Download App

కృష్ణలంక పోలీస్ స్టేషన్లో… సామాన్యుల ప్రశ్నలకు బదులేదీ…

జూన్ 20, 2026 By Suresh Thota
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు కేవలం ఒక మిస్సింగ్ కేసు కాదు. ఇది రాష్ట్ర పోలీసు వ్యవస్థ, పరిపాలన జవాబుదారీతనం, పౌర హక్కులపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్న వ్యవహారంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులు "పోలీసులు తీసుకెళ్లిన తర్వాతే మా కుమారుడు కనిపించకుండా పోయాడు"...
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో... సామాన్యుల ప్రశ్నలకు బదులేదీ...

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు కేవలం ఒక మిస్సింగ్ కేసు కాదు. ఇది రాష్ట్ర పోలీసు వ్యవస్థ, పరిపాలన జవాబుదారీతనం, పౌర హక్కులపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్న వ్యవహారంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యులు “పోలీసులు తీసుకెళ్లిన తర్వాతే మా కుమారుడు కనిపించకుండా పోయాడు” అని ఆరోపిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం విచారణకు ఆదేశించి సంబంధిత అధికారులపై చర్యలు ప్రారంభించింది. కానీ ప్రజలకు కావాల్సింది చర్యల ప్రకటనలు కాదు… నిజం…

ఈ కేసులో ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, మే 9న సాయికృష్ణను పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విషయం హైకోర్టు వరకు వెళ్లింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించి సంబంధిత సీఐపై చర్యలు తీసుకుంది.

అయితే ఇక్కడ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న….? ఏమిటంటే, ఒక వ్యక్తి పోలీసుల వద్దకు వెళ్లిన తర్వాత…. ఏమయ్యాడు. అతని ఆచూకీ గురించి ఇంత పెద్ద వివాదం ఎందుకు ఏర్పడాలి…..? ఆధునిక సాంకేతికత, సీసీటీవీలు, డిజిటల్ రికార్డులు ఉన్న యుగంలో ఒక వ్యక్తి జాడపై స్పష్టత లేకపోవడం సహజంగా అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఈ కేసులో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెడితే, పోలీసు వ్యవస్థ మరియు ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన కొన్ని కీలక ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సాయికృష్ణను పోలీసులు అధికారికంగా అదుపులోకి తీసుకున్నారా…? తీసుకుని ఉంటే ఆ రికార్డులు ఎక్కడ ఉన్నాయి….?

ఇది ఈ కేసులో అత్యంత ప్రాథమిక ప్రశ్న. అరెస్ట్ మెమో, స్టేషన్ డైరీ నమోదు, విచారణ రికార్డులు ఉంటే వాటిని ప్రజల ముందుంచాలి. లేకపోతే ఎందుకు లేవో వివరించాలి.

సాయికృష్ణను చివరిసారిగా ఏ అధికారి, ఏ ప్రదేశంలో చూశాడు? ఈ ఒక్క ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వస్తే కేసులో సగం నిజం బయటపడే అవకాశం ఉంది. అతడిని చివరిసారిగా ఎవరు చూశారు? ఆ తర్వాత ఏమి జరిగింది?

పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలు ఏమి చెబుతున్నాయి?

ఈరోజుల్లో ప్రతి పోలీస్ స్టేషన్‌లో కెమెరాలు ఉన్నాయి. సాయికృష్ణ స్టేషన్‌కు వచ్చాడా…? బయటకు వెళ్లాడా….? వెళ్లి ఉంటే ఎవరితో వెళ్లాడు….? ఈ అంశాలపై స్పష్టత రావాలి.

ఒక వ్యక్తి అదృశ్యమైన విషయం బయటపడిన వెంటనే శాఖాపరమైన విచారణ ఎందుకు ప్రారంభం కాలేదు…?

కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసిన తర్వాత కూడా ఎందుకు ఆలస్యం జరిగింది? ఈ ఆలస్యం కారణంగా ఏవైనా కీలక ఆధారాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందా….?

సీఐపై చర్య తీసుకునేంత ప్రాథమిక సమాచారం ప్రభుత్వానికి లభించి ఉంటే, ఆ సమాచారం ఏమిటి…?

సాధారణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక అధికారిపై చర్య తీసుకోరు. అయితే ప్రభుత్వం ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది…? ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంది.

ఈ కేసులో పూర్తిస్థాయి నిజాన్ని వెలికితీయడానికి ప్రభుత్వం స్వతంత్ర విచారణకు సిద్ధమా…?

పోలీసులపై ఆరోపణలు ఉన్నప్పుడు అదే వ్యవస్థ విచారణ చేస్తే సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంటుందా…. కాబట్టి స్వతంత్ర సంస్థ లేదా న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో విచారణ జరపాలా అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఈ ఆరు ప్రశ్నలు కేవలం సాయికృష్ణ కుటుంబానివి కావు. ఇవి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ప్రశ్నలు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో చట్టాన్ని అమలు చేసే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకానికి పునాది పారదర్శకత. సాయికృష్ణపై గతంలో కేసులు ఉన్నాయా? అతడు రౌడీ షీటరా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ ఆ అంశాలు అసలు ప్రశ్నను మరుగున పరచకూడదు. ఒక వ్యక్తిపై ఎన్ని కేసులు ఉన్నా, అతనికి చట్టపరమైన హక్కులు ఉంటాయి. విచారణ పేరుతో అదృశ్యమవడం లేదా అతని ఆచూకీ పై సందేహాలు తలెత్తడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు.

ఈ కేసులో చివరికి ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే రాజకీయ వాదనలు కాదు, భావోద్వేగ ప్రసంగాలు అంతకన్నా కాదు, పూర్తి స్థాయి నిజం. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతనికి ఏమైంది….? ఆ రోజున జరిగిన సంఘటనల పూర్తి క్రమం ఏమిటి….?

ఈ ప్రశ్నలకు స్పష్టమైన, ఆధారాలతో కూడిన సమాధానం వచ్చే వరకు ఈ కేసు ముగియదు. ఎందుకంటే ఇది ఒక కుటుంబం న్యాయం కోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు…. రాష్ట్రంలో చట్ట పరిపాలనపై ప్రజల విశ్వాసాన్ని పరీక్షిస్తున్న ఘటన ఇది..

ముగింపు: కరోనా కాలం లో జరిగిన లాకప్ డెత్ కేసు విచారణ కు సంబంధించి…. 2026 ఏప్రిల్ 6న మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు “సాథాంకులం”లో తండ్రి, కొడుకుల కస్టడీ మరణాల కేసులో దోషులుగా తేలిన 9 మంది పోలీసు సిబ్బందికి మరణదండన (ఉరిశిక్ష) విధించింది. కోర్టు దీనిని అత్యంత అరుదైన (Rarest of Rare) కేసుగా అభివర్ణించింది. ఇది అందరికీ తెలిసినదే… అలాగే ఈ సాయి కృష్ణ కేసు విచారణలో అధికారులు తప్పు చేసినట్లు రుజువు అయితే…. పైన విధించిన తీర్పునే వీళ్లకి వర్తించే అవకాశాలు ఉన్నాయి అని సోషల్ మీడియా వేదికగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading