Download App

POJK లో తిరుగుబాటు… పాక్ కాల్పులు…. సింధు జలాల వెనుక రహస్యం ఇదే…

జూలై 1, 2026 By Suresh Thota
పాకిస్థాన్ పాలకులు ఎప్పుడైనా సరే.. తమ దేశంలో అంతర్గత తిరుగుబాట్లు, ఆర్థిక సంక్షోభాలు ముదిరినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి "భారత్ వ్యతిరేకత" అనే పాత మంత్రాన్ని బయటకు తీస్తుంటారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (POJK) లో జరుగుతున్న ప్రజా తిరుగుబాటును పక్కదారి పట్టించేందుకు ఇస్లామాబాద్ ఇప్పుడు...
POJK లో తిరుగుబాటు… పాక్ కాల్పులు…. సింధు జలాల వెనుక రహస్యం ఇదే…

పాకిస్థాన్ పాలకులు ఎప్పుడైనా సరే.. తమ దేశంలో అంతర్గత తిరుగుబాట్లు, ఆర్థిక సంక్షోభాలు ముదిరినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి “భారత్ వ్యతిరేకత” అనే పాత మంత్రాన్ని బయటకు తీస్తుంటారు. ప్రస్తుతం పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (POJK) లో జరుగుతున్న ప్రజా తిరుగుబాటును పక్కదారి పట్టించేందుకు ఇస్లామాబాద్ ఇప్పుడు మళ్లీ అదే కుతంత్రానికి తెరలేపింది. సింధు నది జలాల ఒప్పందంపై పాక్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి “ముసదిక్ మాలిక్” తాజాగా చేసిన “చేతులు నరుకుతాం” అనే వివాదాస్పద వ్యాఖ్యలు.. పీవోజెకేలో పాక్ సైన్యం చేస్తున్న అణచివేతను కప్పిపుచ్చుకునేందుకేనని స్పష్టమవుతోంది.

గత కొన్నేళ్లుగా పాక్ పాలకుల వివక్ష కారణంగా నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగంతో నలిగిపోతున్న పీవోజెకే ప్రజలు.. ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరుగా రణభేరి మోగించారు. స్థానిక హక్కుల కోసం ఏర్పాటైన “జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ” (JKJAAC) నేతృత్వంలో ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. జూలై 27న పీవోకే అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో.. పాకిస్థాన్ లోపల స్థిరపడిన శరణార్థుల కోసం 12 స్థానాలను రిజర్వు చేస్తూ పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ కార్చిచ్చును మరింత రాజేసింది.

“మాకు మీ రేషన్ అవసరం లేదు.. మీకే మేము అవసరం. మా స్వతంత్ర స్వయం ప్రతిపత్తి మాకు కావాలి.. మా ప్రాంతంపై మాకే నిర్ణయాధికారం ఉండాలి” అంటూ రావల్కోట్ లో జరిగిన భారీ బహిరంగ సభలో పీవోజెకే నేతలు గర్జించారు. రావల్కోట్,ముజఫరాబాద్, మీర్పూర్ వ్యాప్తంగా వేలాది మంది రోడ్లపైకి రాగా.. పాక్ సైన్యం, పోలీసులు జరిపిన అత్యంత పాశవికమైన కాల్పుల్లో 24 మంది నిరసనకారులు మరణించారు. ఇంటర్నెట్ నిలిపివేయగ, కీలక నేతలను అరెస్టు చేశారు. నిత్యావసర వస్తువులు సరఫరాను అడ్డుకోవడం, “జేఏఏసీ”పై ఉగ్రవాద ముద్ర వేసి నిషేధించడం వంటి పాక్ చర్యలపై ఐరాస మానవ హక్కుల సంఘం (UNHRC) సైతం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది.

“పీవోజెకే”లో పాక్ సైన్యం చేతుల్లో సొంత పౌరులు బలవుతుండటం, అంతర్జాతీయంగా పాకిస్థాన్ పరువు బజారున పడటంతో.. ఇస్లామాబాద్‌లోని పాలకులు అప్రమత్తమయ్యారు. ఈ దారుణాల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని, స్థానిక పాక్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే మంత్రి “ముసదిక్ మాలిక్” ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారత్‌ పై విషం వెళ్లగక్కారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ “సింధు జలాల ఒప్పందాన్ని” పక్కన పెట్టడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ తమ నీటిని అడ్డుకుంటోందని, అలా చేస్తే చేతులు నరుకుతామంటూ, యధాశక్తి గా దేశభక్తిని సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేశారు. కానీ, POJK ప్రజలు ఈ డ్రామాలను నమ్మే స్థితిలో లేరని క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్తున్నాయి.

వాస్తవానికి, పీవోజెకే ప్రజల్లో కొందరు తాము పాకిస్థాన్‌తో కాకుండా “స్వతంత్రంగా” ఉందామనే ఆలోచనను కూడా కలిగి ఉన్నారు. అయితే, ఒక దేశంగా విడిపోయి స్వతంత్రంగా మనుగడ సాగించాలంటే భారీ ఆర్థిక వనరులు, పరిపాలనా సామర్థ్యం, అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు అవసరం అవుతాయి. పీవోకే భూభాగం చుట్టూ కొండలు, లోయలు ఉండటం.. పారిశ్రామికీకరణ లేకపోవడంతో, కేవలం వ్యవసాయం లేదా నదులపైనే వారు ఆధారపడాల్సి వస్తోంది. ఆ దిశగా సొంతంగా నిలదొక్కుకునే పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన వనరులు ఆ ప్రాంతానికి లేకపోవడమే వారి అతిపెద్ద మైనస్ పాయింట్.

ఈ నేపథ్యంలోనే, “పీవోజెకే” మేధావులు మరియు అక్కడి సామాన్య ప్రజల చూపు సహజంగానే భారతదేశం వైపు మళ్ళుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతుండటం వారిని అమితంగా ఆకర్షిస్తోంది. పాకిస్థాన్ రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతూ, ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే.. భారతదేశం డిజిటల్ విప్లవంతో, పటిష్టమైన ఆర్థిక స్థిరత్వంతో ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలవడాన్ని వారు నిశితంగా గమనిస్తున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా.. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న భారత జమ్మూ కశ్మీర్ (J&K) లో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధి పీవోజెకే ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత కశ్మీర్‌లో రికార్డు స్థాయిలో పర్యాటకం పెరగడం, కొత్త ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు, ఐఐటీలు, ఎయిమ్స్ (AIIMS) వంటి భారీ విద్యా, వైద్య సంస్థలు ఏర్పాటు కావడం పీవోకే ప్రజల్లో అంతర్మథనం మొదలైంది. వాళ్ళను ఆలోచనలో పడవేసింది. “అవతలి కశ్మీర్ స్వర్గంలా మారుతుంటే.. ఇవతలి కశ్మీర్‌ను పాక్ నరకంలా మార్చింది” అనే భావన అక్కడి పౌరుల్లో బలంగా నాటుకుపోయింది.

భారతదేశం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉచిత రేషన్ పంపిణీ, స్థిరమైన నిత్యావసరాల ధరలు పీవోకే ప్రజలను భారత్ వైపు లాగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం “పీవోజెకే” లో ఉన్న నదుల నుండి విద్యుత్ వాడుకుంటూ అక్కడి ప్రజలకే భారీగా కరెంట్ బిల్లులు వేస్తుంటే.. భారత్ మాత్రం కశ్మీర్ లోని కుగ్రామాలకు సైతం ఉచిత విద్యుత్, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ ఆర్థిక వ్యత్యాసమే వారిని “స్వతంత్రంగా” ఉండే ఆలోచన నుండి “భారతదేశంలో విలీనం” అయితేనే తమ భవిష్యత్తు బంగారుమయం అవుతుందనే వాస్తవ భావనతో ఉన్నారు.

“పీవోజెకే”లో మారుతున్న ఈ ప్రతి సానుకూల పరిణామాన్ని మరియు ప్రజా మనోభావాలను “న్యూఢిల్లీ” అత్యంత నిశితంగా గమనిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పీవోకే ప్రజలు పాక్ పాలకులను అసహ్యించుకుంటూ భారత్ వైపు ఆశగా చూడటం, భారత రక్షణ మరియు దౌత్య వ్యూహకర్తలకు ఒక కీలకమైన మరియు చారిత్రాత్మక అవకాశంగా కనిపిస్తోంది. “పీవోజెకే” (POJK) అనేది చట్టబద్ధంగా భారత భూభాగమే, దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై భారత పార్లమెంట్ గతంలోనే ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి.

ముగింపుగా …

పాకిస్థాన్ ఎన్ని ‘జల’ నాటకాలు ఆడినా, భారత్‌పై ఎంతగా ఉగ్రవాద కక్ష సాధింపులకు దిగినా.. “పీవోజెకే”లో రగులుతున్న అసంతృప్తిని ఆపడం ఇస్లామాబాద్ వల్ల కాదు. స్వతంత్రంగా బతికే వనరులు లేకపోవడం, పాక్ అరాచకాలు తారాస్థాయికి చేరడం.. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి వారిని బలంగా ఆకర్షిస్తుండటంతో, పీవోకే ప్రజలు భారత్‌ వైపు అడుగులు వేయడమే ఏకైక మార్గంగా భావిస్తున్నారు. సొంత ప్రజల ప్రాణాలను బలితీసుకుంటూ, పొరుగు దేశాలపై అవాకులు చవాకులు పేలే పాక్ పాలకులకు “పీవోజెకే” ప్రజలే చరమగీతం పాడే రోజు అతి తొందరలోనే ఖాయంగా కనిపిస్తోంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading