ్వర్య రాజేష్.. కార్పొరేటర్ కావాలని కలలు కనే యువకుడిగా తిరువీర్ నటించిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంతో వస్తున్నారు. మరోవైపు తిరువీర్ చేస్తున్నవి చిన్న చిత్రాలే అయినా కూడా మంచి కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. మరి వీరిద్దరూ కలిసి జంటగా నటించిన ఓ..! సుకుమారి ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే..
తెలంగాణాలోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది. దామిని(ఐశ్వర్య రాజేశ్)కి చిన్నప్పటి నుంచి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. ఆమె ఎవరిని టచ్ చేసినా కరెంట్ షాక్ కొడుతుంది. ఆమెకున్న సమస్య కారణంగా ఊరివాళ్లంతా ఇబ్బంది పడుతుంటారు. ఎలాగైనా ఆమెకు పెళ్లి చేసి ఊరి నుంచి పంపించాలనుకుంటారు. మరోవైపు పక్క ఊరికి చెందిన యాదగిరి మహా పిసినారి. రూపాయి ఖర్చు చేయకుండా ఊరికి సర్పంచ్ అవ్వాలనుకుంటాడు. తన ఇద్దరి మనవళ్లలో ఎవరు ముందుగా మగబిడ్డను కంటారో వాళ్లకు తన 80 ఎకరాల ఆస్తి దక్కుతుందని తాత వీలునామా రాస్తాడు. దీంతో ఆస్థి కోసం యాదగిరి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలోనే దామినిని చూసి యాదగిరి ఇష్టపడతాడు. అయితే ఆ ఊరి వాళ్లంతా దామినికి ఉన్న సమస్యను దాచి యాదగిరితో మూడు ముళ్లు వేయిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? దామినికి ఉన్న సమస్య తెలిసిన తర్వాత యాదగిరి ఏం చేశాడు? ఆమె వల్ల యాదగిరికి వచ్చిన సమస్యలు ఏంటి? చివరకు తాత 80 ఎకరాల ఆస్థి దక్కిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
వాస్తవానికి దర్శకుడు భరత్ దర్శన్ మంచి కాన్సెప్ట్‌నే ఎంచుకున్నారు. హీరోయిన్‌ను ఎవరైనా టచ్ చేస్తే విద్యుత్ షాక్ తగలడమనేది కాస్త కొత్తగా అనిపించింది. అది మినహా సినిమాలో మరో కొత్తదనమైతే లేదు. చాలా సినిమాలు పాత కాన్సెప్ట్‌తోనే వస్తున్నాయి. కానీ దానిని ప్రెజెంట్ చేసే తీరులోనే అసలు టాలెంట్ బయటపడుతుంది. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నా కూడా బలహీనమైన కథనం, పాత చింతకాయపచ్చడి ప్రెజెంటేషన్ కారణంగా సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఐశ్వర్య రాజేష్, తిరువీర్ నటన తప్ప ‘ఓ సుకుమారి’ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేవీ దాదాపు లేవనే చెప్పాలి. గ్రామంలో ఏదైనా చిన్న విషయం తెలిస్తే క్షణాల్లో ఊరంతా పాకుతుంది. అలాంటిది గ్రామంలో అందరికీ హీరోయిన్ సమస్య తెలిసినా హీరోకు మాత్రం తెలియదు. ఇది చూసేవారికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. పైగా ప్రతిసారీ నిజం చెప్పబోతే ఏదో ఒక కారణంతో ఆపేయడం వంటి సన్నివేశాలు పదేపదే రావడం కూడా చాలా అసహజంగా అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం ఏమాత్రం కొత్తదనం లేని కథ, బలవంతంగా పెట్టిన కామెడీ, చిరాకు తెప్పించే సన్నివేశాలతో సాగుతుంది. మరీ విచిత్రంగా అనిపించేదేంటంటే.. హీరోయిన్ సమస్యకు ఇచ్చిన సొల్యూషన్. క్లైమాక్స్ అస్సలు ఏమాత్రం కనెక్ట్ కాదు. చాలా సినిమాటిక్‌గా ఉండి పూర్తిగా తేలిపోతుంది.
ఎవరెలా చేశారంటే..
సుకుమారిగా ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో జీవించింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించింది. ఇక తిరువీర్ గురించి చెప్పేదేముంది. అద్భుతంగా నటిస్తాడు. తనకు సరిగ్గా సరిపోయే పాత్రనే ఎంచుకున్నాడు. సుకుమారిని వివాహం చేసుకోవాలనుకోవడం.. ఆ తరువాతి పరిణామాల కారణంగా చిక్కుల్లో పడటం వంటి సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. విష్ణు ఓయి, ఝాన్సీ, ఆమని, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ గవిరెడ్డి వంటి వారంతా చక్కగా నటించారు కానీ వారిని వినియోగించుకోవడంలోనే దర్శకుడు ఫెయిల్ అయ్యారు.
టెక్నికల్ పరంగా..
ఈ సినిమాకు పెద్ద మైనస్ బలహీనమైన కథనం. భరత్ దర్శన్ వినూత్న పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ కథను కాస్త స్ట్రాంగ్‌గా రాసుకుని ప్రెజెంట్ చేసి ఉంటే చాలా బాగుండేది. డైరెక్షన్ చాలా పేలవంగా ఉంది. ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త వహించి ఉండాల్సింది. సినిమా సాగదీతలా అనిపిస్తుంది. మ్యూజిక్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.
మొత్తంగా.. ‘ఓ సుకుమారి’ సరికొత్త కాన్సెప్ట్‌తో ఫెయిల్యూర్ స్టోరీ