ఆంధ్ర ప్రదేశ్

“జనసైనికుల ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వను”.. కూటమిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Published by
Rahul N

పవన్ కళ్యాణ్ తాజాగా కూటమి రాజకీయాలు, జనసేన పార్టీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల ముందు ఏర్పడిన తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి రాష్ట్రానికి అవసరమైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లినప్పుడు తాను కూటమి నిర్ణయం ప్రకటించానని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. అప్పటి రాజకీయ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారేదని అన్నారు.

“అప్పటి పరిస్థితుల్లో ఎవరినీ మిగిల్చేవారు కాదు. ఇళ్లలోకి చొరబడి మన ఆడపిల్లలపై ఘోరాలు చేసే పరిస్థితులు వచ్చాయి. ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యను అసెంబ్లీలో అవమానించే స్థాయికి వైసీపీ నాయకులు దిగజారారు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మూడు పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అలాగే క్షేత్రస్థాయిలో కూటమి కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే విషయం తనకు పూర్తిగా తెలుసని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “ప్రతి విషయం నా దృష్టిలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసైనికులు, వీర మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా ఏదీ ఒప్పుకోను” అని స్పష్టం చేశారు.

“త్రికరణశుద్ధితోనే మనం ఈ పొత్తు ఏర్పాటు చేసుకున్నాం. క్షేత్రస్థాయిలో లోపాలుంటే కచ్చితంగా సరిదిద్దుతాను. మీ కోసం నిలబడతాను. మీ ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వను” అంటూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.

ఇప్పటి వరకు పరిపాలనలోని అంశాలను పూర్తిగా అధ్యయనం చేశానని, ఇక నుంచి పార్టీ బలోపేతంపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి పెడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Rahul N

Recent Posts