ప్రపంచంలో అతిపెద్ద “ప్రజాస్వామ్య దేశం” అని గర్వంగా చెప్పుకుంటున్నాము. తొందరలోనే మూడో “అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ” గా ఎదుగుతున్నాం అని సంబరపడి పోతున్నాం. “డిజిటల్ ఇండియా” అని మురిసిపోతున్నాం.. ‘విజన్ 2047’ తో అగ్రరాజ్యంగా ఎదుగుతామని ఆకాశమే హద్దుగా ప్రసంగాలు దంచికొడుతున్నాం.
కాని “మాటలు కోటలు దాటుతున్నాయి… కొందరి అధికారుల వల్ల చేతలు గడప దాటడం లేదు”. అని నిరూపిస్తున్నారు అధికారులు…. బాధ్యత లేని, తీసుకోని అధికారుల వల్ల, క్షేత్రస్థాయిలో పాలన అసలు గడప దాటుతోందా….? అంటే ప్రశ్నార్థకమే…. దీనికి “ఒడిశా”లోని “కేందుఝర్” జిల్లాలో జరిగిన అమానవీయ ఘటనే ఒక నిదర్శనం.
ఈ విషాదం వెనుక ఒక గుండెను పిండేసే నేపథ్యం ఉంది. మల్లిపాసి గ్రామానికి చెందిన కాల్రా ముండా తన పశువులను అమ్ముకోగా వచ్చిన దాదాపు 20 వేల రూపాయలను అత్యంత జాగ్రత్తగా బ్యాంకులో దాచుకుంది. ఆమెకు భర్త, కొడుకు లేరు అనారోగ్యంతో కాలం చేశారు. తను కూడా అనారోగ్యంతో, మరణశయ్యపై ఉన్న సమయంలో, తన తమ్ముడు జీతూ ముండాను పిలిచి..పశువులు అమ్మగా వచ్చిన డబ్బు ను బ్యాంకు లో వేశాను. “నా తర్వాత ఈ డబ్బు నీకే చెందుతుంది, నువ్వే తీసుకో” అని తన చివరి కోరికగా చెప్పింది. ఆ అక్క ఆశయాన్ని నెరవేర్చడానికి, ఆమె కష్టార్జితాన్ని దక్కించుకోవడానికి ఆ తమ్ముడు పడిన పాట్లు వర్ణనాతీతం.
అక్క చనిపోయిన తర్వాత ఆ డబ్బు కోసం “జీతూ ముండా” బ్యాంకు చుట్టూ తిరిగాడు. కానీ అక్కడ అతనికి ఎదురైంది చల్లని పలకరింపు కాదు, చట్టాల పేరుతో కఠినమైన అడ్డుగోడలు. చనిపోయింది మనిషి అని నమ్మడానికి ఆ బ్యాంకు సిబ్బందికి “డెత్ సర్టిఫికేట్” కావాలి. ఆ కాగితం ఎలా పొందాలో తెలియని ఆ అమాయక ఆదివాసీ, అధికారుల విసుగు ను తట్టుకోలేక.. చివరికి తన అక్క చెప్పిన మాటను మననం చేసుకుంటూ ….. తను ఆమెకు తమ్ముడిని అని ఎలా నిరూపించుకోవాలో…. తెలియని అమాయకత్వంతో, సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకు గడప తొక్కాడు. అక్కడ చనిపోయింది కేవలం ఆ మహిళ మాత్రమే కాదు… బాధ్యత గల ప్రభుత్వ వ్యవస్థ కూడా… అవును… చదువుకుని బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నవారికి కనీసం మానవత్వం కూడా లేకపోయే… ఆ అమాయకుడు విసిగిపోయి ఏమి చేయలేని స్థితిలో అస్థిపంజరం తో బ్యాంక్ ముంగిట నిలిచాడు.
పుడితే “బర్త్ సర్టిఫికేట్”, చస్తే “డెత్ సర్టిఫికేట్” ఇచ్చే కనీస బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలది. కాని ఆదివాసీ గూడాల్లో ఎవరు పుడుతున్నారో, ఎవరు చనిపోతున్నారో పట్టించుకునే నాథుడే లేడా….? బ్యాంకు వారు అడిగిన “వారసత్వ” (Succession) కాగితాల అర్థం తెలియక, తన సోదరి సమాధిని తానే తవ్వి స్వయంగా తీసుకువస్తేనే, తన వారసత్వం నిరూపితం అవుతుందని భావించిన ఆ వ్యక్తి అమాయకత్వం ముందు …. మన ఆధునిక పాలన దిగదుడుపేనా …. అది చూసి మురిసిపోతున్న మనకు అంటే ఆధునికులుగా చెప్పుకుంటున్న, అధికారులకు, రాజకీయ నాయకులకు ఇది చెంప పెట్టు లాంటిది కాదా…
అస్థిపంజరం వచ్చాకే కదిలిన సిబ్బంది…. ఇది నేటి సమాజం తల దించుకోవలసిందే… ఈ సంఘటనతో… అస్థిపంజరం బ్యాంకు గడప తొక్కిన తర్వాత కాని అధికారుల కళ్ళు తెరవలేదు. అప్పుడు పుట్టుకొచ్చాయి సర్టిఫికేట్లు. సమాచారం అందిన వెంటనే పోలీసులు బ్యాంకుకి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో అస్థిపంజరాన్ని తిరిగి శ్మశానవాటికలో ఖననం చేశారు. ఈ ఘటనపై కియోంఝర్ జిల్లా కలెక్టర్ స్పందించారు. “కాల్రా ముండా” ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తం జీతూకి చెల్లించినట్టు చెప్పారు. తహసీల్దార్, బ్యాంకు అధికారులతో మాట్లాడి.. కాల్రా ఖాతాలో జమచేసిన రూ. 19,300కి వడ్డీతో కలిపి రూ. 19,402 మంగళవారం జీతూకు అందజేశారు. రెడ్ క్రాస్ వంటి సంస్థలు మానవత్వంతో కొంత సహాయం చేసినా, అసలు ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. ఒక సామాన్యుడు తన గోడును వినిపించుకోవడానికి ఇంతటి ఘోరానికి ఒడిగట్టే వరకు వేచి చూడటం ఏ రకమైన పురోగతి… ఏ రకమైన పాలన.
ముగింపు: వారసత్వ ధృవీకరణ పత్రాల కంటే.. బాధ్యతను గుర్తించే మనసు అధికారులకు ఉండాలి. డిజిటల్ సంతకాల కంటే ముందే క్షేత్రస్థాయిలో ఉన్న ఆదివాసీల కష్టాలను తీర్చే “సంతకం” విలువ పెరగాలి. లేదంటే, మన విజన్ 2047 లక్ష్యాలు కేవలం కాగితాల మీద అలా లక్ష్యాలను పెంచుకుంటూ పోవడమే, పేపర్ మీద వెలుగులు గానే మిగిలిపోతాయి, సామాన్యుల బతుకులు ఎప్పటికీ చీకట్లోనే ఉండిపోతాయి.
“గాయం” సినిమాలో “సిరివెన్నెల సీతారామశాస్త్రి” రచనలో చెప్పినట్టుగా …..
“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని..
మారదు లోకం.. మారదు కాలం…
దేవుడు దిగి రాని ఎవ్వరు ఏమై పోని..
మారదు లోకం మారదు కాలం”…..
ఏమి చేస్తే మారుతుంది లోకం… ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉంటే.. మారుతుంది ఏమో… అని చిన్ని ఆశ…