
విద్యావేత్త నుంచి జాతీయ నాయకుడిగా, అఖండ భారతంగా దేశ వర్ధిల్లాలని, దేశ సమైక్యత కోసం మొదలైన ఆయన ప్రయాణం…. సదా చిరస్మరణీయం.
భారత రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు అధికారంలో ఉన్నంత కాలమే గుర్తుంటారు. మరికొందరు మాత్రం మరణించిన తర్వాత చిరంజీవులై చరిత్రలో నిలిచిపోతారు. డాక్టర్ “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” రెండో కోవకు చెందిన నాయకుడు. 1953లో ఆయన మరణించినా, ఏడు దశాబ్దాల తర్వాత కూడా భారత పార్లమెంట్‌లో, జమ్మూ కాశ్మీర్ చర్చల్లో, దేశ సమైక్యతపై జరిగే ప్రతి వాదనలో, భారతీయ జనతా పార్టీ భావజాలంలో ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు జులై 6 తేదీ, 2026లో ఆయన 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని “నరేంద్ర మోదీ” ప్రత్యేక వ్యాసం రాయడం అనేది…. ఆయన ప్రభావం, ఆయన ఆలోచనలు, ఆయనకు దేశం పట్ల ఉన్న నిబద్ధత, ఇప్పటికీ భారత రాజకీయాల్లో ఎంత బలమైన ముద్ర ఉందో సూచిస్తోంది. దీనిపై చిన్న విశ్లేషణ.
“శ్యామా ప్రసాద్ ముఖర్జీ” 1901 జూలై 6న కలకత్తాలో జన్మించారు. తండ్రి సర్ “అశుతోష్ ముఖర్జీ”. భారత దేశవిద్యా చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి. బెంగాల్ లోని పేరెన్నికగన్న గౌరవనీయులలో ఒకరు. ఆయనను “బెంగాల్ టైగర్” అని పిలిచేవారు. విద్య అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు, దేశ నిర్మాణానికి పునాది అనే భావనను తన కుమారుడిలో చిన్నప్పటి నుంచే నాటారు. ఆ ప్రభావమే శ్యామా ప్రసాద్ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.
చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచిన ఆయన, న్యాయశాస్త్రం చదివి, తరువాత ఇంగ్లాండ్‌లో కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ (University of Calcutta) ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ కాలంలో భారతదేశంలోనే అత్యంత పిన్న వయసులో ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఆయన ఒకరు. విద్యను భారత జాతీయ పునర్నిర్మాణానికి ప్రధాన ఆయుధంగా ఆయన చూశారు.
అయితే ఆయన జీవితం విద్యాసంస్థల గోడల మధ్యనే ఆగిపోలేదు. బ్రిటిష్ పాలన చివరి దశలో బెంగాల్ రాజకీయాలు తీవ్ర మత ఉద్రిక్తతలు, సామాజిక అస్థిరతతో నిండిపోయాయి. ఈ పరిణామాలు శ్యామా ప్రసాద్‌ను ప్రజా జీవితంలోకి తీసుకొచ్చాయి. మొదట ఆయన ప్రాదేశిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, తరువాత బెంగాల్ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. పరిపాలన అంటే కేవలం అధికారాన్ని వినియోగించడం కాదు, సంక్షోభ సమయంలో సమాజాన్ని నిలబెట్టడం కూడా అని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు.
1947లో భారత విభజన సమయంలో బెంగాల్ భవిష్యత్తు అత్యంత కీలక ప్రశ్నగా మారింది. మొత్తం బెంగాల్ పాకిస్తాన్‌లో కలిసిపోవాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ సందర్భంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉండాలనే వాదనకు “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” బలంగా తన వాణిని వినిపించారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భాగంగా కొనసాగడానికి అనేక రాజకీయ, సామాజిక, పరిపాలనా అంశాలు కలిసి పనిచేశాయి. వాటిలో శ్యామా ప్రసాద్ రాజకీయ ఉద్యమం కూడా ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. అందుకే ఆయన మద్దతుదారులు “కోల్‌కతా నేడు భారతదేశంలో ఉండటానికి ఆయన చేసిన కృషి కూడా ఒక కారణం” అని చెబుతారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ నవశక నిర్మాణం ప్రారంభమైంది. సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నప్పటికీ, తొలి ప్రధానమంత్రి “జవహర్ లాల్ నెహ్రూ” తన తొలి కేంద్ర మంత్రివర్గంలో “శ్యామా ప్రసాద్ ముఖర్జీ”కి పరిశ్రమలు మరియు సరఫరాల మంత్రిగా స్థానం కల్పించారు. స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రభుత్వంలో భిన్న అభిప్రాయాలు కలిగిన నాయకులను కూడా భాగస్వాములను చేయాలనే ప్రయత్నం జరిగింది. ప్రారంభంలో ఇద్దరి మధ్య మంచి సహకారం కనిపించినా, కొద్ది కాలంలోనే సిద్ధాంతపరమైన విభేదాలు బయటపడ్డాయి. నెహ్రూ లౌకికవాదం, అంతర్జాతీయ దౌత్యం, పొరుగు దేశాలతో సంబంధాలపై దృష్టి పెట్టగా, శ్యామా ప్రసాద్ జాతీయ భద్రత, దేశ సమైక్యత, శరణార్థుల రక్షణ వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. ఈ భిన్న దృక్కోణాలు క్రమంగా ప్రభుత్వ విధానాలపై విభేదాలకు దారితీశాయి.
1950లో జరిగిన (Nehru–Liaquat Pact)నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఈ విభేదాలను మరింత తీవ్రమయ్యేలా చేసింది. విభజన అనంతర పరిస్థితుల్లో ఇరు దేశాల్లోని మైనారిటీల (భారతదేశంలోని ముస్లింలు, పాకిస్తాన్‌లోని హిందువులు/సిక్కులు) హక్కులను పరిరక్షించడానికి, వారి భద్రతకు హామీ ఇవ్వడానికి ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ లు సంతకాలు చేశారు. నెహ్రూ ప్రభుత్వం దీన్ని శాంతి, విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా భావించగా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ అభిప్రాయం భిన్నంగా ఉండేది. తూర్పు పాకిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, వలసలు ఆగకపోతే ఈ ఒప్పందం ఎందుకు అని ఆయన వాదించారు. దేశ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు.
విభేదాలు చర్చలతో ముగియలేదు. చివరకు ఆయన కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. మంత్రి పదవి దేశ సేవకు ఒక మార్గం మాత్రమే, దేశ ప్రయోజనాల కంటే పదవికి విలువ ఇవ్వలేమనే సందేశాన్ని ఆయన తన చర్య ద్వారా ఇవ్వాలని బలంగా ప్రయత్నించారు. ఆయన మద్దతుదారులు దీన్ని సూత్రాల కోసం చేసిన త్యాగంగా అభివర్ణిస్తారు. మరోవైపు, కొందరు చరిత్రకారులు దీనిని స్వాతంత్ర్యానంతర భారతదేశంలో సిద్ధాంతపరమైన, రాజకీయ విభేదాలు ప్రారంభమైన కీలక ఘట్టంగా విశ్లేషిస్తారు.
మంత్రివర్గాన్ని వీడిన తర్వాత “శ్యామా ప్రసాద్ ముఖర్జీ” ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వాన్ని బయట నుంచి విమర్శించడం మాత్రమే సరిపోదని, తన ఆలోచనలకు రాజకీయ రూపం ఇవ్వాలని భావించారు. అదే ఆలోచన RSS మద్దతు తో 1951లో “భారతీయ జన సంఘ్” స్థాపనకు దారితీసింది. అప్పట్లో అది చిన్న పార్టీ. కానీ దాని ప్రధాన లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. దేశ సమైక్యత, బలమైన జాతీయ గుర్తింపు, సరిహద్దుల భద్రత, రాజ్యాంగం ముందు అందరికీ సమానత్వం.
ఈ దశ నుంచి శ్యామా ప్రసాద్ ముఖర్జీ రాజకీయ జీవితంలో అత్యంత కీలక అధ్యాయం ప్రారంభమైంది. ఆయన దృష్టి మొత్తం జమ్మూ-కాశ్మీర్‌పై పడింది. ఆయన సంధించిన ప్రశ్న, “భారతదేశం ఒక్కటే అయినప్పుడు, ఈ దేశంలో వేర్వేరు రాజ్యాంగాలు, వేర్వేరు జెండాలు, వేర్వేరు వ్యవస్థలు ఎందుకు ఉండాలి….?” అనే ప్రశ్నను ఆయన దేశవ్యాప్తంగా వినిపించడం ప్రారంభించారు. ఇదే ప్రశ్న తరువాత భారత రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసింది.
(భాగం–2లో:- జనసంఘ్ ఆవిర్భావం నుంచి జమ్మూ-కాశ్మీర్ ఉద్యమం, నెహ్రూ–షేక్ అబ్దుల్లాతో విభేదాలు, అరెస్టు, 1953లో మరణం, ఆ మరణం భారత రాజకీయాలను ఎలా మార్చిందనే అంశాలను విశ్లేషిస్తాం.)
