ఒకప్పుడు అంటే 1991లో వచ్చిన ‘ఇదయం’ (తెలుగులో హృదయం) మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో తమిళ్ వర్షన్‌లో ఇళయరాజా స్వరపరిచిన “పొట్టు వైత్త” పాట విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ పాటతో రాజా (మురళి) గీత (హీరా)పై తనలో దాచుకున్న గాఢమైన ప్రేమను వ్యక్తపరిచాడు. మాటల్లో చెప్పలేని ప్రేమకు ఆ పాట ఒక భావోద్వేగ ప్రతీకగా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు మురళి కుమారుడు అథర్వ ‘హృదయం మురళి’గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అథర్వ తన ప్రేమను బయటపెట్టలేక మనసులోనే దాచుకునే మరో యువకుడి పాత్రలో కనిపిస్తాడు. వాస్తవానికి ఈ రెండు సినిమాలకు కథాపరంగా పోలిక లేదని, అయితే ఒకే ప్రపంచంలో జరిగే కథలుగా మాత్రమే వీటిని చూడాలని దర్శకులు పలుమార్లు చెప్పడం జరిగింది. అప్పట్లో వచ్చిన ‘హృదయం’, తెలుగులో పొట్టువైత్త సాంగ్ లేకున్నా అది కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగానికి కారణమైంది. మరి అంచనాకు తగినట్టుగానే సినిమా ఉందా? తెలుసుకుందాం.
కథేంటంటే..
‘హృదయం మురళి’ కథ 1998, 2006, 2011, 2019, 2024 అనే ఐదు వేర్వేరు కాలాల్లో సాగుతుంది. ఇంట్రోవర్ట్ అయిన హృదయ (అథర్వ మురళి) తల్లిదండ్రులు లేకపోవడంతో మామ (నట్టి) సంరక్షణలో పెరుగుతాడు. అతనొక ఇంట్రోవర్ట్ కావడంతో ఏ విషయాన్ని ఎవరికీ నేరుగా చెప్పలేడు. ఈ క్రమంలో తను చదువుకునే సమయంలో సమంత (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు చెప్పడు. ఆ ప్రేమ అలా దూరమవుతుంది. ఆ దరువాత నిహారిక ‘కాయాదు లోహర్)తో ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు కూడా చెప్పలేడు. దీంతో ఆమె కూడా దూరమవుతుంది. తనకు ఇవన్నీ సెట్ కావనుకుంటున్న తరుణంలో సమంత మరోసారి తారసపడుతుంది. ఈసారైనా చెబుదామనుకునే లోపే ఆమె కూడా దూరమవుతుంది. ఈ క్రమంలోనే హృదయకు తన మామ అతనికి అదితి (మాళవిక మోహనన్)తో పెళ్లి సెట్ చేస్తాడు. పెళ్లికి సిద్ధమవుతున్న క్రమంలో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అసలా సంఘటనలు ఏంటి? చివరకు ఆ పెళ్లి జరిగిందా? లేదా? తన మనస్తత్వం కారణంగా హృదయ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
సినిమా టైటిల్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ ‘హృదయం’ సినిమా మనసులో మెదులుతుంది. కానీ దానికి పూర్తి భిన్నమే ‘హృదయ మురళి’. ఒకే ఒక్క అంశం మాత్రం ‘హృదయం’తో కనెక్ట్ అవుతుంది. అదేంటంటే.. ప్రేమను వ్యక్తపరచలేకపోవడం. నేటి యూత్ ముఖ్యంగా జెన్‌జీకి కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు. నాస్టాల్జియా మూమెంట్స్‌తో సినిమాను ప్రారంభించినా కూడా నేటి యూత్‌కు సరిగ్గా సెట్ అయ్యేలా కథను తీసుకెళ్లారు. పలు స్టేజెస్‌లలో లవ్ స్టోరీలను నడిపించిన మీదట పెళ్లి వరకూ తీసుకెళ్లాడు. అయితే సినిమా కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఫన్ మూమెంట్స్ కొంత వరకూ పర్వాలేదనిపించినా కూడా ఓవరాల్‌గా మాత్రం ఒక ఇంట్రోవర్ట్ ప్రేమ కథతోనే సినిమానంతా నడిపించారు. అదే సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పాలి. ముఖ్యంగా హీరో తన నిజమైన ప్రేమను కనుగొంటాడా? లేదా? అనే విషయంతో ప్రేక్షకుడు పెద్దగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవలేడు. చివరికి అతను ఏ అమ్మాయితో కనెక్ట్ అయినా కూడా అది మనకు నమ్మకం అనిపించదు. సినిమాలోని హృదయ ప్రేమించిన వ్యక్తుల పాత్రలు… టీచర్, నాసా వ్యోమగామి, డాక్టర్ వంటి గొప్ప వృత్తుల్లో ఉన్నప్పటికీ, వారి వ్యక్తిత్వాలను దర్శకుడు లోతుగా చూపించలేకపోవడంతో మనకు అంతగా కనెక్ట్ కాదు. మొత్తంగా చూస్తే, ప్రతి కొద్ది నిమిషాలకోసారి వచ్చే చిన్న ట్విస్ట్‌లు, రిఫరెన్స్‌లు సినిమాను బోర్ కొట్టకుండా ముందుకు నడిపిస్తాయి. సినిమా నిడివిని తగ్గించేసి.. కొంచెం తక్కువ నిడివితో, మరింత కట్టుదిట్టంగా ఉంటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ, “హృదయం మురళి” ఒక తేలికపాటి, సరదాగా చూసే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మంచి అనుభూతిని అందిస్తుంది.
ఎవరెలా నటించారంటే..
హృదయ అనే ఇంట్రోవర్ట్ పాత్రలో అధర్వ మురళి ఒదిగిపోయాడు. అతనికి ఈ తరహా పాత్రలు చేయడం కొత్తేమీ కాదు కానీ అయినా కూడా మెప్పించాడు. ఇక హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్ అద్భుతంగా నటించింది. డ్యూయల్ రోల్‌లో మెప్పించింది. ఇక ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫహాద్ ఫాజిల్. ఒక చిన్న పాత్రలో కనిపించినా కూడా హుషారు తెప్పించాడు. ఇక కాయదు లోహర్, నిహారిక ద్రవిడ్ వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు సినిమాకు సంబంధించి ఒక మంచి పాయింట్‌నే తీసుకున్నారు కానీ తెరకెక్కించడంలోనే కొంత తడబడ్డారు. అసలు హీరో ప్రేమ విషయానికి వస్తే.. ఎందుకు ప్రేమిస్తాడో, వారు హీరోని ఎందుకు ఇష్టపడతారో అనేది కూడా బలంగా చూపించలేదు. హీరో స్నేహితుల పాత్రలను సైతం ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయారు. ఇక సంగీతం విషయానికి వస్తే తమన్ అందించిన మ్యూజిక్ వావ్ అనిపించేలా అయితే లేదు. పైగా పాటలు సైతం గుర్తుపెట్టుకునేలా లేవు. ఈ చిత్రంలో తమన్ నటుడిగానూ మెరిశారు. ఇక బీజీఎం పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ కొంత పేలవంగా అనిపించింది.
ఫైనల్‌గా: ‘హృదయం మురళి’ వన్ టైమ్ వాచ్ మూవీ