నెదర్లాండ్స్‌లోని భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కు ముందు రోజు కాకతాళీయం ఒక వివాదాస్పదమైన తీర్పు వచ్చింది. ది హేగ్ నగరంలో అంతర్జాతీయ న్యాయస్థానాలన్నీ (ICJ, PCA) ఈ నగరంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ నగరం భారత్-పాకిస్తాన్ జల వివాదానికి కేంద్రబిందువైంది. సింధు జలాల ఒప్పందం (IWT) లోని కిషన్‌గంగా, రాట్లే ప్రాజెక్టుల డిజైన్లపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CoA) పాకిస్తాన్‌కు అనుకూలంగా అదనపు తీర్పును ప్రకటించింది. అయితే, ఈ తీర్పు వెలువడిన తరుణంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్నారు. ఈ తీర్పును భారతదేశం ఏకపక్షమైనదిగా, చట్టబద్ధత లేనిదిగా (Null and Void) ప్రకటిస్తూ పూర్తిగా త్రోసిపుచ్చింది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ముద్దాయిగా నిలబెట్టాలని చూసిన పాకిస్తాన్ దౌత్య వ్యూహానికి, భారతదేశం తన సార్వభౌమ అధికారంతో గట్టి సమాధానమే ఇచ్చింది.
చట్టబద్ధత లేని సమాంతర విచారణ
భారతదేశం ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CoA) నిర్ణయాన్ని వ్యతిరేకించడం వెనుక బలమైన న్యాయపరమైన కారణాలు ఉన్నాయి. 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం.. వివాదాల పరిష్కారానికి మూడు అంచెల వ్యవస్థ ఉంది. భారత్ ఈ వివాదంపై ఒప్పంద నిబంధనల ప్రకారం తటస్థ నిపుణుల (Neutral Expert) ప్రక్రియను కోరగా, పాకిస్తాన్ ఏకపక్షంగా CoA విచారణను ఎంచుకుంది. ఒకే సమస్యపై రెండు సమాంతర ప్రక్రియలు ఒకే సమయంలో సాగడం ఒప్పంద స్ఫూర్తికే విరుద్ధం. అందుకే, ఈ ట్రిబ్యునల్ ఏర్పాటునే గుర్తించని భారతదేశం, దాని విచారణలను బహిష్కరించింది. రెండు పక్షాల భాగస్వామ్యం లేని ఏకపక్ష ట్రిబ్యునల్ తీర్పులకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం చట్టబద్ధత ఉండదనేది భారత్ వాదన.
చరిత్రలో మహ ఉదారత.. వర్తమానంలో మూల్యం
ఈ వివాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే 1960లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య కుదిరిన ఒప్పంద నేపథ్యాన్ని పరిశీలించాలి. ప్రపంచంలోనే అత్యంత దాతృత్వంతో కూడిన ఈ ఒప్పందం ప్రకారం.. సింధు నదీ పరివాహక ప్రాంతంలోని దాదాపు 80 శాతం నీటి వాటాను (పశ్చిమ నదులైన సింధు, ఝీలం, చీనాబ్ ద్వారా) పాకిస్తాన్‌కే కేటాయించారు. భారత్‌కు కేవలం 20 శాతం వాటా మాత్రమే దక్కింది. భారత భూభాగం గుండా ప్రవహించే నదులపై మన దేశానికి కనీస నీటి నిల్వ (Storage) ప్రాజెక్టులు కట్టకుండా ఆంక్షలు విధించారు. దీనివల్ల జమ్మూ కాశ్మీర్ దశాబ్దాలుగా తీవ్ర ఆర్థిక, విద్యుత్ కొరతను ఎదుర్కొంది. భారత్ చూపిన ఈ మహోదారతకు ప్రతిఫలంగా పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని మాత్రమే బహుమతిగా ఇస్తూ వచ్చింది.
పహల్గామ్ దాడి తో… వ్యూహాత్మక మలుపు
గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి తర్వాత భారత్ తన దౌత్య, జల వ్యూహాన్ని (Water Diplomacy) పూర్తిగా మార్చేసింది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు అనే దృఢమైన నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అంతర్జాతీయ ఒప్పందాల చట్టం (Vienna Convention) లోని నిబంధనలను ఉపయోగించి, సరిహద్దు అవతల నుండి ఉగ్రవాదం సాగుతున్నంత కాలం ఈ ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేమని చెప్తూ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది (Held in Abeyance). ఒప్పందమే నిలిపివేతలో ఉన్నప్పుడు, దానికి సంబంధించిన ట్రిబ్యునల్ తీర్పులను పాటించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రం లేదు.
ట్రిబ్యునల్ Vs అంతర్జాతీయ న్యాయస్థానం
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ తీర్పు ఇచ్చింది ఐక్యరాజ్యసమితికి చెందిన సర్వోన్నత అంతర్జాతీయన్యాయస్థానం(ICJ) కాదు. ఇది కేవలం శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం (PCA) కింద తాత్కాలికంగా ఏర్పాటైన ఒక ప్యానెల్ మాత్రమే. ఐక్యరాజ్యసమితి కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తే భద్రతా మండలి ద్వారా ఆంక్షలు వచ్చే ప్రమాదం ఉంటుంది కానీ, ఇలాంటి తాత్కాలిక ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులకు ఆ స్థాయి అంతర్జాతీయ జవాబుదారీతనం ఉండదు. రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలోనే ఉండటం వల్ల మీడియాలో ఇది అంతర్జాతీయ కోర్టు తీర్పుగా గందరగోళానికి గురైంది తప్ప, దీనికి ఎలాంటి అంతర్జాతీయ శాసన అధికారాలు లేవు.
మీడియా విశ్లేషణలు – క్షేత్రస్థాయి వాస్తవాలు
భారత జాతీయ మీడియా కూడా ఈ పరిణామాలను అత్యంత పరిణతితో విశ్లేషిస్తోంది. పాకిస్తాన్ కోర్టు కాగితాలపై సాధించిన ఈ తాత్కాలిక విజయం క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పునూ తీసుకురాలేదని మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే భౌగోళికంగా నదుల నియంత్రణ ఉన్న ఎగువ ప్రాంతం (Upper Riparian State) భారతదేశం చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం చీనాబ్, జీలం నదులపై భారత్ నిర్మిస్తున్న కిరు, పకల్ దుల్, రాట్లే, ప్రాజెక్టుల పనులు మునుపటి కంటే వేగంగా సాగుతున్నాయి. ఫలితంగా పాకిస్తాన్‌కు వెళ్లే నీటి ప్రవాహంలో గతేడాది దాదాపు 20 శాతం మేర తగ్గుదల కనిపించింది, ఇది వారి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. మనం కట్టే ఈ ప్రాజెక్టు లకు అంతర్జాతీయ బ్యాంకుల నుండి నిధులు తీసుకోకుండా, భారత్ తన సొంత నిధులతోనే ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. దీని వలన మనం ఎవరికీ జవాబుదారీతనం గా ఉండాల్సిన పని లేదు.
ముగింపు: పరిష్కారం ఎలా….
ఈ సుదీర్ఘ జల వివాదానికి పరిష్కారం ఇకపై అంతర్జాతీయ న్యాయస్థానాల కాగితాల్లో లేదు, అది కేవలం ఇస్లామాబాద్ వైఖరిలోనే ఉంది. పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం ఆపి, ముందుగా సరిహద్దు ఉగ్రవాదానికి స్వస్తి పలకాలి. 65 ఏళ్ల క్రితం నాటి శీతోష్ణ స్థితి, అప్పటిపరిస్థితులు వేరు, నాటి కాలంచెల్లిన ఒప్పందాన్ని పునఃసమీక్షించడానికి భారత్ ఇచ్చిన నోటీసులపై పాక్ స్పందన ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తూ, కోర్టుల చుట్టూ తిరగడమే తన వ్యూహంగా భావిస్తే.. భారత్ ఏకపక్షంగా తన మౌలిక సదుపాయాలను పెంచుకుంటూనే పోతుంది. అంతిమంగా నీటి పగ్గాలు పూర్తిగా భారత దేశం చేతుల్లోకి రావడం ఖాయం.