
ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది ప్రజలు తెలుగు మాతృభాష మాట్లాడుతున్నారు. సంఖ్య ప్రకారం భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు మూడవ స్థానంలో ఉంది, మరియు ప్రపంచవ్యాప్తంగా పదిహేనవ స్థానంలో ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరైన యాస తో పరిఢవిల్లుతుంది. కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శాఖోపశాఖలుగా, ప్రాంతాల వారిగా విడిపోయి ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ సంకుచిత మనస్తత్వంతో, పరిపక్వత లేక కునారిల్లుతున్నారు. ఇదంతా ఎందుకు అంటే…
ఒక సినిమా టైటిల్ తెలుగు భాషలోని మాండలికాలపై ఇంత పెద్ద చర్చకు కారణమవుతుందని ఎవరూ ఊహించలేదు. తమ సినిమా టైటిల్ చుట్టూ ఇంత పెద్ద చర్చ జరుగుతుందని బహుశా ఆ చిత్ర బృందం కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ “ఇడుపు కాయితం” అనే పేరు ఇప్పుడు కేవలం ఒక సినిమా టైటిల్‌గా కాకుండా, తెలుగు భాషలోని మాండలికాల గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలుపెట్టిన ఒక అంశంగా మారింది. ఒక పదం అర్థం తెలియక సోషల్ మీడియాలో సరదాగా(వెటకారం అని కొందరు )స్పందించారు. మరికొందరు దాన్ని తెలంగాణ మాండలికాన్ని అవమానించినట్లుగా భావించారు. ఇంకొందరు భాషా గౌరవం పేరుతో రాజకీయ కోణాన్ని కూడా జోడించారు. ఫలితంగా, ఒక సినిమా ప్రచారం భాష, సంస్కృతి, ప్రాంతీయ ఆత్మగౌరవంపై పెద్ద చర్చకు వేదికైంది.
నిజానికి “ఇడుపు కాయితం” తెలంగాణ మాండలికంలో చాలాకాలంగా వినిపిస్తున్న పదం. “ఇడుపు” అంటే విడిపోవడం లేదా వదిలేయడం, “కాయితం” అంటే పత్రం. ఈ రెండింటి కలయికగా “ఇడుపు కాయితం” అంటే విడిపోవడానికి రాసుకునే పత్రం, అంటే విడాకుల ఒప్పంద పత్రం అనే అర్థం వస్తుంది. ఇది న్యాయపరమైన పదం కాకపోయినా, గ్రామీణ వ్యవహారాల్లో ప్రజల నోట ఈ పద ప్రయోగం సహజమైన తెలుగు పదం.
అదే సమయంలో “ముచ్చెలక” లేదా “ముచ్చీలిక” అనే పదం కూడా తెలుగు ప్రాంతాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. ఇది సాధారణంగా ఒప్పంద పత్రం, రాజీ పత్రం, లేదా పరస్పర అంగీకారంతో రాసుకునే లిఖిత పత్రం అనే విస్తృత అర్థాన్ని కలిగి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భార్యాభర్తలు విడిపోతున్నప్పుడు కూడా “ముచ్చీలిక రాసుకున్నారు” అనే వాడుక కనిపిస్తుంది. అంటే, “ఇడుపు కాయితం” ఒక నిర్దిష్ట సందర్భాన్ని సూచిస్తే, “ముచ్చీలిక” మరింత విస్తృతమైన భావాన్ని వ్యక్తపరుస్తుంది.
భాషా పరిణామాన్ని పరిశీలిస్తే, గోదావరి పరివాహక ప్రాంతంలో వినిపించేవారు విరివిగా ప్రస్తావించే పదం ఎక్కడికి వెళ్ళావు అంటే “అద్దర వెళ్లాను” అని అంటారు. వాస్తవానికి “ఆ దరికి వెళ్లాను” అనే పూర్తి రూపం నుంచి కాలక్రమేణా ఉచ్చారణ సౌలభ్యం వల్ల మారి ఉండవచ్చు, తెలుగులో పదాలు కుదించబడటం, ధ్వనులు కలిసిపోవడం సహజమైన ప్రక్రియ కావడంతో “ఆ దరి” “అద్దర” అనే రూపాంతరం సహజంగానే కనిపిస్తుంది. అయితే దీనిని వాడుకలో యాసగా చూడాలి తప్ప….. తప్పు గా చూడరాదు.
భాషాశాస్త్రం చెబుతున్న ఒక గొప్ప సత్యం ఏమిటంటే, మాండలికం అనేది భాషకు వ్యతిరేకం కాదు, భాషకు సంపద. తెలంగాణలో “ఇడుపు కాయితం” ఉంటే, కోస్తాలో వేరే పదం ఉండవచ్చు. రాయలసీమలో ఇంకో పదం ఉండవచ్చు. అదే తెలుగు భాష యొక్క వైవిధ్యం. ఒక ప్రాంతంలో వినిపించే పదం మరొక ప్రాంతానికి కొత్తగా అనిపించడం సహజం. దానిని ఎగతాళి చేయడం పద్ధతి కాదు.
సోషల్ మీడియాలో ఈ వివాదం రెండు పార్శ్వాలు చూపించింది. ఒకవైపు కొందరు ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. తెలంగాణ మాండలికంలోని మరెన్నో పదాలను వెతికి చదివారు. మరోవైపు కొందరు సరదా పేరుతో ట్రోల్స్ చేశారు. దురదృష్టవశాత్తూ కొన్ని పోస్టులు భాషను దాటి ప్రాంతీయ విమర్శలుగా మారాయి. విమర్శలకు హద్దు ఉంటుంది. అవమానానికి ఉండదు. ఈ తేడాను గుర్తించలేకపోవడం మన తెలుగు వారు చేసుకున్న దౌర్భాగ్యం.
రాజకీయంగా కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. తెలంగాణ భాషా గౌరవం పేరుతో కొందరు నాయకులు స్పందించగా, మరికొందరు దీనిని అనవసర వివాదంగా అభివర్ణించారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. భాష ప్రజలది, రాజకీయాలది కాదు. రాజకీయాలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, కానీ ప్రజల నోట నడిచే పదాలు శతాబ్దాల పాటు నిలిచిపోతాయి.
ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. లక్షల మందికి “ఇడుపు కాయితం” అనే పదం అసలు అర్థం ఇప్పుడు తెలిసింది. అలాగే “ముచ్చీలిక” అనే పాత తెలుగు పదం కూడా మళ్లీ చర్చలోకి వచ్చింది. ఒక సినిమా టైటిల్ తెలుగు నిఘంటువులోని మరచిపోయిన పదాలను మళ్లీ ప్రజల ముందుకు తీసుకురావడం చిన్న విషయం కాదు. ఇదే సాహిత్యం, సినిమా, సంస్కృతి కలిసి చేసే పని. సినీ పరిశ్రమ కోణంలో చూస్తే, ఇది నిర్మాతలకు ఊహించని ప్రచారాన్ని తీసుకొచ్చింది. విడుదలకు ముందే సినిమా పేరు ఇంటింటికీ చేరింది. ఒక టైటిల్‌పై ఇంత చర్చ జరగడం అరుదు. అయితే ఈ ప్రచారం సినిమా విజయానికి హామీ కాదు. చివరికి ప్రేక్షకులు తీర్పు చెప్పేది టైటిల్‌ను బట్టి కాదు, కథను, నటనను, చిత్ర నాణ్యతను చూసే. ఈ సంఘటన మనకు ఒక మంచి పాఠం కూడా నేర్పుతోంది.
తెలుగు భాష అక్షరాలు ఒకటే అయినా, యాస ఒకే రకంగా ఉండదు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు, అనంతపురం నుంచి భద్రాచలం వరకు పదాలు మారుతాయి, యాస మారుతుంది, ఉచ్చారణ మారుతుంది. కానీ భాష మాత్రం ఒక్కటే. ఒకరి పదాన్ని మరొకరు గౌరవించడం అంటే భాషను గౌరవించినట్లే. వైవిధ్యాన్ని అంగీకరించిన భాషే శాశ్వతంగా నిలుస్తుంది. చివరగా చెప్పాల్సింది ఒక్కటే. “ఇడుపు కాయితం” వివాదాన్ని రచ్చగా కాకుండా, తెలుగు భాషా వైవిధ్యాన్ని తెలుసుకునే అవకాశంగా తీసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది.
“ఇడుపు కాయితం” అయినా, “ముచ్చీలిక” అయినా, “వీలునామా” అయినా, “రాజీ పత్రం” అయినా, ఇవన్నీ తెలుగు జీవన విధానంలో పుట్టిన పదాలే. పదాలు ప్రాంతాన్ని సూచించవచ్చు, కానీ భాషను విడగొట్టవు. ఈ వివాదం చివరికి మనకు చెప్పే సందేశం కూడా అదే “మాండలికాలు వేరు కావచ్చు, కానీ తెలుగు భాష మాత్రం ఒక్కటే”.
ముగింపు: నిజం చెప్పాలంటే పాత తరం సినీ కవులు కూడా గ్రాంథికంలో కూడా ఇతర భాషల పద ప్రయోగం తెలుగులో జేర్చారు. ఎవరి సౌలభ్యం వారిది. కొందరు ఉంటారు పరిణితి చెందనివారు. వారిని వదిలేసి ఇటువంటి చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుని, దేశ సమగ్రతకు, తెలుగు భాష ఔనత్యం నకు భంగం కలిగించకుండా అందరూ కలసి ఉంటే తెలుగు భాష కీర్తి ఇనుమడిస్తుంది.
“భాషా వైవిధ్యాన్ని ఎగతాళి చేయడం కంటే అర్థం చేసుకోవడం సమాజానికి మేలు చేస్తుంది. భాషను విభజించే వ్యాఖ్యలు క్షణిక సంచలనం కలిగించవచ్చు, కానీ భాషను కలిపే ఆలోచనలు శాశ్వత గౌరవాన్ని తీసుకొస్తాయి.”
