Download App

ఒక యుద్ధం ముగియకముందే మరో యుద్ధం… ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి ఈ ఘర్షణలు…?

జూలై 10, 2026 By Suresh Thota
ప్రపంచం మరోసారి యుద్ధ మేఘాల మధ్య నిలిచింది. కొద్దిరోజుల క్రితం తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన అమెరికా & ఇరాన్ ఉద్రిక్తత మళ్లీ చెలరేగుతోంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా సైనిక చర్యలు చేపట్టగా, ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. దీంతో పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా...
ఒక యుద్ధం ముగియకముందే మరో యుద్ధం… ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తున్నాయి ఈ ఘర్షణలు…?

ప్రపంచం మరోసారి యుద్ధ మేఘాల మధ్య నిలిచింది. కొద్దిరోజుల క్రితం తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన అమెరికా & ఇరాన్ ఉద్రిక్తత మళ్లీ చెలరేగుతోంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా సైనిక చర్యలు చేపట్టగా, ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. దీంతో పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య వివాదం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్థాయిలో ఉన్న పరిణామం.
ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రోజూ భారీ మొత్తంలో ముడి చమురు రవాణా అవుతోంది. అక్కడ ఉద్రిక్తత పెరిగిన ప్రతిసారి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం సహజం. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌తో ముగియదు. రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం, విద్యుత్, చివరకు నిత్యావసర వస్తువుల ధరల వరకు ప్రతి రంగానికీ వ్యాపిస్తుంది.

భారత్‌కు ఇది మరింత సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అంతర్జాతీయ ధరలు పెరిగితే విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి జీవన వ్యయం మరింత భారమవుతుంది.

ఈ ప్రభావం మొదటగా కనిపించేది స్టాక్ మార్కెట్లలోనే. యుద్ధ వార్తలు వచ్చిన ప్రతిసారి ప్రపంచ పెట్టుబడిదారులు అప్రమత్తమవుతారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని బంగారం, అమెరికా డాలర్ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు వెళ్తారు. ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయి. భారత మార్కెట్లు కూడా దీనికి మినహాయింపు కావు. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గితే సెన్సెక్స్, నిఫ్టీపై తీవ్ర ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్, విమానయాన, ఆటోమొబైల్, రసాయన పరిశ్రమలు, చమురుపై ఆధారపడే రంగాలు ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

అయితే ఈ సంక్షోభాన్ని ఒక్క అమెరికా మరియు ఇరాన్ ఘర్షణగా మాత్రమే చూడడం తగదు. ప్రపంచం ఇప్పటికే ఉక్రెయిన్ & రష్యా యుద్ధం భారాన్ని మోస్తోంది. ఆ యుద్ధం నాలుగో సంవత్సరంలోకి అడుగుతుంది పూర్తి స్థాయిలో ముగియలేదు. యూరప్ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆహార సరఫరా, ఎరువుల మార్కెట్, ఇంధన రంగం ఇప్పటికీ దాని ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తత మొదలై ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా చుట్టుకున్నది.

ఉక్రెయిన్ & రష్యా యుద్ధం ముగిస్తేనే అమెరికా మరియు ఇరాన్ ఘర్షణ ఆగిపోతుందని చెప్పడం సరైన విశ్లేషణ కాదు, ఈ రెండు ఘర్షణల వెనుక ఉన్న రాజకీయ, భౌగోళిక కారణాలు వేర్వేరు కావచ్చు. కాని జాగ్రత్తగా పరిశీలిస్తే అమెరికా కు తను యుద్ధం ముగించుకుని, రష్యాను ఉక్రెయిన్ యుద్ధం ద్వారా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలనే కుత్సిత బుద్ధి తో ఉందనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఒకేసారి రెండు పెద్ద యుద్ధాలు కొనసాగితే అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారతాయి. అమెరికా, రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాల వ్యూహాలు పరస్పరం ప్రభావితం అవుతాయి. ఒక ప్రాంతంలోని యుద్ధం మరొక ప్రాంతంలోని ఉద్రిక్తతను మరింత పెంచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు ఆయుధాల పోటీలో ముందుకు సాగుతున్నాయి. శాంతి చర్చలు మాత్రం వెనుకబడుతున్నాయి. ఆయుధ పరిశ్రమలు లాభపడుతున్నాయి. కానీ నష్టపోతున్నది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఇంకా ఎక్కువ నష్టపోతున్నది సామాన్య ప్రజల జీవితం. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, దాని ధరను చెల్లించేది సాధారణ కుటుంబమే.
భారత్ ఇప్పుడు అత్యంత సమతుల్య విదేశాంగ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు, మరోవైపు రష్యాతో రక్షణ సహకారం, ఇంకోవైపు పశ్చిమాసియా దేశాలతో ఇంధన సంబంధాలు ఈ మూడింటి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం భారత దౌత్యానికి పెద్ద పరీక్షగా మారుతోంది.

ప్రపంచానికి ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది కొత్త యుద్ధాలు కాదు… కొత్త శాంతి ఒప్పందాలు. ఎందుకంటే యుద్ధాలు సరిహద్దుల్లో మొదలవుతాయి. కానీ వాటి ప్రభావం ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థ మీద, బడ్జెట్‌ మీద, ప్రతి కుటుంబ వంటింటి తో సహా, ప్రతి యువకుడి ఉద్యోగ అవకాశాలపై పడుతుంది.

ఇక్కడ ప్రపంచ దేశాలు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అంశాలు…..ఏమిటంటే…..

ఉక్రెయిన్ & రష్యా యుద్ధం ఇంకా ముగియక ముందే అమెరికా & ఇరాన్ ఘర్షణ మళ్లీ మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం ఈ భారాన్ని మోయగలదు….?

ప్రపంచ దేశాలు శాంతి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయా…..? లేక యుద్ధాల కోసం చేస్తున్నాయా ….?

ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు నిజంగా ఘర్షణలను ఆపగలుగుతున్నాయా…? లేక కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయా…..?

చమురు, ఆయుధాలు, భౌగోళిక ఆధిపత్యం… వీటిలో అసలు యుద్ధాలను నడిపిస్తున్నది ఏది….?

స్టాక్ మార్కెట్లు కుప్పకూలి, చమురు ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం పెరిగితే… చివరికి ఆ భారం మోసేది సామాన్యుడే కదా…?

ప్రపంచ నాయకులు యుద్ధాల్లో గెలుస్తున్నామని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ శాంతిని కోల్పోతున్న ప్రపంచాన్ని ఎవరు గెలిపిస్తారు….?

ఒక యుద్ధం ముగిసేలోపు మరో యుద్ధం మొదలవుతుంటే… ప్రపంచం అభివృద్ధి వైపు వెళ్తుందా….? లేక శాశ్వత అస్థిరత వైపు నడుస్తుందా….?

చరిత్ర ఏం చెబుతోంది… యుద్ధాలు గెలిచిన దేశాలు ఉన్నాయి. కాని యుద్ధాల వల్ల నష్టపోని దేశం ఒక్కటి కూడా లేదు. అందుకే ఈ రోజు ప్రపంచానికి అత్యవసరమైన ఆయుధం శాంతి. ప్రపంచ మానవాళికి భారతదేశం ఎప్పుడూ శాంతి గురించే చెపుతుంది, తప్పితే యుద్ధాలు గురించి కాదు. ఎప్పుడు భారతదేశం తనకు తానుగా ఎప్పుడూ యుద్ధంలో పాల్గొనలేదు. అది భారత దేశం గొప్పతనం.

ముగింపు: మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి….. మన దగ్గర కూడా ఉన్నది అని చెప్పడానికే…. అందుకే భారత దేశం పెట్టుకున్న నియమం ఒక్కటే…. No First Use అనేది, అణ్వాయుధాల వినియోగంపై భారతదేశం అనుసరిస్తున్న ప్రధాన విధానం. దీని ప్రకారం, భారత్‌పై ముందుగా శత్రుదేశం అణ్వాయుధాలతో దాడి చేస్తే తప్ప, తాము ముందుగా వాటిని ఉపయోగించబోమని స్పష్టమైన నియమం పెట్టుకుంది. ఇదీ భారత దేశం గొప్పదనం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading