Download App

కాశ్మీర్ ఉద్యమం, నెహ్రూతో విభేదాలు, మరణం తర్వాత మరింత బలపడిన భావజాలం (భాగం–2)

జూలై 11, 2026 By Suresh Thota
1951లో "భారతీయ జనసంఘ్‌"ను స్థాపించిన తర్వాత డాక్టర్ "శ్యామా ప్రసాద్ ముఖర్జీ" రాజకీయ లక్ష్యం మాత్రం ఒక్కటే, భారతదేశం నకు ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ గుర్తింపు, ఒకే సార్వభౌమాదికార వ్యవస్థ ఉండాలి, ప్రతిదీ దాని ప్రకారమే నడవాలి. దేశ విభజన వల్ల ఏర్పడిన గాయాలు ఇంకా మానకముందే,...
కాశ్మీర్ ఉద్యమం, నెహ్రూతో విభేదాలు, మరణం తర్వాత మరింత బలపడిన భావజాలం (భాగం–2)

1951లో “భారతీయ జనసంఘ్‌”ను స్థాపించిన తర్వాత డాక్టర్ “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” రాజకీయ లక్ష్యం మాత్రం ఒక్కటే, భారతదేశం నకు ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ గుర్తింపు, ఒకే సార్వభౌమాదికార వ్యవస్థ ఉండాలి, ప్రతిదీ దాని ప్రకారమే నడవాలి. దేశ విభజన వల్ల ఏర్పడిన గాయాలు ఇంకా మానకముందే, మరోసారి ప్రాంతీయ ప్రత్యేక హోదా వల్ల జాతీయ సమైక్యత బలహీన పడుతుందని ఆయన భావించారు. అందుకే ఆయన దేశ సమైక్యత కొరకు, “జమ్మూ & కాశ్మీర్” అంశంపై దృష్టి కేంద్రీకరించారు. స్వాతంత్ర్యం తర్వాత జమ్మూ & కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగ స్థితి ఏర్పడింది. అప్పట్లో భారత రాజ్యాంగంలోని తాత్కాలిక నిబంధనగా అమల్లోకి వచ్చిన ప్రత్యేక హోదా కారణంగా ఆ రాష్ట్రానికి స్వంత రాజ్యాంగం, స్వంత జెండా ఉండేది. భారత పౌరులు అక్కడికి వెళ్లడానికి కొన్ని పరిపాలనా నియమాలు కూడా అమల్లో ఉండేవి. ఆ కాలపు రాజకీయ నాయకత్వం దీనిని పరిస్థితులకు అనుగుణమైన తాత్కాలిక రాజీగా సమర్థించుకున్నది. కాని “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” దాన్ని జాతీయ సమైక్యతకు అత్యంత ప్రమాదకరంగా చూశారు.

ఆయన తరచూ ఒక ప్రశ్న అడిగేవారు అందర్నీ ,”ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు విధానాలు ఎలా ఉంటాయి…?”అని, ఈ భావనే తరువాత “ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండకూడదు” అనే రాజకీయ నినాదంగా రూపుదిద్దుకుంది. ఇది కేవలం నినాదం కాదు, భారతదేశాన్ని ఒకే రాజ్యాంగ వ్యవస్థలో చూడాలనే ఆయన రాజకీయ తత్వానికి ప్రతీకగా మారింది.

ఈ అంశంలో ఆయనకు ప్రధాని “జవహర్ లాల్ నెహ్రూ” తో తీవ్రమైన సిద్ధాంతపరమైన విభేదాలు ఏర్పడ్డాయి. నెహ్రూ అభిప్రాయం ప్రకారం, జమ్మూ-కాశ్మీర్ పరిస్థితులు అసాధారణమైనవి. అందువల్ల అక్కడి ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ప్రత్యేక రాజ్యాంగ ఏర్పాట్లు అవసరమని ఆయన భావించారు. మరోవైపు, డాక్టర్ “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” అభిప్రాయం ప్రకారం, ఈ తాత్కాలిక ఏర్పాట్లు కాస్తా, శాశ్వత రాజకీయ సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ రెండు దృక్కోణాలు భారతదేశ భవిష్యత్తు గురించి రెండు వేర్వేరు రాజకీయ తత్వాలను ప్రతిబింబించాయి.

ఈ కాలంలో “జమ్మూ & కాశ్మీర్” నాయకుడు “షేక్ అబ్దుల్లా” (Sheikh Abdullah)తో కూడా “శ్యామా ప్రసాద్ ముఖర్జీ”కి తీవ్ర రాజకీయ విభేదాలు ఏర్పడ్డాయి. నాటి ప్రధాని నెహ్రూ మద్దతు తో “షేక్ అబ్దుల్లా” ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని సమర్థిస్తుండగా, ముఖర్జీ పూర్తి రాజ్యాంగ సమైక్యతను కోరారు. ఈ విభేదాలు క్రమంగా దేశవ్యాప్త రాజకీయ చర్చగా మారాయి. 1953లో డాక్టర్ “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. “జమ్మూ & కాశ్మీర్‌”లో అమలులో ఉన్న ప్రవేశ అనుమతి (పర్మిట్) విధానాన్ని వ్యతిరేకిస్తూ, అనుమతి తీసుకోకుండా అక్కడికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. “నేను భారతదేశ పౌరుడిని. నా దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లడానికి అనుమతి ఎందుకు తీసుకోవాలి…?” అనే ప్రశ్నను ఆయన ఉద్యమానికి కేంద్రంగా నిలిపారు.

1953 మేలో “జమ్మూ & కాశ్మీర్‌”లోకి ప్రవేశించే సమయంలో ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను నిర్బంధంలో ఉంచారు. దాదాపు ఆరు వారాల తర్వాత, 1953 జూన్ 23న ఆయన మరణించారు. అధికారికంగా ఆయన మరణానికి వైద్య కారణాలనే పేర్కొన్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు, జనసంఘ్ నాయకులు, అనేక రాజకీయ ప్రముఖులు ఆ సమయంలోనే సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. వైద్య నిర్లక్ష్యం జరిగిందా..? సరైన చికిత్స అందిందా…? అనే ప్రశ్నలు దశాబ్దాల పాటు చర్చకు వచ్చాయి. ఈ అంశంపై అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆయన మరణానికి సంబంధించి కుట్ర జరిగిందని నిర్ధారించిన దాఖలాలు లేవు. అటువంటి అధికారిక న్యాయ నిర్ణయం వెలువడలేదు. కొంతమందికి ఈయన మరణం మిలియన్ల డాలర్ల ప్రశ్న గా మిగిలిపోయింది.

చరిత్రలో కొన్నిసార్లు ఒక వ్యక్తి జీవితం కంటే అతని మరణమే పెద్ద రాజకీయ మలుపు అవుతుంది. “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” విషయంలో అదే జరిగింది. ఆయన మరణం జనసంఘ్ కార్యకర్తల్లో తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగించింది. దేశ సమైక్యత కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుడిగా ఆయనను పార్టీ స్మరించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆయన జయంతి, వర్ధంతి జనసంఘ్, నిర్వహించేది. తరువాత “భారతీయ జనతా పార్టీ” ఆధ్వర్యంలో జరగడం ప్రారంభమైనది. ఆయన మరణం తర్వాత కూడా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం మాయమవలేదు. “జమ్మూ & కాశ్మీర్” ప్రత్యేక హోదా ఎంతకాలం కొనసాగాలి…? జాతీయ సమైక్యత అంటే ఏమిటి…? కేంద్రం మరియు రాష్ట్రాల సంబంధం ఎలా ఉండాలి…? వంటి ప్రశ్నలు దశాబ్దాల పాటు భారత రాజకీయ చర్చల్లో నిలిచిపోయాయి. ఈ అంశాలే తరువాత జనసంఘ్ ప్రధాన ఎన్నికల అజెండాగా, అనంతరం భారతీయ జనతా పార్టీ ప్రధాన భావజాలంగా మారాయి.

“శ్యామా ప్రసాద్ ముఖర్జీ”ని అర్థం చేసు కోవాలంటే ఆయనను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా చూడడం సరిపోదు. ఆయన ఒక భావజాల నిర్మాత. ఆయన మద్దతుదారుల దృష్టిలో దేశ సమైక్యత కోసం తన మంత్రి పదవిని, చివరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన నాయకుడు. మరోవైపు, విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఆయన ప్రతిపాదించిన కొన్ని రాజకీయ పరిష్కారాలపై చర్చ అవసరం. ప్రజాస్వామ్యంలో ఈ రెండు దృక్కోణాలూ చరిత్రలో భాగమే.

అయితే ఒక విషయం మాత్రం నిర్వివాదం. 1953లో ఆయన మరణంతో ఆయన చరిత్ర, రాజకీయ జీవితం ముగిసింది. కాని ఆయన భావజాల ప్రయాణం అప్పుడే ప్రారంభమైంది. ఆయన స్థాపించిన చిన్న పార్టీ తరువాత భారత రాజకీయాల్లో అతిపెద్ద శక్తిగా ఎలా ఎదిగింది….? ఆయన ఆలోచనలు 66 సంవత్సరాల తర్వాత దేశ విధానాలపై ఎలా ప్రభావం చూపాయి…? చివరకు ఎందుకు 2026లో ప్రధాని “నరేంద్ర మోదీ” ఆయన 125వ జయంతిని జాతీయ స్థాయిలో అంత ప్రాధాన్యంగా ఎందుకు గుర్తించారు….? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం 3వ భాగంలో…

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading