Download App

దౌత్యమే బలం… వ్యూహమే ఆయుధం… ‘యూఏఈ – భారత్’ సరికొత్త బంధం…

మే 1, 2026 By Suresh Thota
"సమస్యలు సముద్రమంత ఉన్నా…. పరిష్కారానికి దారి వెతికేవాడే అసలైన వ్యూహకర్త." ఇది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విధానం. ఎవరు ఎందుకు, ఎప్పుడూ విదేశాలకు వెళ్తున్నారో చాలామంది కి అర్థం కాదు. మన దేశ చుట్టుపక్కల దేశాలు చమురు విషయంలో రోజు, రోజుకు సంక్షోభం లోకి కురుకుపోతున్నాయి. ముందు...
దౌత్యమే బలం… వ్యూహమే ఆయుధం… 'యూఏఈ - భారత్' సరికొత్త బంధం…

“సమస్యలు సముద్రమంత ఉన్నా…. పరిష్కారానికి దారి వెతికేవాడే అసలైన వ్యూహకర్త.” ఇది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విధానం. ఎవరు ఎందుకు, ఎప్పుడూ విదేశాలకు వెళ్తున్నారో చాలామంది కి అర్థం కాదు. మన దేశ చుట్టుపక్కల దేశాలు చమురు విషయంలో రోజు, రోజుకు సంక్షోభం లోకి కురుకుపోతున్నాయి. ముందు చూపు తో వ్యవహరిస్తున్న భారత్ జెండా మాత్రం ఠీవీగా నిలబడిచూస్తుంది.

అంతర్జాతీయ ఇంధన రంగంలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న “ఒపెక్” (OPEC) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మే 1, 2026 నుండి తప్పుకుంటున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రకటించడం, కేవలం ఒక దేశం తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, ఇది ప్రపంచ చమురు మార్కెట్ గమనాన్ని మార్చబోయే ఒక ఆర్థిక వ్యూహాత్మక విస్ఫోటనం.

ఈ నిర్ణయం వెనుక అసలు కారణాలు విశ్లేషిస్తే, ఆర్థిక స్వేచ్ఛే ప్రధాన కారణంగా కనపడుతుంది. “యూఏఈ” తప్పుకోవడానికి ప్రధానంగా మూడు విషయాలు కనిపిస్తున్నాయి.

“ఒపెక్” కూటమిలో సభ్య దేశాలు ఎంత చమురును ఉత్పత్తి చేయాలో ఆ సంస్థే నిర్ణయిస్తుంది. “యూఏఈ”కి రోజుకు 5 మిలియన్ బారెల్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, “ఒపెక్” నిబంధనల వల్ల వారు తమ ఉత్పత్తి ని పూర్తి స్థాయి లో వెలికితీయలేక పోతున్నారు. తమ సహజ వనరులను గరిష్టంగా అమ్ముకుని ఆదాయాన్ని పెంచుకోవాలని “యూఏఈ” భావిస్తోంది. “ఒపెక్” లో సౌదీ అరేబియా ఆధిపత్యాన్ని “యూఏఈ” గత కొంతకాలంగా వ్యతిరేకిస్తోంది. రష్యా వంటి దేశాలతో కలిసి సౌదీ అరేబియా తీసుకుంటున్న నిర్ణయాలు తమ ఆర్థిక ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయని “యూఏఈ” భావిస్తుంది. ప్రపంచం క్లీన్ ఎనర్జీ వైపు మళ్లుతున్న తరుణంలో, డిమాండ్ తగ్గకముందే తమ దగ్గర ఉన్న చమురు నిల్వలను నగదుగా మార్చుకుని, ఆ సొమ్మును టెక్నాలజీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడిగా పెట్టాలని “యూఏఈ” యోచిస్తోంది.

హార్ముజ్ జలసంధి తో ముప్పు మూలంగా “యూఏఈ” ఒక పథకం ప్రకారం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి మూసివేత దశకు చేరుకుంది. ప్రపంచ చమురు రవాణాలో 20% పైగా ఈ మార్గం నుండే సాగుతుంది. అయితే “యూఏఈ” దీనికి ముందే ఒక విరుగుడు కనిపెట్టింది.

అబుదాబి నుండి ఒమన్ గల్ఫ్ తీరంలోని ఫుజైరా వరకు 370 కి.మీల మేర విస్తరించిన పైప్‌లైన్ ద్వారా యూఏఈ తన చమురును హార్ముజ్ జలసంధిలోకి వెళ్లకుండానే సముద్ర మార్గంలో ఎగుమతి చేయగలదు. ఫుజైరా పైప్‌లైన్ ద్వారా చమురు నిల్వ సామర్థ్యం చాలా పెంచుకున్నది. ఫుజైరాలో నిర్మించిన భారీ నిల్వ కేంద్రాలు ప్రపంచంలోనే అతిపెద్దవి. ఇవి యుద్ధ సమయంలో కూడా సరఫరాకు ఆటంకం కలగకుండా చూస్తాయి. దీని ద్వారానే ఇప్పుడు చమురు వ్యాపారం చేయబోతున్నది “యూఏఈ”.

“యూఏఈ” ఈ సంచలన నిర్ణయం ప్రకటించడానికి కొద్దిరోజుల ముందే భారత జాతీయ భద్రతా సలహాదారు “అజిత్ దోవల్”, ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ “యూఏఈ”లో పర్యటించడం ముందస్తు సంప్రదింపులకే అని రూడీ అయ్యింది. భారతదేశం, యూఏఈకి అతిపెద్ద చమురు వినియోగదారు. ఒపెక్ నుండి బయటకు వచ్చిన తర్వాత “యూఏఈ” పెంచబోయే ఉత్పత్తిలో సింహభాగం భారత్‌కే దక్కేలా మన నేతలు హామీలు పొంది ఉండవచ్చు అని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

గతంలో రష్యా నుండి తక్కువ ధరకు చమురు పొందినట్లుగానే, ఇప్పుడు యూఏఈ నుండి కూడా ప్రత్యేక రాయితీలతో చమురును దిగుమతి చేసుకునే లా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది అని కొన్ని అంతర్జాతీయ వెబ్ సైట్లు రాసుకొస్తున్నాయి. ఇది భారత్‌లో ఇంధన ధరలను తగ్గించడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సహాయ పడుతుంది.

“ఒపెక్” నుండి యూఏఈ బయటకు రావడం తో, భారత్‌ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు “యూఏఈ” నిర్ణయం మన దేశానికి ఒక వరం లాంటిది. ఇంధన భద్రత విషయంలో “ఒపెక్” మీదనే ఆధారపడకుండా, నేరుగా యూఏఈతో ఒప్పందాలు చేసుకోవడం వల్ల మనకు ఇంధన భద్రత పెరుగుతుంది.

దీనితో మనకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. చమురు ధరలు తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. ఇది సామాన్యుడిపై భారాన్ని తగ్గిస్తుంది.

“యూఏఈ” నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్‌లో “ఒపెక్” గుత్తాధిపత్యాన్ని దెబ్బతీసేలా ఉంది. అదే సమయంలో, మారుతున్న ఈ సమీకరణాలను భారత్ తన దౌత్య చాకచక్యంతో అనుకూలంగా మార్చుకుంటోంది. హార్ముజ్ జలసంధి మూతపడినా, “యూఏఈ” ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత ఇంధన దాహం తీర్చే నమ్మకమైన భాగస్వామిగా అవతరిస్తోంది.

ముగింపు : “అవకాశం కోసం వేచి చూడటం కాదు.. వచ్చే అవకాశాన్ని ముందే పసిగట్టి అడుగు వేయడమే భారత దౌత్య లక్షణం… అదే భారత్ విజయం”.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading