ఓం శాంతి శాంతి శాంతి:

Published by
Srinivas

ఓం శాంతి శాంతి శాంతి: రివ్యూ

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బ జంటగా నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతి శాంతి:. ఏఆర్‌ సజీవ్‌ దర్శకుడు. శివన్నారాయణ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రధారులు. సృజన్‌ ఎర్రబోల్‌ నిర్మించారు. మలయాళంలో బాసిల్‌ జోసెఫ్‌ హీరోగా నటించిన బ్లాక్‌ కామెడీగా తెరకెక్కి మంచి విజయం సాధించిన జయ జయ జయ జయహే చిత్రానికి రీమేక్‌ ఇది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తరుణ్‌ భాస్కర్‌కు హీరోగా హిట్‌ వచ్చిందా లేదా అన్నది చూద్దాం.

కథ:

ప్రశాంతి మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కుటుంబ సభ్యులు నియమ నిబంధనలతో ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేస్తారు. ప్రశాంతి కాలేజ్‌లో లెక్చరర్‌తో చిన్న ప్రేమాయణం నడపడంతో సడన్‌గా చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి, చేపల వ్యాపారి ఓంకార్‌ నాయుడు (తరుణ్‌ భాస్కర్‌)తో ప్రశాంతినిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చని ఓంకార్‌ చెప్పడంతో అతనితో మూడు ముళ్లు వేయించుకుంటుంది. అయితే పెళ్లి తర్వాత తను ఊహించుకున్నట్లు తన జీవితం ఉండదు. ఓంకార్‌ నాయుడు మాటిమాటికీ ప్రశాంతిపై చేయి చేసుకుంటాడు. కన్నవాళ్లతో చెప్పగా సర్దుకుపోవాలనే సలహా ఇస్తారు. అయితే ఓ రోజు ఓంకార్‌కు ఎదురుతిరిగి బుద్ది చెబుతుంది ప్రశాంతి. ఆ తర్వాత ఏం జరిగింది. వీరిద్దరి జీవితం ఎలా సాగింది అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

అమ్మాయికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది. పూర్తిగా గోదావరి జిల్లా నేపథ్యంలో సాగుతుంది. మలయాళంలో హిట్‌ అయిన ుజయ జయ జయజయ హే’ చిత్రానికి రీమేక్‌గా కథలో ఎలాంటా మార్పులు చేయకుండా గోదావరి నేపథ్యాన్ని తీసుకుని దానికి అనుగుణంగా మాత్రమే మార్పులు చేసి సున్నితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఒరిజినల్‌లో ఉన్న ఎమోషనల్‌ టచ్‌ తెలుగులో లేదు.

సినిమా ప్రారంభం అంతా సాఫీగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగినా హీరో పాత్రను బిల్డప్‌ చేయడానికి బాగా టైమ్‌ తీసుకున్నాడు దర్శకుడు. కథలోకి వెళ్లడానికి ఇంటర్వెల్‌ వరకూ సమయం పట్టింది. అది ప్రేక్షకుడి సహనానికి పరీక్షే. పరువు, ప్రతిష్టల పేరుతో అమ్మాయిల స్వేచ్చను హరిస్తున్నామని దర్శకుడు సందేశం ఇచ్చారు. సెకెండ్‌ హాఫ్‌ ప్రారంభం కాస్త గాడి తిప్పినా కాసేపటికే దార్లోకి వస్తుంది.

కోర్టు రూమ్‌ సన్నివేశాలు రొటీన్‌గానే అనిపించినా కొన్ని సీన్లు మాత్రం ఆలోజింపజేసేలా ఉంటాయి. బ్రహ్మాజీ కామెడీ అలరిస్తుంది. అయితే సినిమా ముగింపు పేలవంగా ఉంది. ఒరిజినల్‌తో కంపేర్‌ చేస్తే క్లైమాక్స్‌ చాలా డల్‌ అనే చెప్పాలి. క్లైమాక్స్‌లో అయినా కాస్త మార్పులు చేసుంటే బావుండేది. అది కొంత మైనస్‌ కావచ్చు. ఓంకార్‌ నాయుడిగా తరుణ్‌భాస్కర్‌ బాగా సూట్‌ అయ్యాడు. గోదావరి యాసకు న్యాయం చేశాడు.

ప్రశాంతి పాత్రకు ఈషా రెబ్బ కూడా న్యాయం చేసింది. బ్రహ్మాజీ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించి మెప్పించారు. చక్కని వినోదం కూడా పంచాడు. శివన్నారాయణ తదితరులు పాత్రలు పరిధి మేరకు బాగానే ఉన్నాయి. సినిమా రీమేక్‌ అయినా దర్శకుడు ఎక్కువ గోదావరి టచ్‌ ఇచ్చాడు. మాటలు ఆకట్టుకున్నాయి.

పాటలు ఫర్వాలేదనిపించాయి. ఎడిటింగ్‌ వీక్‌ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బావుంది. జె.క్రిష్‌ సంగీతం సినిమాకు ప్లస్‌. నిర్మాణ పరంగా పేరు పెట్టక్కర్లేదు. చిన్న సినిమా అయినప్పటికీ క్వాలిటీ విషయంలో నిర్మాత సృజన్‌ కాంప్రమైజ్‌ కాలేదు.

తీర్పు:

థియేటర్‌ నుంచి బయటకొచ్చినప్పుడు ఫ్రెష్‌ ఫీల్‌ అయితే కలగదు. అతి నిజాయతీతో రీమేక్‌ చేయడం వల్ల వచ్చిన సమస్య అది. కథ నడిచిన తీరు చూస్తే.. థియేట్రికల్‌గా కన్నా ఓటీటీల్లో నడిచే అవకాశం ఉంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts