With Love Movie Review
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అభిషన్ జీవింత్. అందులో ఓ పాత్రలో కూడా కనిపించి మెప్పించారు. ఇప్పడు ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విత్ లవ్’. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో తెరకెక్కిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. సౌందర్య రజనీకాంత్ తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ‘నిర్మించారు. ట్రైలర్ తో సినిమా కు మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో సురేశ్ ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రానా దగ్గుబాటి విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
కథ:
సత్య (అభిషన్ జీవింత్) ఆర్టిటెక్ట్. చాలా సిగ్గరి. అతనికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అక్క ఒత్తిడితో కాఫీ షాప్ లో మోనీషా (అనస్వర రాజన్)ను కలుస్తాడు. మాటల మధ్యలో ఇద్దరు ఒకే స్కూల్లో చదివినట్లు తెలుస్తుంది. అలా చిన్నప్పటి విషయాలు, స్నేహితులు, జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత తాము చదువుకున్న స్కూల్ ను సందర్శించి, స్నేహితులను చిన్నపుడు ఇష్టపడిన వారిని కలవాలనుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? సత్య, మోనీషా ఒకటయ్యారా? లేదా? అన్నది మిగత కథ.
విశ్లేషణ:
స్కూల్ డేస్ క్రష్, అప్పటి జ్ఞాఫకాలు, లవ్ స్టోరీస్, లవ్ ని ఎక్స్ ప్రెస్ చేయలేకపోవడం, బ్రేకప్స్… ఆ తర్వాత జాబ్, కొత్త జీవితం నేపథ్యంలో సాగే క్యూట్ లవ్ స్టోరీ ఇది. హీరోహీరోయిన్ పెళ్లి చూపులతో మొదలై ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్… స్కూల్ కి షిఫ్ట్ అయిన ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంది. స్టూడెంట్స్ మధ్య సన్నివేశాలలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. స్కూల్లో హీరోకి ఓ షాక్ తగలడంతో కథ ప్రజెంట్ కి షిప్ట్ అవుతుంది. అక్కడి నుంచి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. ఆపై ఇంటర్వెల్. ఫస్ట్ హాఫ్ అంతా స్కూల్ డేస్ తో సరదాగా సాగిపోతుంది.
సెకండాఫ్ కాస్త సీరియస్ మోడ్ లో నడుస్తుంది. ప్రస్తుత లవ్ స్టోరీ, దానిని ఎలా ముందుకు తీసుకెళ్లారు? ఈ మధ్యలో ఎదురైన సవాళ్లు… నేపథ్యంలో భావోద్వేగంతో నడుస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో స్కూల్ డేస్, ఫస్ట్ లవ్ అనేది ఓ మంచి జ్ఞాపకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘నా ఆటో గ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ వంటి చిత్రాలు వచ్చాయి. కానీ ఇది కాస్త డిఫరెంట్. థీమ్ ని ఎక్కడ డ్రాప్ చేయకుండా దర్శకుడు తెరకెక్కించాడు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ తమ చిన్నప్పటి జ్ఞాపకాలు జ్ఞప్తికి వస్తాయి. ఈ సినిమాలోని కొన్ని పాత్రలు, సన్నివేశాలు నిజజీవితంలో ఎక్కడో ఓ చోట మనకు టచ్ అవుతాయి.
యువతతో పాటు ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా ఇది. నటీనటుల గురించి…అబిషన్ జీవింత్ సత్య పాత్రలో చక్కగా యాక్ట్ చేశారు. సహజసిద్ధమైన నటనతో ఆకటక్టుకున్నాడు. రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్లో మెప్పించాడు. హీరోయిన్ గా అనస్వర రాజన్ ఈ కథకు పర్ఫెక్ట్ యాప్ట్. క్యూట్ లుక్స్ తో చక్కని నటన, హావభావాలతో మెస్మరైజ్ చేసింది. స్కూల్ డేస్ క్యారెక్టర్ కి, ప్రజెంట్ క్యారెక్టర్ కి మధ్య వ్యత్యాసాన్ని అద్బుతంగా ప్రదర్శించింది. అనీషా పాత్రలో కావ్యా అనిల్, బాలాజీ పాత్రలో సచిన్ నాచప్పన్ మెప్పించారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధి మేరకు నటించారు. సినిమాకు కథతోపాటు పాటలు, మాటలు ఎసెట్ గా నిలిచాయి. సియన్ రోల్డన్ నేపథ్య సంగీతం పెద్ద ప్లస్ అని చెప్పాలి. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ కూడా బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. తెలుగు అనువాదం విషయంలో కూడా మేకర్స్ తగు జాగ్రత్త తీసుకున్నారు.
తీర్పు:
‘విత్ లవ్’ ఒక సింపుల్ కానీ హృదయాన్ని తాకే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. స్కూల్ డేస్ జ్ఞాపకాలు, ఫస్ట్ లవ్ ఎమోషన్, జీవితంలో వచ్చే మార్పులను సహజంగా మిళితం చేస్తూ దర్శకుడు మదన్ సినిమాను ఆసక్తికరంగా నడిపించారు. కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినా, మొత్తం మీద సినిమా తన థీమ్‌ను ఎక్కడా వదలకుండా నడుస్తుంది.